Fri Nov 15 2024 12:11:42 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ప్రపంచంలో అతి పెద్ద నోరు తనదే అంటున్న ఐజాక్
నాకు చాలా పెద్ద నోరు ఉందని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని
ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ఈ యువకుడే ఒక వింత అంటారు. ఎందుకంటే సాధారణంగా మనం ఏవైనా పండ్లను కాయలను తినాలంటే కొనుక్కుని తింటాం.. కానీ ఈ యువకుడు మాత్రం ఒక్కసారిగా నోట్లోకి వేసుకోగలడు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద నోరు ఇతడికి ఉంది. ఎంతగా అంటే ఏకంగా ఒక నారింజ పండు పట్టేయగలదు.. యాపిల్ పండును కూడా లటుక్కున నోట్లోకి వేసుకోగలడు.
ప్రపంచంలోనే అతి పెద్ద నోరు ఉన్న మగవాడిగా రికార్డును పదిలం చేసుకున్నాడు ఈ టీనేజర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని మిన్నెసోటా నివాసి ఐజాక్ జాన్సన్ తన నోరు ప్రపంచంలోనే అతి పెద్దదని చెబుతున్నాడు. అతడి రికార్డును అతడే కొల్లగొట్టడం విశేషం. అతను తన నోటిని ఒకప్పుడు పెద్దగా చేయగలిగిన దానికంటే మరింత పెద్దగా చేసి చూపించగలని ప్రపంచానికి నిరూపించాడు. ఐజాక్ పెరిగేకొద్దీ అతని నోరు కూడా పెరుగుతూ ఉంది. అతడు అమాంతం నోరు తెరిస్తే.. పై పెదవి నుండి కింద పెదవి వరకు 10.196 సెం.మీ (4.014 అంగుళాలు) ఉంటుంది. "నాకు ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉంది," అని ఐజాక్ చెప్పుకొచ్చాడు. పూర్తి పరిమాణం లోని నారింజ ఒక్కసారిగా నోట్లో వేసుకోగలడు. మనం కొరకడానికి కూడా ఇబ్బంది పడే మెక్‌డొనాల్డ్ చీజ్బర్గర్ ను కూడా ఒక్కసారిగా నోట్లోకి పెట్టుకోగలడు.
నాకు చాలా పెద్ద నోరు ఉందని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని ఐజాక్ చెప్పాడు. 2015లో ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కు అర్హుడిని కావచ్చని మేము గ్రహించాము. అందుకు తగ్గట్టుగా మేము గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులను సంప్రదించాం. కేవలం 14 సంవత్సరాల వయస్సులో 15 ఏప్రిల్ 2019న ఐజాక్ నోటిని కొలిచారు. అప్పుడు అతడి నోరు సైజ్ 9.34 సెం.మీ (3.67 అంగుళాలు) ఉంది. అమెరికా లోని బోయర్టౌన్, పెన్సిల్వేనియా నివాసి ఫిలిప్ అంగస్ 5 నవంబర్ 2019న 9.52 సెం.మీ (3.75 అంగుళాలు) కొత్త రికార్డ్ సృష్టించి అతి పెద్ద నోరు ఉన్నది తనకే అనే టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. కాబట్టి ఐజాక్ దగ్గర నుండి ఆ రికార్డు ఇతరుల చేతిలోకి వెళ్ళిపోయింది.
అయితే ఐజాక్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐజాక్ 21 అక్టోబర్ 2020న తన నోటిని 10.175 cm (4 in) వరకు విస్తరించి చూపించి టైటిల్‌ను తిరిగి పొందాడు. అది ఏకంగా బేస్ బాల్ పరిమాణానికి సమానం! "గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం నోటికి సంబంధించి అతిపెద్ద గ్యాప్ ఉన్న వ్యక్తిగా టైటిల్‌ను తిరిగి పొందడం నాకు చాలా గర్వంగా ఉంది" అని ఐజాక్ గర్వంగా చెప్పాడు. తాను మొదటిసారి ఆ టైటిల్ ను కోల్పోయినప్పుడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు, ఎట్టకేలకు ఆ టైటిల్ ను తిరిగి తీసుకోవడం చాలా బాగుందని ఐజాక్ చెప్పుకొచ్చాడు. ఇక ఐజాక్ 22 ఫిబ్రవరి 2022న ఇటలీలోని మిలన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మునుపటి కంటే 0.021 సెం.మీ (0.008 అంగుళాలు) తన నోటిని పొడిగించి.. తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.
జర్మనీలోని వెండ్లింగెన్కు చెందిన బెర్ండ్ ష్మిత్ 8.8 సెం.మీ (3.46 అంగుళాలు) రికార్డు సాధిస్తూ పెద్దగా నోరు తెరిచినట్లు చూసిన తర్వాత ఐజాక్ తొలిసారిగా ఈ రికార్డును బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. అనుకున్నట్లుగానే అతడు ప్రయత్నం చేసి రికార్డు సాధించి చూపించాడు. ఐజాక్ కు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. టిక్‌టాక్‌లో 74 మిలియన్లకు పైగా అతడి వీడియోలకు వ్యూస్ వచ్చాయి.
Next Story