Mon Dec 23 2024 17:29:13 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం: తల్లిదండ్రులు చనిపోయాక ఆ ముగ్గురూ కొన్నేళ్లుగా బయటకే రాలేదట
గంటల తరబడి కౌన్సెలింగ్ తర్వాత చివరకు ముగ్గురు మాట విన్నారు. మూడేళ్ల తర్వాత ఆ ముగ్గురూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఓ కుటుంబం తల్లిదండ్రులను కోల్పోయింది. అయితే అప్పటి నుండి ఆ ఇంటిలోని పిల్లలు కొన్నేళ్లుగా బయటకు రాలేదు. వారేమైపోయారో కూడా చుట్టుపక్కల వాళ్లకు తెలీదు.. ఇంటి నుండి దుర్వాసన రావడంతో అధికారులు వారిని సంప్రదించాలని అనుకున్నారు. తలుపు తడితే బయటకు కూడా రాలేదు.. కనీసం ముఖాలు కూడా చూపించలేదు. ఇక అధికారులు ఓ మానసిక వైద్య నిపుణుల సహాయంతో మాట్లాడితే కానీ ఆ ఇంట్లో ఉన్న ఒక యువకుడు.. అతడి అక్క చెల్లెలు మాట్లాడేందుకు ముందుకు రాలేదు.
పోలీసులతో పాటు ఉన్న మానసిక వైద్యులు ముగ్గురికి వారి భద్రత గురించి భరోసా ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించారు. గంటల తరబడి కౌన్సెలింగ్ తర్వాత చివరకు ముగ్గురు మాట విన్నారు. మూడేళ్ల తర్వాత ఆ ముగ్గురూ బయటి ప్రపంచాన్ని చూశారు. అనంతపురం వేణుగోపాల్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబటి తిరుపాల్శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరికి వివాహం కాలేదు.. వారి తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు మానసికంగా బాగా కుంగిపోయారు. 2016లో తండ్రిని కోల్పోయారు. ఒక సంవత్సరం తర్వాత వారి తల్లి క్యాన్సర్తో మరణించింది. వాళ్ల నాన్న రామయ్య శెట్టి హోటల్ నడుపుతూ మంచి పేరు సంపాదించారు. కానీ ఊహించని విధంగా వారి కుటుంబం.. ఇలా మారిపోయింది. ఈ ముగ్గురు అప్పటి నుంచి బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు.
కోవిడ్-19 పరిస్థితులు ముగ్గురి పరిస్థితిని మరింత దిగజార్చింది. లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తాళం వేసుకున్నారు. తిరుపాల్ శెట్టి మాత్రమే అప్పుడప్పుడు ఆహార పొట్లాలు, నీళ్ళు కొనుక్కోవడానికి బయటకు వచ్చేవాడు. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారి విద్యుత్ కనెక్షన్ కూడా నిలిచిపోయింది. వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఫకీరప్పను అప్రమత్తం చేశారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు అతని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. లోపల చాలా అపరిశుభ్రమైన స్థితిలో ఉన్న ముగ్గురిని గుర్తించారు. తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులకు వచ్చే వడ్డీని నెలకోసారి తిరుపాల్ తీసుకుంటారు. రోజూ అరగంటపాటు బయటకెళ్లి కావాల్సిన భోజనాలు, తాగునీరు తెస్తారు. ఆ తర్వాత ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకుంటారు. కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో రెండేళ్ల కిందట అధికారులు ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. అప్పటినుంచి రాత్రిళ్లు చీకట్లోనే గడుపుతున్నారు. దాదాపు మూడేళ్లుగా వీళ్లు ఇంట్లోనే ఉంటున్నారు.
సాలెపురుగులు, ఎలుకలు, టన్నుల కొద్దీ ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు పక్కన పడేసినట్లు గుర్తించారు అధికారులు. ఈ ముగ్గురూ చిందరవందరగా ఉన్న జుట్టుతో, పెరిగిన గోళ్లతో అధ్వాన్నంగా ఉన్నారు. నెలల తరబడి స్నానం కూడా చేయలేదు. అధికారులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అనంతరం పోలీసులు ముగ్గురికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సైకియాట్రీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. వరదరాజును ఆశ్రయించారు. చివరకు వారిని బయటకు రమ్మని ఒప్పించాడు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ అమ్మానాన్న చనిపోయాక బాధతో ఉన్నామని.. జనాల్లోకి రావడానికి ప్రయత్నిస్తామని బాధితుడు తిరుపాల్శెట్టి అంటున్నారు.
"మేము బాగానే ఉన్నాము, మా తల్లిదండ్రుల మరణం తరువాత, మేము బాధలో ఉండిపోయాము. బయటికి రాలేదు. సమీపంలోని హోటల్ నుండి ఆహారం తెచ్చుకునే వాళ్లం. మా బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బు ఉంది, నేను విత్ డ్రా చేసేవాన్ని" అని తిరుపాల్ శెట్టి అన్నారు. తోబుట్టువులను బయటకు తీసుకువచ్చినప్పటికీ, వారు ఇప్పటికీ ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. విషయం తెలియడంతో వందల మంది జనం ఆ ఇంటివద్ద పోగయ్యారు. ధైర్యం చేసి కొందరు ఆ ఇంట్లోకి వెళ్లారు. వారిని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.
- Tags
- Anantapur
Next Story