Mon Dec 23 2024 04:50:01 GMT+0000 (Coordinated Universal Time)
Kejriwal : ఆ క్రేజ్ అంతా ఏమయిపోయింది.. చివరకు లిక్కర్ స్కామ్లో ఇలా ఇరుక్కుపోయి
అవినీతిపై పోరాడేందుకు ఆవిర్బవించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నేడు కరప్షన్ కేసులోనే అరెస్టయ్యారు
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే.. సామాన్యుడి పార్టీ అని అర్థం. ఆ పార్టీ గుర్తు కూడా చీపురు. సామాన్యులకు అండగా నిలిచే, పేదల పక్షాన ఉండే పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. అదే పార్టీ అధినేతకు నేడు అవినీతి మరకలు అంటాయి. అరవింద్ కేజ్రీవాల్.. 1999 వరకూ ఎవరికీ తెలియదు. అవినీతి ఉద్యమంలో ఆయన అన్నాహజారే వెంట ఉండటంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఐఆర్ఎస్ అధికారిగా ఉండి ఆయన అన్నాహజారేతో కలసి అవినీతిపై యుద్ధం ప్రారంభించడంతో దేశమంతటా ఈ పేరు మారుమోగిపోయింది.
ఐఆర్ఎస్ ఉద్యోగిగా...
ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన అరవింద్ కేజ్రీవాల్ తొలుత టాటాస్టీల్ కంపెనీలో పనిచేశారు. అయితే 1993లో ఆయన సివిల్స్ పరీక్షలో పాసై ఐఆర్ఎస్ అధికారిగా బాధ్యతలను చేపట్టారు. 1999లో పరివర్తన్ ఉద్యమాన్ని ఆయన చేపట్టారు. అప్పుడే ఆయన పేరు దేశమంతటా తెలిసింది. అన్ని సామాజిక సమస్యలకు అవినీతి కారణమని విశ్వసించిన ఆయన అవినీతిపై పోరాటాన్ని ప్రారంభించారు. తన సహచర ఉద్యోగి సునీతను వివాహమాడిన తర్వాత ఆయన పూర్తి కాలం అవినీతిపై పోరాడాలని నిర్ణయించుకుని తన పదవికి రాజీనామా చేశారు. అక్కడి నుంచి అన్నాహజారే వెంట ఉంటూ అవినీతిపై పోరాటానికి తన వంతు ప్రయత్నం చేశారు.
అవినీతిపై పోరాడుతూ...
హర్యానాలో జన్మించిన అరవింద్ కేజ్రీవాల్ 2006లో పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ ను స్థాపించారు. 2010 నుంచి అన్నాహజారేతో కలసి జన్లోక్పాల్ బిల్లుకోసం ఉద్యమం చేశారు. అప్పుడే కేజ్రీవాల్ పేరు దేశమంతా తెలిసింది. పల్లెల్లో యువత కూడా కేజ్రీవాల్ పేరును జపించేలా ఆయన పేరు అందరికీ తెలిసింది. అయితే రాజకీయాలతోనే అవినీతిని రూపుమాపవచ్చని భావించి ఆయన చివరకు అన్నాహజారేతో కూడా విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 2012లో ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. యువతను, మేధావులను తన పార్టీలోకి ఆహ్వానించారు. 2013లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లను గెలిచి కాంగ్రెస్ మద్దతుతో తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరికీ సీట్లు తగినన్ని రాకపోవడంతో కాంగ్రెస్ మద్దతిచ్చింది.
మూడుసార్లు ఢిల్లీ సీఎంగా...
ఆ తర్వాత వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరోసారి ప్రజా తీర్పు కోరారు. భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఢిల్లీలోని 70 స్థానాలకు 67 స్థానాల్లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఈసారి 62 స్థానాలను గెలుచుకున్నారు. తర్వాత పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నించారు. పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఇటీవల స్థాపించగలిగారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ పోటీ చేసి తమ కంటూ ఒక ఓటు బ్యాంకును మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ సంపాదించుకోగలిగింది. మోదీపై కూడా వారణాసి నుంచి పోటీ చేసి కేజ్రీవాల్ క్రేజీగా మారారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ...
అయితే ఆయన ఢిల్లీలో పదేళ్ల పాలనలో అనేక సంస్కరణలు తెచ్చారు. పేదలకు విద్య, వైద్యం అందించాలని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. కానీ ఆయన మెడకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టుకుంది. ఢిల్లీలో లిక్కర్ పాలసీ మార్చడంతో ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి. లిక్కర్ వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు ఆప్ పొందిందని ఈడీ, సీబీఐలు కేసు నమోదు చేశాయి. ఆయన మంత్రివర్గంలో అనేక మంది జైలు పాలయ్యారు. చివరకు ఆయనను కూడా లిక్కర్ స్కామ్ వదలలేదు. వెంటాడి చివరకు ఆయన అరెస్ట్ అయ్యేలా చేసింది. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయన్నది తెలియకపోయినప్పటికీ అరవింద్ పై అవినీతి మరక పడటం ఈ కేసులోనే. మరి ఈ కేసు నుంచి కేజ్రీవాల్ ఎలా బయటపడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story