Tue Nov 05 2024 10:42:47 GMT+0000 (Coordinated Universal Time)
గుప్పెట మూసి ఉంచారు.. దాచాలన్నా దాగదులే
2024 ఎన్నికల సమయంలో అనేక విషయాలపై క్లారిటీ రానుంది. తెరలు తొలగిపోనున్నాయి
ఏదైనా గుప్పెట మూసి ఉన్నంత వరకే. గుప్పిట తెరిస్తే అసలు విషయం బయటకు తెలిసిపోతుంది. రాజకీయాల్లోనూ అంతే. కొన్ని అంశాల్లో స్పష్టత ఒక్కో సమయంలో వస్తుంది. 2024 ఎన్నికల సమయంలో అనేక విషయాలపై క్లారిటీ రానుంది. తెరలు తొలగిపోనున్నాయి. అప్పుడు తర్వాత రాజకీయ నేతలు చెప్పుకునేందుకు ఎలాంటి విషయమూ ఉండకపోవచ్చు. అధికార వైసీపీకి కావచ్చు. విపక్షాలైన టీడీపీ, జనసేనలకు కావచ్చు ఏపీ ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి రాష్ట్రంలోని జనాలకు కొన్ని విషయాల్లో పూర్తి స్థాయి స్పష్టత రానుంది.
1. వైసీపీ అధినేత జగన్ : జగన్ ఒంటరిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వై నాట్ 175 అంటూ నినాదం కూడా అందుకున్నారు. అభ్యర్థులను మారుస్తానని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. తాను బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడం మూలాన లక్షలాది కుటుంబాలు తనకు అండగా నిలుస్తాయని భావిస్తున్నారు. అయితే జగన్ సంక్షేమ పథకాలు ఏ మేరకు పనిచేస్తాయి? కేవలం సంక్షేమ పథకాలే గెలుపును నిర్ణయిస్తాయా? డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయా? అన్న విషయాలపై ఈ ఎన్నికల్లో క్లారిటీ రానుంది.
2. టీడీపీ అధినేత చంద్రబాబు : స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఆయన తన అరెస్ట్తో సానుభూతి పుష్కలంగా వస్తుందని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆయన భావిస్తున్నారు. జగన్ కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టడం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో జనం తన వైపు ఉన్నారని భావిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పొత్తుకు సిద్ధమవ్వడంతో కాపు సామాజికవర్గం ఓట్లు కూడా పడి వన్ సైడ్ విక్టరీ తమకు లభిస్తుందని భావిస్తున్నారు. జగన్ ను ఎదుర్కొనడానికి పొత్తులతో ముందుకు వెళ్లడమే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. పొత్తులు ఏ మేరకు పనిచేస్తాయన్నది ఫలితాల తర్వాత వెలువడనుంది.
3. పవన్ కల్యాణ్ : 2014లో తన వల్లే టీడీపీ గెలిచిందన్న భావనలో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు. తాను లేకుంటే 2014లోనే టీడీపీ ఓటమి పాలయ్యేదన్న అభిప్రాయంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో తనతో పాటు టీడీపీ ఓటమి కూడా అదే కారణమని బలంగా విశ్వసిస్తున్నారు. ఈసారి అలా కాదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుగానే జనంలోకి వెళుతున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఈ కూటమి గెలిస్తే సరి. లేకుంటే మాత్రం పవన్ ప్రభావం ఉంటుందా? లేదా? అన్న దానిపైన కూడా క్లారిటీ రానుంది. మరోవైపు కాపు సామాజికవర్గం ఓట్లు ఈసారి తనకు పడతాయని, తన ఓటు బ్యాంకు పెరిగిందని భావిస్తున్న పవన్ కు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అసలు విషయం బోధపడనుంది. జగన్ ను ఓడించాలన్న ధ్యేయంతో ఉన్నారు. తాము అధికారంలోకి వస్తామన్న ధీమా కలిగిన జనసేనానికి ఈ ఎన్నికలు క్లారిటీ ిఇవ్వనున్నాయి.
4. వామపక్షాలు : ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష పార్టీలు ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేనతో కలసి పొత్తుతో బరిలోకి దిగి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాయి. అందుకే టీడీపీ పొత్తు కోసం పరితపిస్తున్నాయి. ఒకవేళ టీడీపీ పొత్తు పెట్టుకున్నా కనీసం ఈసారైనా ఏపీ అసెంబ్లీలో కామ్రేడ్లు కాలుమోపుతారా? లేదా? అన్నది తేలిపోనుంది. ఇవన్నీ 2024 ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. అన్ని విషయాల్లో ప్రజలకు మాత్రమే కాకుండా పార్టీలకు కూడా స్పష్టత రానుంది.
Next Story