Mon Dec 23 2024 06:31:28 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సీఎం పదవి ఊరికే ఇవ్వలేదట... సీన్ క్రియేట్ చేసిందంటే దాని వెనక?
కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి గట్టి సంకేతాలనే ఇచ్చింది. వన్ మ్యాన్ ఆర్మీగా నడిపితే ఒప్పుకోమని చెప్పకనే చెప్పింది
కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి గట్టి సంకేతాలనే ఇచ్చింది. వన్ మ్యాన్ ఆర్మీగా నడిపితే ఒప్పుకోమని చెప్పకనే చెప్పింది. ఏ మాత్రం తేడా కొట్టినా చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయింది. అందుకే ఢిల్లీలో ఇంత డ్రామా నడిపింది. నిజానికి ఈ నెల 4వ తేదీన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రేవంత్ పేరును సీఎల్పీ నేతగా చెప్పారు. ఆ అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే వీలుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ సీన్ క్రియేట్ చేసింది. రేవంత్ కు కూడా ఒక దశలో తన పేరు మారుతుందేమోనన్న డౌట్ క్రియేట్ చేసేలా పార్టీ హైకమాండ్ చర్యలు కనిపించాయి.
ఇష్టానుసారం...
రేవంత్ ఒక్కడే ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని సుస్పష్టంగా చెప్పినట్లయింది. కేసీ వేణుగోపాల్ సయితం రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తూనే ఇది వన్ మ్యాన్ షో కాదని... టీం వర్క్ అని చెప్పడంతో ఆ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన చుట్టుపక్కల సీనియర్లు మంత్రులుగా ఉండేలా చర్యలు తీసుకోనుంది. పేరుకు ముఖ్యమంత్రి ఇష్టానుసారం మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని భావించడం కాంగ్రెస్ పాలనలో తప్పిదమే. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా.. అందునా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లకు కేబినెట్ లో కీలక శాఖలను అప్పగిస్తుందని కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ మంత్రులు అభ్యంతరం చెప్పే వీలుంది.
మంత్రుల వైపు...
అది ఆ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం గొప్పతనం. అందుకే రేవంత్ చుట్టూ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలు రింగ్ గా ఏర్పడి నిర్ణయాలను సమిష్టిగా తీసుకునేలా చర్యలుంటాయని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా నిర్ణయాల అమలు కోసం మంత్రుల వైపు చూడాల్సిన పరిస్థితిని హైకమాండ్ రేవంత్ కు కల్పించాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వెంటనే హైకమాండ్ రంగంలోకి దిగేలా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ప్లాన్ చేసిందంటున్నారు.
అలా సంకేతాలు...
అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ తీసిన పరుగుకు కళ్లెం వేయడానికి సీనియర్ నేతలను హైకమాండ్ ఉపయోగించుకుంటుంది. ఇతర పార్టీ నుంచి వచ్చినా పార్టీ విజయం కోసం కష్టపడ్డవారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చామన్న సంకేతాన్ని దేశ వ్యాప్తంగా పంపుతూనే ఫైనల్ డెసిషన్ తమదేనన్న సిగ్నల్స్ కూడా అంతే వేగంగా పంపింది. లోక్సభ ఎన్నికలలో అందరూ కలసి పనిచేసేలా.. ఆరు గ్యారంటీలు అమలు చేేసేలా బాధ్యతను ఒక్క రేవంత్ పైన కాకుండా టీం మీద పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం ఈ వైపు ఆలోచన చేసినట్లు సమాచారం అందుకే ఆచితూచి... వెయిట్ చేయించి.. సమాలోచనలు జరిపినట్లు సీన్ క్రియేట్ చేసి.. మరీ రేవంత్ కు ఈ పగ్గాలు అప్పగించింది. రేవంత్ రింగ్ దాటి రావడానికి వీలులేకుండా దిగ్భందించింది.
Next Story