Sat Nov 23 2024 08:29:52 GMT+0000 (Coordinated Universal Time)
Pawan : బెట్టు ఏది బ్రో... ఇలా అయితే అధోగతే
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనడంపై పార్టీలో చర్చ జరుగుతుంది
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. టీడీపీతో అంత చెలిమి కోసం తహతహలాడటం ఎందుకన్న ప్రశ్న క్యాడర్ నుంచే వినిపిస్తుంది. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి రెండు పార్టీలు సభ్యులను నియమించాయి. వారు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కానీ పవన్ కల్యాణ్ పనిగట్టుకుని రాజమండ్రికి వెళ్లి మరీ సమన్వయ సమావేశంలో పాల్గొనడం మాత్రం జనసేన క్యాడర్ కు రుచించడం లేదు. అంత అవసరమేమి ఉందని పార్టీ నేతలకు కూడా సందేహాలు కలుగుతున్నాయి.
లోకేష్ తో పోల్చుకుంటే...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పోలిస్తే నారా లోకేష్ వయసులోనే కాదు రాజకీయంగా కూడా అనుభవం చిన్నదే. ఆయన మంత్రి అవ్చొచ్చు. కానీ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని చేపట్టారంటున్నారు. అదే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు దాటింది. పొత్తులతోనో, ఒంటరిగానో గడచిన రెండు ఎన్నికల నుంచి పోరాడుతున్నారు. పార్టీ కోసం ఆయనే తిరుగుతున్నారు. ఆయనే పార్టీలో వన్ మ్యాన్ షో. వేదిక మీద కూడా మూడు కుర్చీలే ఉంటాయి. ఒకటి నాదెండ్ల మనోహర్ కి. రెండోది నాగబాబుకి. అయినా సరే ఆయన ఫ్యాన్స్, కాపు సామాజికవర్గం మాత్రం పవన్ కల్యాణ్ తమ కాబోయే ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు.
తన స్థాయిని...
కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టిన పవన్ కల్యాణ్ లోకేష్ తో కలసి సమావేశంలో పాల్గొనడంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో భేటీ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, అయితే లోకేష్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి పిలవకున్నా పోలోమంటూ వెళ్లడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. తన బలహీనతను తాను మరోసారి బయట పెట్టుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏదైనా ఉంటే హైదరాబాద్లోనే ఉండి సమావేశాలకు వెళ్లే జనసేన నేతలకు దిశానిర్దేశం చేయవచ్చు. నాదెండ్ల మనోహర్ కు ఆదేశాలు జారీచేయవచ్చు. అంతే తప్ప లోకేష్ పక్కన కూర్చుని తన స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేశారని అభిమానులు మదనపడుతున్నారు.
సీట్ల పంపకాల సమయంలో...
వచ్చే ఎన్నికల్లో నిజంగానే టీడీపీ, జనసేన గెలిచినా తాను పెట్టే డిమాండ్లకు విలువ లేకుండా పోతుందని, ఆ ఆలోచన లేకుండా బేషరతుగా ఊపుకుంటూ పరుగెత్తుకెళుతున్నారని కాపు సామాజికవర్గం నేతలు కూడా బాధపడుతున్నారు. చంద్రబాబుతో రేపు పొత్తుల విషయం మాట్లాడే సమయంలో తగిన సీట్లు రాబట్టుకోవడానికి అవసరమైన బెట్టును ఇలా చేస్తూ జార విడుచుకుంటున్నారని కూడా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నేతలపై నమ్మకం లేకనే పవన్ రాజమండ్రి వెళ్లినట్లు కనిపిస్తుందన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి పవన్ చేసింది రైటా? రాంగా? అన్నది రానున్న కాలంలో తేలనుంది.
Next Story