Thu Nov 07 2024 08:47:46 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీని చూస్తే జాలేస్తుంది... చంద్రబాబు సీటుకే ఎసరా?
టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్ధి ఎవరన్న సందేహం పార్టీ క్యాడర్ లో అయోమయాన్ని నింపుతుంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నికల వేడి అందుకుంది. యాత్రలు మొదలయ్యాయి. ప్రతి పార్టీ ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి అని తేలిపోయింది. సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని రెండు పార్టీల ప్రయత్నంగా తెలుస్తోంది. బీజేపీని కలుపుకుని పోవాలన్న ఆలోచనే లేకపోతే ఇప్పటికే రెండు పార్టీలూ కమ్యునిస్టులను తన జట్టులో చేర్చుకునేవి. బీజేపీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే కామ్రేడ్లకు అవకాశం ఉంటుంది. కామ్రేడ్లు కూడా బీజేపీ పొత్తుకు అంగీకరించ కూడదని మనసులోనే మొక్కుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ శాసనసభలో కమ్యునిస్టులకు మరో ఐదేళ్ల పాటు ఛాన్స్ ఉండదని తెలుసు. అందుకే బీజేపీ ఈ కూటమిలో చేరకూడదని ప్రార్ధిస్తున్నారనుకుంటా.
ఎందుకు సందేహం...?
అదలా ఉంచితే సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఎవరితో కలసి పోటీ చేసినా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? నో డౌట్.. అందులో వేరే అభిప్రాయం ఏముంది? చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి. అది చిన్న పిల్లాడి నుంచి వృద్ధుడి వరకూ తెలుసు. కానీ టీడీపీ, జనసేన నేతలకు మాత్రం తెలియదట. మొన్నామధ్య రాజమండ్రిలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఇది. మీ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరని? కానీ లోకేష్ కూడా ఇప్పుడు దానిపై చర్చించలేదన్నారు. అంటే నేరుగా చంద్రబాబే సీఎం అవుతారని, ఎందుకు అనుమానం అని ఎందుకు ప్రశ్నించలేకపోయారన్న సందేహం అది చూసిన, విన్న వారికి ఎవరికైనా కలుగుతుంది.
బలమైన పార్టీగా...
ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద టాపిక్ గా మారింది. ఎందుకు కూటమి తరుపున సీఎం అభ్యర్థిని ప్రకటించలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. ప్రతి గ్రామంలోనూ పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ. మొన్నటి ఎన్నికల్లోనూ తక్కువ ఓట్లేమీ రాలేదు. సీట్లయితే తగ్గాయి కాని, ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. చంద్రబాబుపై వ్యతిరేకత ఎక్కువగా లేదన్నది, ఒంటరిగా పోటీ చేసినా 39 శాతం పైగా ఓట్లను సాధించడం అంటే ఆషామాషీ కాదు. ఇక జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ఇప్పుడు మరో మూడు నుంచి నాలుగు శాతం పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రకటించడానికి?
మరి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారు కదా? అందులో మీమాంస ఎందుకు? ఎవరికైనా ఎందుకు ఆ సందేహం ఉంటుంది? లోకేష్ సమాధానం దాట వేయడానికి మొహమాటపడ్డారా? లేక నిజంగానే చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఓట్లు బదిలీ కావని భయపడుతున్నారా? అన్నది తెలియడం లేదు. ఒకవైపు అధికార పార్టీ ఒంటరిగా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్ అని ప్రకటించుకుని ముందుకు వస్తుంటే.. కూటమి మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి వెనకడుగు వేస్తుంది. ఇది టీడీపీ క్యాడర్ లో నిరాశను నింపుతుంది. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతారని, ఇలా నానిస్తే నష్టం జరగక మానదన్న హెచ్చరికలు పార్టీ నేతలకు అందుతున్నాయి. మరి ఎన్నికల సమయంలోనైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అన్నది టీడీపీలో చర్చనీయాంశమైంది.
Next Story