Thu Jan 02 2025 23:26:06 GMT+0000 (Coordinated Universal Time)
Alliance : ఇద్దరిదీ ఒకటే బాట.. అందుకే రాజకీయాల్లో ఇద్దరి నడక ఒకే తరహాలోనే
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు రాజకీయంగా పోలికలు ఉన్నాయి
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కు రాజకీయంగా పోలికలు ఉన్నాయి. ఒకరిది బీహార్.. మరొకరిది ఆంధ్రప్రదేశ్ .. అయినా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. ఎత్తుగడలూ అంతే. అందుకే వీరిద్దరూ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో మనగలుగుతున్నారు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం సహజమే. అయితే తమ పదవులను కాపాడుకోవడం కోసం, అధికారంలోకి రావడం కోసం పొత్తులను వీళ్లిద్దరూ మార్చినట్లు దేశ రాజకీయ నేతల్లో ఎవరూ చేయలేదు. బీహార్ రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్న వేళ ఇప్పుడు నెట్టింట ఈ చర్చ జరుగుతుంది. ఇద్దరూ రాజకీయంగా ఎలా ఎదిగిందీ గుర్తు చేసుకుంటూ పోల్చుకుంటున్నారు.
పార్టీని సొంతం చేసుకుని...
నితీష్ కుమార్ కూడా పార్టీ నేత శరద్ యాదవ్ ను పక్కన పెట్టి జేడీయూను సొంతం చేసుకున్నారు. తాను చీఫ్ గా మారారు. చంద్రబాబు కూడా 1995లో తన మామ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి తాను చీఫ అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇద్దరూ జాతీయ రాజకీయాల్లో పేరొందిన వారే. నితీష్ కుమార్ బీహార్ కే పరిమితమయి రాజకీయాలు చేస్తూ ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు తొమ్మిదో సారి ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇద్దరూ రాజకీయ పరిణామాలను అంచనాలు వేసి తమ వ్యూహాలను మార్చుకోవడంలో దిట్ట.
కూటములను మార్చి...
నితీష్ కుమార్ అనేకసార్లు కూటములను మార్చారు. ఒకసారి ఎన్టీఏ అంటారు. మరొకసారి యూపీఏ అంటారు. అటు బీజేపీతో చేతులు కలుపుతారు. ఇటు కాంగ్రెస్ తో దోస్తీ కడతారు. అలా చేసినా ఆయన తన ముఖ్యమంత్రి పదవిని మాత్రం కాపాడుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ అంతే. నితీష్ కుమార్ అవసరం వారికి ఉంటుంది. బీహార్ లో బలమైన ప్రాంతీయ పార్టీ కావడంతో నితీష్ ఎప్పుడు వచ్చినా అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ అభ్యంతరం చెప్పవు. ఎందుకంటే నితీష్ అవసరంతోనే అక్కడ అధికారంలోకి రావాల్సి ఉంటుంది. గత ఎన్నికలలో బీహార్ లో అతి పెద్ద పార్టీగా ఎక్కువ స్థానాలతో ఆర్జేడీ అవతరించినప్పటికీ సీఎం కుర్చీని మాత్రం నితీష్ కే అప్పగించాల్సి వచ్చింది.
బీజేపీతో పొత్తు పెట్టుకుని...
చంద్రబాబు కూడా అంతే. కూటములను మార్చడం అనేకన్నా. ఎక్కువ సార్లు బీజేపీతో ఒకసారి కాంగ్రెస్ తో జత కట్టారు. బీజేపీ వేవ్ ఉన్నప్పుడు ఆయన బీజేపీతో జతకట్టి అధికారంలోకి రాగలిగారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి మహాకూటమిలో టీడీపీని భాగస్వామిగా చేయగలిగారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మారారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను తన కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఎన్నికలు ఏడాది ఉన్న సమయంలో బీజేపీకి రాం రాం చెప్పేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకున్న చంద్రబాబు మరోసారి బీజేపీ తో పొత్తుతో 2024 ఎన్నికలకు వెళదామనుకుంటున్నారు. నితీష్.. నారా వారి రాజకీయ నడక ఒకేమాదిరిగా సాగుతుందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Next Story