Sat Jan 11 2025 08:48:50 GMT+0000 (Coordinated Universal Time)
Makara Sankranthi : పండగ అంటే ఇదే.. మకర సంక్రాంతి అంటే ఏంటి?
మకర సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పండగ. ప్రతి ఏటా మకర సంక్రాంతి జనవరి 14వ తేదీన జరుగుతుంది
మకర సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పండగ. ప్రతి ఏటా మకర సంక్రాంతి జనవరి 14వ తేదీన జరుగుతుంది. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తారని అంటారు. దేశ వ్యాప్తంగా పంటలు చేతికొచ్చే సమయం కావడంతో దీనిని రైతులు పండగగా భావిస్తారు. మూడు రోజులు జరిగే ఈ పండగను అత్యంత ఆనందంగా జరుపుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. సంక్రాంతి రైతులకు ప్రత్యేక పండగ. పంటలు చేతికి వస్తుండటంతో పశువులను అలంకరిస్తారు. నాగళ్లతో పాటు అనేక వ్యవసాయ పనిముట్లకు కూడా పూజలు నిర్వహిస్తారు. దీంతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు కూడా ఈ పండగ వేళ అందరినీ అలరిస్తాయి.
గొబ్బెమ్మలు.. రంగవల్లులు...
సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు.. అందమైన రంగవల్లులు.. పల్లెల్లో అందాలు.. ఇలా ఈ మూడు రోజుల పండగను మాటలతో వర్ణించలేం. దీంతోపాటు శీతల గాలులు చల్లగా పలుకరిస్తాయి. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించడాన్నిసంక్రమణం అంటారు. మకర సంక్రాంతితోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. ఈ కాలంలో చనిపోతే స్వర్గానికి చేరుకుంటామని నమ్ముతారు. స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయని భావిస్తారు. దేశమంతా ఈ పండగ జరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగగా పిలుస్తారు. తమిళనాడులో ఈ పండగను పొంగల్ అని పిలుస్తారు. పంజాబ్, హర్యానాలో లోరి అని, మహారాష్ట్ర, గుజరాత్ లో మకర్ సంక్రాంతి అని అంటారు.
నెల రోజుల ముందు నుంచే...
నెల రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యే ఈ పండగ వేడుకలు ఈ నెల 16వ తేదీతో ముగుస్తాయి. హరినామ సంకీర్తనలతో వీధులన్నీ మారుమోగిపోతాయి. హరిదాసుల కీర్తనలు చెవులకు ఇంపుగా మారతాయి. వీటితో పాటు పిండి వంటలు నోరు ఊరిస్తాయి. సంక్రాంతికి చేసే అరిశలు సర్వరోగ నివారిణిగా చెబుతారు. ప్రతి ఇంట్లో అరెసెలు చేయడం తప్పనిసరిగా కనిపిస్తుంది. పల్లెల్లో ఎక్కువగా ఈ పండగ శోభ కనిపిస్తుంది. వీటికి తోడు ఎడ్ల పందేలు, కోడి పందేలు కూడా ప్రజలను ఆకట్టుకుంటాయి. సంక్రాంతి పండగ అంటేనే అదొక మజా.. కొత్త బట్టలు ధరించి తల స్నానం చేసి పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలసి విందుభోజనాలు చేయడం ఈ సంక్రాంతి స్పెషల్ అనే చెప్పాలి. సంక్రాంతి మరుసటి రోజు తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు. దీనిని పెద్దల రోజుగా కూడా భావిస్తారు.
మూడు రోజులు ఇలా...
నెల 13వ తేదీ భోగిపండగ జరుపుకుంటారు. ఉదయాన్నే ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులను మంటల్లో వేసి పూజలు చేస్తారు. అదే భోగి మంటల్లో పరమాణ్ణం వంటివి వండి ప్రసాదంలా స్వీకరిస్తారు. మరుసటి రోజు అంటే 14వ తేదీ మకర సంక్రాంతిని అందరూ జరుపుకుంటారు. ఈరోజు శబరిమలలో అయ్యప్ప జ్యోతి దర్శనం కూడా లభిస్తుంది. మకర సంక్రాంతి అంటే మెయిన్ పండగ. ఈరోజు కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అలాగే 15వ తేదీన కనుమగా చేసుకుంటారు. భోగి, సంక్రాంతి రోజున కేవలం వెజిటేరియన్ వంటలే చేసుకునే వారు కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ కు ప్రాధాన్యమిస్తారు. కనుమ రోజు కాలు కదప కూడదంటారు. ప్రయాణాలు ఎక్కువ మంది చేయరు. అదొక నమ్మకం. కనుమ మరుసటి రోజు ముక్కనుమగా కూడా పిలుస్తారు. ఇలా సంక్రాంతి పండగ మూడు రోజులు పండగ చేసుకుంటారు.
Next Story