Thu Dec 26 2024 22:33:50 GMT+0000 (Coordinated Universal Time)
Nellore : కరెన్సీ కట్టలు తెంచుకుంటాయా? ఈ ఎన్నికల్లో వాటిని ఆపేదెవరు?
నెల్లూరు పార్లమెంటులో ఆర్థికంగా బలమైన నేతలు వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి పోటీ పడుతున్నారు
ఇద్దరూ బలమైన నేతలు.. క్యాస్ట్ పరంగా... క్యాష్ పరంగా కూడా గట్టోళ్లు. వీళ్లిద్దరూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ ఎన్నికల బరిలో తలపడుతున్నారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పార్లమెంటు అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. టీడీపీ ప్రకటించకపోయినా వేమిరెడ్డికి ధీటైన అభ్యర్థి అక్కడ మరొకరు లేరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతికి కోవూరు సీటును కేటాయించింది టీడీపీ నాయకత్వం. ఇప్పడు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో డబ్బు ఏరులై పారనుంది.
ఇద్దరూ బలమైన వారు...
పార్లమెంటు అభ్యర్థులిద్దరూ ఆర్థికంగా బలమైన వారు కావడం, ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీకి అండగా ఉంటూ వస్తుంది. అందులోనూ పార్లమెంటు స్థానం 2014, 2019 ఎన్నికల్లో వైసీపీయే విజయం సాధించింది. గత ఎన్నికల్లో అయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఏకంగా పదికి పది సీట్లు గెలుచుకుని తమ సత్తా చాటింది. కానీ నిన్న వేరు.. నేడు వేరు. నేతలు పార్టీ మారడంతో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగానే ఉంది. ఈసారి నెల్లూరు జిల్లాలో ఎక్కువ స్థానాలను గెలుచుకుని అధికారం వైపు అడుగులు వేయాలని టీడీపీ వేమిరెడ్డి పెట్టిన డిమాండ్లకు తలొగ్గి మరీ ఆయనకు రెడ్ కార్పెట్ వేసింది.
సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ...
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. అనేక మారుమూల పల్లెలకు కూడా తాగునీరు ట్యాంకర్ల ద్వారా అందిండమే కాకుండా వీపీఆర్ ట్రస్ట్ ద్వారా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందుకే ఆయనకు పార్లమెంటు సీటుతో పాటు ఆయన సతీమణికి కోవూరు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడానికి టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. పారిశ్రామికవేత్తగా బాగానే సంపాదించిన వేమిరెడ్డి నియోజకవర్గాల్లో డబ్బులు వెదజల్లుతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వేమిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారని తెలియగానే టీడీపీ అభ్యర్థులందరూ ఊపిరి పీల్చుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. తమ విజయాన్ని ఆయనే చూసుకుంటారన్న ధీమా ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ కనిపిస్తుంది.
సాయిరెడ్డిని దింపి..
వేమిరెడ్డి పార్టీని వీడి వెళ్లగానే బలమైన అభ్యర్థి కోసం అన్వేషించిన వైసీపీ అధినాయకత్వం చివరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించింది. సాయిరెడ్డి కూడా ఆర్థికంగా బలపడిన నేత. సాయిరెడ్డి సొంత జిల్లా కూడా నెల్లూరు కావడం విశేషం. సాయిరెడ్డికి అదనపు బలం పార్టీ. ఇక్కడ వైసీపీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం..రెడ్డి సామాజికవర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి అండగా ఉండటం వల్లనే అక్కడ పోటీకి వైసీపీ అధినాయకత్వం కోరిన వెంటనే విజయసాయిరెడ్డి అంగీకరించారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఈ ఎన్నికల్లో డబ్బులు వరదలా పారతాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఓటుకు ఎంత పలుకుతుందో తెలియదు కాని.. నెల్లూరు పెద్దారెడ్ల మధ్య పోటీ మాత్రం మామూలుగా ఉండదన్నది మాత్రం నిజం.
Next Story