Tue Dec 24 2024 02:41:34 GMT+0000 (Coordinated Universal Time)
Tattoo: తొడ మీద శత్రువుల పేర్లు రాసుకున్నాడు.. చంపినోళ్ళను పట్టించింది
22 మంది వ్యక్తుల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు
స్పాలో హత్యకు గురైన గురుసిద్ధప్ప వాఘ్మారే అలియాస్ చుల్బుల్ పాండే తనకు హాని కలిగించే 22 మంది వ్యక్తుల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. నేరం జరిగిన రోజు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో స్పా యజమాని సంతోష్ షెరేకర్ పేరు కూడా ఈ 22 మందిలో ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అతనితో పాటు, ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశామని.. మిగిలిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
గురుసిద్ధప్ప వాఘ్మారే అలియాస్ చుల్బుల్ పాండే (48) అనే వ్యక్తి సమాచార హక్కు కార్యకర్త అని చెప్పుకుంటూ పలు క్రైంలలో భాగమయ్యాడు. అతనిపై అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున సెంట్రల్ ముంబైలోని వర్లీలోని సాఫ్ట్ టచ్ స్పాలో హత్యకు గురయ్యాడు. శవపరీక్ష సమయంలో, అతని తొడలపై తన శత్రువుల పేర్లను రాసుకున్నట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు.
వాఘ్మారే దోపిడీలు, బెదిరింపులతో విసిగిపోయిన స్పా యజమాని షెరేకర్ అతడిని చంపడానికి 'సుపారీ' ఇచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు. వాఘ్మారే ను హత్య చేసేందుకు మహ్మద్ ఫిరోజ్ అన్సారీ (26)కి 6 లక్షలు ఇచ్చారు. అన్సారీ, షెరేకర్లు ఒకరికొకరు తెలుసు. అన్సారీ కూడా ముంబైలో స్పాను నడుపుతున్నాడు. వాఘ్మారే అధికారులకు ఫిర్యాదు చేయడంతో అన్సారీ స్పాను కూడా మూసేసారు. స్పా యజమానుల నుండి డబ్బు వసూలు చేస్తూ ఉండడంతో విసిగిపోయి వాఘ్మారేను చంపేయాలని అనుకున్నారు.
అన్సారీ ఢిల్లీ నివాసి సాకిబ్ అన్సారీని సంప్రదించగా, మూడు నెలల క్రితమే అతడిని చంపడానికి కుట్ర పన్నారు. మూడు నెలల పాటు వాఘ్మారే దినచర్యను అధ్యయనం చేసి, అతనిని షేరేకర్ స్పాలో చంపాలని నిందితులు ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం వాఘ్మారే తన 21 ఏళ్ల ప్రియురాలితో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు. సియోన్‌లోని బార్ వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రెయిన్కోట్లు ధరించిన ఇద్దరు వాఘ్మారే ను అనుసరించారు. ఆ రాత్రి తర్వాత ఇద్దరూ వాఘ్మారేను స్కూటర్‌పై షెరేకర్ స్పాకు అనుసరించారు. దుండగుల్లో ఒకరు బార్ దగ్గర పాన్ షాపులో యూపీఐ విధానంలో చెల్లించి రెండు గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీ అని తేలింది.
అన్సారీ UPI IDకి లింక్ చేసిన ఫోన్ నంబర్ నుండి షెరేకర్‌కు అనేక కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఫిరోజ్, సాకిబ్ అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో స్పాలోకి ప్రవేశించారు. వాఘ్మారే స్నేహితురాలిని మరొక గదికి తీసుకెళ్లారు. రెండు బ్లేడ్లను ఉపయోగించి వాఘ్మారేను హత్య చేశారు. బ్లేడ్లలో ఒకటి అతని గొంతు కోసేందుకు, మరొకటి కడుపులో పొడిచేందుకు ఉపయోగించారు. వాఘ్మారే స్నేహితురాలు ఉదయం 9.30 గంటలకు హత్య గురించి తెలుసుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు షెరేకర్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. రోజంతా విచారణ చేసిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. ఫిరోజ్ అన్సారీని సబర్బన్ నలసోపరా నుండి క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్టు చేసింది. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశామని, వాఘ్మారే గర్ల్‌ఫ్రెండ్ పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు.
Next Story