Sat Nov 23 2024 02:21:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏమయ్యా గంటా.. ఈ నీతులేంటట?
ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ యాక్టివ్ అవుతున్నారు
చెప్పే వాడికి వినేవాడు లోకువంటారు. తాను ఇన్నాళ్లూ ఏం చేశామో మర్చిపోయి సుద్దులు చెబుతుంటారు. తాను చేసిందంతా చేసి అవసరమైన సమయంలో వెన్ను చూపి.. తనకు అవసరమైనప్పుడు తానేదో పోటుగాడినంటూ పోజులిచ్చే వారిని ఏమనాలి? ఏమనాలో అందరికీ తెలుసు. అలాంటి వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. ప్రజాస్వామ్య పరిరక్షణే పోరాట స్ఫూర్తిని పెంచుకోవాలని, రాష్ట్రంలో అణిచివేతలు ఎక్కువయ్యాయని ఆయన ఘంటాపధంగా నొక్కి చెబుతున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాలని ఆయన పిలుపు నివ్వడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న కామెంట్స్.
నాలుగేళ్ల నుంచి...
గంటా శ్రీనివాసరావు ప్రతి సారీ నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. గత ఎన్నికల్లోనూ భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి స్వల్ప ఆధిక్యతతో ఎన్నికయ్యారు. ఆయన ఆశించినట్లు టీడీపీ ప్రభుత్వం రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఎప్పటి వరకూ అంటే నాలుగేళ్ల పాటు. మొన్నటి వరకూ ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. పోరాడింది అసలే లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలందరూ పోలోమంటూ పోడియం చుట్టూ దూసుకెళ్లినా ఈయన మాత్రం మౌనంగా కూర్చున్నారు. అసలు శాసనసభకు రావడమే మానేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ కోసం...
అయితే ఆ రాజీనామా కూడా ఆమోదం పొందలేదు. ఉత్తర నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసింది లేదు. తన తరుపున ఇన్ఛార్జిని పెట్టి నడిపించారు. వచ్చే ఎన్నికల్లో ఎటూ మళ్లీ నియోజకవర్గం మారతారు కాబట్టి పెద్దగా అక్కడ కనపడలేదు. ఇక చంద్రబాబు, లోకేష్ గతంలో విశాఖకు వచ్చినా దూరంగానే ఉండిపోయారు. అదీ ఆయన అసలు రూపం. అధికార పార్టీ పెట్టే కేసులకు భయపడి బయటకు రాలేదని అయ్యన్న పాత్రుడు వంటి వారు చేస్తున్న కామెంట్స్ నిజం అనుకోవాలో? లేదో కానీ మొన్నటి వరకూ గంటా శబ్దం పార్టీలో ఎక్కడా వినిపించలేదు. పెద్దగా పార్టీ కోసం పనిచేసింది లేదు. తన సన్నిహితులైన వారిని తప్పించి ముఖ్య కార్యకర్తలను పట్టించుకోలేదు.
ఫ్రంట్ లైన్ లో...
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక బయటకు రావాల్సిన సమయం వచ్చింది. తాను ఆశిస్తున్న భీమిలి టిక్కెట్ తో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసమే ఆయన ఈ మధ్య కాలంలో హడావిడి మొదలు పెట్టారు. అధికార పార్టీపై పోరాటం చేయాల్సిందేనంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. కానీ చూసే వాళ్లకు ఆ మాత్రం తెలియదా? ఇన్నాళ్లూ పార్టీ కోసం తెగించి పోరాడిన వారిని పక్కకు నెట్టి తాను ఫ్రంట్ లైన్ కు వద్దామన్నదే గంటా ప్రయత్నం. అయితే ఆయన ఆర్థికంగా, సామాజికంగా బలవంతుడు కాబట్టి అనుకున్నవన్నీ భవిష్యత్లో సాధించుకోవాచ్చు. కానీ పార్టీలో ఉండే అసలైన కార్యకర్తలకు మాత్రం గంటా టైమింగ్ అందరికీ తెలుసు. పార్టీ అధినేత గంటా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తితో ఎదురు చూడటం తప్ప క్యాడర్ చేయగలిగిందేమీ లేదు. కానీ పార్టీ కార్యకర్తల మనసులో మాత్రం గంటా స్థానం మాత్రం చెదిరిపోయిందనే చెప్పాలి.
Next Story