Fri Nov 22 2024 08:44:59 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నవ్వితే చాలదు.. పరువు పోకముందే ఇకనైనా సస్పెండ్ చేయి సామీ
వైఎస్ జగన్ ఎందుకు నానుస్తున్నారో అర్థం కావడం లేదు. వైసీపీ నేతను సస్పెండ్ చేయకపోవడంపై క్యాడర్ లో చర్చ జరుగుతుంది
వైఎస్ జగన్ ఎందుకు నానుస్తున్నారో అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం లేదు. అయినా ఆయన తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు విషయంలో మౌనంగా ఉండటం పార్టీ నేతలకు కాదు కదా సామాన్యకార్యకర్తలకు కూడా రుచించడం లేదు. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి భయపడుతున్నారన్న ప్రశ్న కింది క్యాడర్ నుంచి వినపడుతుంది. రఘురామ కృష్ణరాజుపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడాన్ని పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే మరింత డ్యామేజ్ అవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా అనుకుంటుండటం నిజమే.
మూడున్నరేళ్ల నుంచి...
రఘురామ కృష్ణరాజు గత మూడున్నరేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంపైనా, నేరుగా జగన్ పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నేరుగా పథకాలపైన విమర్శలకు దిగుతున్నారు. ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. రోజూ రచ్చబండ పేరుతో ఢిల్లీలో మీడియా సమావేశాన్ని పెట్టి మరీ జగన్ సర్కార్ ను ఒక ఆటాడుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు... అమరావతి రైతుల వ్యవహారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వరకూ ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అయినా ఇప్పటి వరకూ జగన్ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్ కు మాత్రం ఫిర్యాదు చేసి ఊరుకున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశాలు కూడా లేవు. బీజేపీ కూడా రఘురామ కృష్ణరాజు విషయంలో అంత సీరియస్ గా లేదనే అనిపిస్తుంది.
గీత దాటుతున్నా...
నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడంతో పాటు పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించడం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల గెలుపు ఖాయమని ప్రకటిస్తుండటం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన జగన్ రఘురామ కృష్ణరాజు విషయంలో ఎందుకు నానుస్తున్నారన్నది అర్థం కాక క్యాడర్ జుట్టు పీక్కుంటుంది. సస్పెండ్ చేస్తే ఆయన చేసే విమర్శలకు విలువ ఉండదని, ఆయన వైసీపీ పార్టీ అని చెప్పుకుంటూ జగన్ పై విమర్శలు చేయడాన్ని సహించలేకపోతున్నారు. దీంతో పాటు ఇప్పుడు సస్పెండ్ చేసినా పెద్దగా పార్టీకి నష్టమేమీ ఉండదు. కొద్దో గొప్పో లాభం తప్ప నష్టమేమీ ఉండదు. అయినా జగన్ వెనుకంజ వేయడం ఎందుకు అన్న సందేహం కలుగుతుంది.
కారణమేంటి?
తాజాగా రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా పార్టీ లైన్ దాటడమే. రేపు విచారణకు సుప్రీంకోర్టులో రానుంది. ఇంతకు మించి ఎవరైనా ఏం చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవు. అలాగని చూస్తూ ఊరుకోవడం కన్నా సస్పెండ్ చేస్తే పార్టీతో సంబంధం లేని నేతలు కాబట్టి పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరంటున్నారు. కానీ జగన్ మాత్రం రఘురామ కృష్ణరాజు విషయంలో ఎందుకంత మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా నానుస్తూ పోతే మరింత మంది నేతలు రఘురామ కృష్ణరాజు బాట పట్టే అవకాశాలు లేకపోలేదని కూడా నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ జగన్ లో మాత్రం చలనం లేకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వరకూ ఇలాగే ఉంటే ఉన్న పరువు కాస్తా కృష్ణా నదిలో కలిసినట్లే.
Next Story