బ్రిటీషర్ల అరాచకాన్ని 160 ఏళ్ల తర్వాత బయటపెట్టిన బావిలోని పుర్రెలు, ఎముకలు
బ్రిటీషర్ల చేతిలో ఊచకోతకు గురైన భారతీయులవే అని చరిత్రకారులు కూడా అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఆ అస్థిపంజరాలలో ఉన్న రహస్యం
పంజాబ్ : కళేబరాలు రహస్యాలను బయట పెడతాయని అంటూ ఉంటారు. అయితే అది నిజమేనని కొన్ని కొన్ని సార్లు నమ్మక తప్పదు. 2014 సంవత్సరంలో పంజాబ్లోని అజ్నాలా ప్రాంతంలో ఒక పురాతన బావి నుండి 160కి పైగా అస్థిపంజరాలు బయటపడిన వార్త అప్పట్లో దేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గా మారింది. అవి ఎప్పటివి.. ఎక్కడివి అనే ప్రశ్న దేశ ప్రజల్లో మెదిలింది. బ్రిటీషర్ల చేతిలో ఊచకోతకు గురైన భారతీయులవే అని చరిత్రకారులు కూడా అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఆ అస్థిపంజరాలలో ఉన్న రహస్యం బయటకు వచ్చింది. 2014లో అజ్నాలా బావిలో బయటపడ్డ ఈ అస్థిపంజరాలు ఎవరివి అనే అంశాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఇతర భారత పరిశోధన సంస్థలు విస్తృతంగా పరిశోధనలు జరిపాయి. ఆ అస్థిపంజరాలు 1857లో బ్రిటీష్ ఆర్మీ చేత చంపబడిన భారత సిపాయిలవే నని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు, పంజాబ్ యూనివర్సిటీ, బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్(లక్నో), బనారస్ హిందూ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ అస్థిపంజరాల మూలాలను గుర్తించేందుకు డీఎన్ఎ, ఐసోటోప్స్ ఆధారంగా పరిశోధనలు చేశారు. ఫ్రంటైర్స్ ఇన్ జెనెటికస్ అనే జర్నల్లో ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిష్ చేశారు.