Mon Dec 23 2024 09:29:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వరస కేసులు... ఇప్పట్లో జైలు నుంచి వచ్చే అవకాశమే లేదా?
టీడీపీ అధినేత చంద్రబాబు పై వరస కేసులు నమోదవుతున్నాయి. ఆయన జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి
టీడీపీ అధినేత చంద్రబాబు పై వరస కేసులు నమోదవుతున్నాయి. ఆయన జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉండగానే ఆయనపై వరస కేసులు నమోదవుతుండటంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే యాభై మూడు రోజుల నుంచి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు త్వరగా బయటకు వస్తారని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆయన అధికారంలో ఉన్న తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించి మరీ కేసులను నమోదు చేస్తుంది. దీంతో క్యాడర్ లో చంద్రబాబు ఎన్నికల సమయానికి అయినా జైలు నుంచి బయటకు వస్తారా? లేదా? అన్న ఆందోళన నెలకొంది.
అంతకు ముందు ఎంత ధైర్యం?
చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో జైలుకు వెళ్లక ముందు ఆయనకు ఎంతో నమ్మకం. ఆయనను అరెస్ట్ చేసేంత ధైర్యం జగన్ ప్రభుత్వం చేయదన్న ధీమా. అది చంద్రబాబులోనే కాదు పార్టీ క్యాడర్ లోనూ అదే విశ్వాసం. అయితే దానిని పటాపంచలు చేస్తూ స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో ప్రభుత్వం ఈ ఏడాది సెప్టంబరు 8న అరెస్ట్ చేసింది. పదోతేదీన రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఆ.. ఏముందిలే... వెంటనే బెయిల్ పై బయటకు వస్తారనుకున్న వారికి నిరాశే ఎదురయింది. ఇప్పటి వరకూ ఆయనకు బెయిల్ దొరకలేదు. ఆయన జైలులోనే ఉండటంతో తెలంగాణ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది.
మరికొన్ని కేసులు...
దీంతో పాటు మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే కేసు నమోదయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కూడా వచ్చి మీద పడింది. ఇలా వరస కేసులు ఆయన వెంటాడుతున్న సమయంలో తాజాగా మద్యం కేసు కూడా మెడకు చుట్టుకునేలా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉండగా మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ మరో కేసును నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా చేర్చింది. దీనిని ఏసీబీ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారన్న కేసులో ఏ1 గా నరేష్, ఎ2గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏ 3గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చింది.
తాజాగా మద్యం కేసు....
నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మద్యం కంపెనీలకు మేలు జరిగేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నది సీఐడీ ప్రధాన ఆరోపణ. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి పదమూడు వందల కోట్ల ఆదాయానికి గండి పడిందని సీఐడీ తెలిపింది. 2015 - 17 సంవత్సరాల్లో బార్ల యజమానులకు లబ్ది చేకూర్చేలా లైసెన్సుదారులకు ప్రివిలేజ్ ఫీజును తొలగించారన్నది సీఐడీ ఆరోపణ. ఇందుకు కేవలం అప్పటి ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి ఆమోదంతోనే నిర్ణయం జరిగిందని, కేబినెట్ ఆమోదం పొందలేదని తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి కూడా పొందలేదని పేర్కొంది. దీంతో జరిగిన నష్టానికి చంద్రబాబు అండ్ కోను బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేసింది. మరి ఈ కేసులన్నీ ఛేదించుకుని చంద్రబాబు ఎప్పుడు బయటపడతారో? ఏమో అన్న దిగులు పార్టీ కార్యకర్తల్లో నెలకొంది.
Next Story