Tue Nov 05 2024 14:36:16 GMT+0000 (Coordinated Universal Time)
రైలులో మహిళకు పురిటినొప్పులు.. వైద్య విద్యార్థిని, తోటి ప్రయాణీకులు కలిసి..!
సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిఐఎంఎస్ఆర్)కి చెందిన వైద్య విద్యార్థిని కె. స్వాతిరెడ్డి ఓ మహిళకు ఆడబిడ్డను ప్రసవించేందుకు సహాయం చేసింది. రైలు ప్రయాణిస్తుండగానే ఆమెకు పురిటినొప్పులు రావడంతో, అదే బోగీలో ప్రయాణిస్తున్న స్వాతిరెడ్డి అనే వైద్య విద్యార్థిని ఇతర మహిళల సాయంతో ఆ గర్భిణీకి పురుడు పోశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ స్వాతిరెడ్డిని అభినందించారు.
శ్రీకాకుళానికి చెందిన 28 ఏళ్ల గర్భిణి తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రసవ వేదనకు గురైంది. రైలు తెల్లవారుజామున 3.30 గంటలకు అన్నవరం చేరుకునే సరికి ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు సహాయం కోసం ఒక కంపార్ట్మెంట్ నుండి మరొక కంపార్ట్‌మెంట్‌కు వెళ్తున్నారు. అదే కంపార్ట్మెంట్లో ఉన్న నరసరావుపేటకు చెందిన కె.స్వాతిరెడ్డి మహిళకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఉదయం 5.35 గంటలకు పాప పుట్టింది. విజయవాడ-విశాఖపట్నం మధ్య స్టేషన్లు లేకపోవడంతో ఆసుపత్రిని గుర్తించేందుకు సమయం పట్టింది. అనకాపల్లి స్టేషన్లో 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. స్వాతి సహాయంతో తల్లీ, బిడ్డను ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పాపను ఇంక్యుబేటర్‌లో ఉంచారు.
వైద్యుల సహాయం లేకుండా స్వాతి డెలివరీ చేయడం ఇదే మొదటిసారి. "నేను హాస్పిటల్లో ప్రొఫెసర్లకు సహాయం చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇది సొంతంగా నా మొదటి డెలివరీ కావడంతో నేను ఆందోళన చెందాను. బిడ్డ పుట్టే వరకు నేను టెన్షన్‌గానే ఉన్నాను. తల్లి బిడ్డ, బాగానే ఉన్నారు" అని స్వాతి చెప్పారు. కంపార్ట్మెంట్ లో ఉన్న ప్యాసెంజర్లు కూడా సహాయం చేయడంతో డెలివరీ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. మహిళ ప్రసవానికి వచ్చిన వెంటనే, ప్రయాణికులు ఆ ప్రాంతాన్ని తాత్కాలిక డెలివరీ రూమ్‌గా మార్చారు. ప్రసవం అయిన వెంటనే.. శిశువుకు ప్రయాణికులు తమ దుప్పట్లను ఇచ్చి తల్లి, చిన్నారికి చలి కలగకుండా చేశారు.
Next Story