Sat Nov 23 2024 07:50:13 GMT+0000 (Coordinated Universal Time)
పొన్నాల టైమింగ్ రాంగ్ కాదా.. కేసీఆర్ సంగతి తెలిసి కూడా
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నేడు బీఆర్ఎస్లో చేరుతున్నారు. అయితే ఆయనకు ఏ మేరకు ప్రయారిటీ దక్కుతుందన్నది సందేహమే
కేసీఆర్ అంటే కొవ్వొత్తి లాంటి వారు. అంటే వెలుగునిచ్చే వారనుకుని నేతలు భ్రమించి ఆ వెలుగు చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఏదో ఒకరోజు ఆ మంటలో మడి మాడి మసి కావాల్సిందే. మొన్న మండవ వెంకటేశ్వరరావు.. నిన్న మోత్కుపల్లి నరసింహులు... ఈరోజు పొన్నాల... అందరూ అంతే. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు గౌరవం ఇవ్వలేదని, తనను కలిసేందుకు కూడా అనుమతించలేదని సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈరోజు జనగామలో జరిగే కేసీఆర్ బహిరంగ సభలో ఆయన అధికారికంగా పార్టీలో చేరతారన్న సమాచారం బయటకు వచ్చింది. ఆయన రాంగ్ టైమ్ లో పార్టీలో చేరుతున్నారనిపిస్తుంది.
కేసీఆర్ను కలుద్దామనేనా?
అసలు పొన్నాల బయటకు వచ్చిన కారణం.. తనకు టిక్కెట్ రాదనేనా? లేక కాంగ్రెస్ అగ్రనేతలు తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనా? అయితే పొన్నాల కారు పార్టీలో చేరే ముందు మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి. పార్టీ లోచేరే ముందు మాత్రమే ప్రగతి భవన్ లోకి పొన్నాలకైనా.. ఏ నేతకైనా అనుమతి ఉంటుంది. ఆ తంతు పూర్తయిన తర్వాత ఇక గేట్లు క్లోజ్ అయిపోయినట్లే. దొరగారి దర్శనం కూడా దొరకదు. మాట్లాడదామన్నా వీలుపడదు. ఆయనకు తాను ఏం చెప్పుకోవాలనుకున్నా వీలు లేని పరిస్థితి. ఇది యదార్థం. ఎందుకంటే కేసీఆర్ తీరు అంతే. నేతలు ఎవరనేది ఆయనకు ముఖ్యం కాదు. సామాజికవర్గాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎవరి విషయంలోనైనా ఆయన అంతే. ఎవరికైనా ఒకటే మర్యాద. అదే గౌరవం. ఆయనకు అవసరమొస్తే... పిలుపు వస్తుంది. అప్పుడే ప్రగతి భవన్ తలుపులు తెరుకుంటాయి. లేకుంటే క్లోజ్ అయినట్లే.
అప్పటి అవసరానికే...
ఆ అవసరానికి పనికి వస్తారా? లేదా? ఎన్నికల సమయంలో పనికి వస్తారంటే వెంటనే ఇన్స్టంట్ ప్రయోజనం దక్కుతుంది. అంతే తప్ప దీర్ఘకాలంగా ప్రయోజనం పొందాలంటే కుదరని పని. హుజారాబాద్ ఎన్నికల సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి, ఎల్. రమణ వంటి వారు వెంటనే ఎమ్మెల్సీ పదవి పొందారు. కేవలం ఈటలను ఓడించాలన్న కసితోనే వారికి ఆ సమయంలో సదవులు ఇచ్చారు. పెద్దిరెడ్డి చేరినా ఆయనకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు. ఆయన వల్ల పెద్దగా బెనిఫిట్ లేదని భావించిన కేసీఆర్ పదవులకు దూరంగా పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యునిస్టు పార్టీలతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు.
పాపం.. పొన్నాల కూడా...
ప్రగతి భవన్ కు కామ్రేడ్లను రప్పించి వారితో భోజనం చేసి మరీ చర్చలు జరిపారు. వారిని తోడ్కొని మునుగోడు సభకు వెళ్లారు. మునుగోడులో గెలిచిన తర్వాత పో పొమ్మన్నారు. కనీసం కర్టసీ కాల్ కూడా లేదు. దీంతో కమ్యునిస్టులు కాంగ్రెస్ పంచన చేరాల్సి వచ్చింది. ఇలా ఉంటుంది గులాబీ బాస్ తోని. అందరికీ తెలుసు. అయినా అందరూ వెళతారు. కాంగ్రెస్ పై కసితో తాత్కాలిక కోపంతో పార్టీని వీడవచ్చు కాని ఆయనతో కలసి ప్రయోజనం పొందిన వారు బహు స్వల్పం. నష్టపోయిన వారే అధికం అంటారు అనేక మంది విశ్లేషకులు. ఇప్పుడు పొన్నాల కూడా అంతే. నిన్న ప్రగతి భవన్ కు సతీసమేతంగా వెళ్లిన పొన్నాలను కేసీఆర్ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. యోగక్షేమాలను అడిగారు. ఇక ఆతర్వాత... జనగామలో పార్టీ గెలిచేంత వరకూ పొన్నాలకు ప్రయారిటీ. ఆ తర్వాత కాంగ్రెస్ కంటే హీనంగా కారు పార్టీలో ఆయన పరిస్థితి ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పాపం.. పొన్నాల.. అందరి జతలో ఆయన కూడా.
Next Story