Thu Nov 21 2024 22:38:12 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : నీ గట్స్ కు హేట్సాఫ్ డ్యూ... అలాగే సాగిపో.. అంటున్న అభిమానులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికల వేళ ఎంత మంది ఇండియా కూటమిని వదిలి వెళుతున్నా ధైర్యంగా అడుగులు వేస్తున్నారు
భారతీయ జనతా పార్టీని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనడం అంత ఆషామాషీ కాదు. బీజేపీ ఇప్పుడు దేశంలో బలంగా ఉంది. అందులో దానికి మోదీ ఉన్నాడు. మరి కాంగ్రెస్ కు ఎవరున్నారు? ఒకరకంగా చూస్తే రాహుల్ తప్ప కాంగ్రెస్ పార్టీలో సరైన నేత ఎవరూ లేరు. రాహుల్ గాంధీ కూడా అదో టైపు. తాను ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అలాగని అవగాహన లేక కాదు. ఆయనకు తోచింది చేస్తారు. అధికారం కోసం పాకులాడే నేత మాత్రం కాదు. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కాలనే మనస్తత్వం కూడా రాహుల్ కు లేనట్లుగానే ఉంది. అలాగే లొంగిపోయినట్లు కూడా ఆయన కనిపించకూడదనుకుంటారు.
పదేళ్ల నుంచి....
కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదేళ్లవుతుంది. ఈసారి పవర్ రాకుంటే ఉన్నవాళ్లు మిగలరు. అయినా ఆ భయం మాత్రం రాహుల్ లో ఇసుమంత కూడా కనిపించడం లేదు. ఎప్పటికైనా ప్రజాభిప్రాయం మారుతుందని ఆయన వెయిట్ చేస్తున్నట్లే ఉంది. మోదీ మీద, ఆయన పాలనపైన విసుగు చెంది తమ వైపు ప్రజలు మొగ్గు చూపాలే తప్ప ఈ కూటములతో సాధించేది ఏమీ లేదన్న భావనలో ఆయన స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఇండియా కూటమి నుంచి అనేక మంది నేతలు బయటకు వెళుతున్నా రాహుల్ మాత్రం తన దారిలో తాను పయనిస్తున్నాడు. ఆల్ ఈజ్ వెల్ అనుకున్న సమయంలో మాత్రం వాళ్లంతట వాళ్లే వచ్చి చేరతారన్న విశ్వాసం కావచ్చు.
ఏ పదవులు ఆశించకుండా...
రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన అందరిలాగా పదవులను ఆశించలేదు. ఆయన నిజంగా కోరుకుంటే ఆనాడే ప్రధాని అయి ఉండేవారు. కానీ అలా చేయలేదు. సీనియర్లకు గౌరవం ఇవ్వాలన్న ఏకైక కారణమే రాహుల్ గాంధీ నాడు ఆ ప్రయత్నం చేయకపోవడానికి కారణంగా చెబుతారు. అయితే ఆ పదేళ్లలో అనేక పదవులు అనుభవించిన వారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని విడిచి వెళ్లిపోయారు. గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నేతలు కూడా పార్టీ కష్టకాలంలో హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. అనేక మంది నేతలు వెళ్లినా ఆయన మనోధైర్యం చెక్కు చెదరలేదు.
కూటమి నుంచి ఒక్కక్కరూ...
ఇప్పుడు కూడా అంతే. మోదీని ఓడించాలని ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. నితీష్ కుమార్ జారుకున్నాడు. మమత కటీఫ్ చెప్పేసింది. ఫరూక్ అబ్దుల్లా బైబై అన్నాడు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కిరికిరి పెట్టాడు. అయినా ఏ మాత్రం చలించడం లేదు. తాను అనుకున్నది ఆయన చేసుకుంటూ వెళుతున్నాడు. మోదీని ఎలా ఎదుర్కొంటారని అందరూ అనుకుంటున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. సుదీర్ఘ యాత్రలు చేస్తూ ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమో .. మార్పు ఎప్పటికైనా రావచ్చన్న రాహుల్ ఆలోచన నిజం అవుతాయేమో.. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా.. ఎప్పటికైనా అది అసాధ్యం కాదన్నది మాత్రం రాహుల్ నమ్మకం అయి ఉండవచ్చు. అందుకే ఆయన మౌనంగా తన బాటలో పయనిస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story