Fri Nov 22 2024 19:13:23 GMT+0000 (Coordinated Universal Time)
కట్టలు తెగుతున్న అసహనం
బీజేపీలో నేతల తీరు ఇలా ఉంటే.. నిన్న బుధవారం ఉదయం ఎం.పీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా నేతలు..
తెలంగాణ బీజేపీ లో నేతల అసహనం కట్టలు తెంచుకుంటోంది. గ్రూపు రాజకీయాలు, అంతర్గత వైషమ్యాలు, కేంద్ర నేతలతో సమన్వయ లోపం వెరసి.. ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు మొదలైన గ్రూపు రాజకీయాలు ఇప్పుడు చాలామంది నేతలను పార్టీ వీడేలా చేస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న మీటింగుల్లో, జిల్లాల్లో జరుగుతున్న మీడియా సమావేశాలు ఇతర కార్యక్రమాల్లో బీజేపీ నేతలు తమకు అన్యాయం జరుగుతోందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీజేపీ నేతల ఈ తీరు చూస్తుంటే.. పార్టీలో గేమ్ స్పిరిట్ తగ్గిందనే చెప్పుకోవాలి. భువనగిరి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి నిన్న జరిపిన మీడియా సమావేశంలో బీజేపీ వల్ల తనకు నష్టం జరిగిందని, ఆ పార్టీ నుంచి తను మానసికంగా ఎప్పుడో దూరమైపోయానని చెప్పారు. బీజేపీలో తాను ఒక కార్యకర్తగానే మిగిలిపోయానని, తెలంగాణ ఉద్యమకాంక్ష నెరవేరుతుందని భావించి తన యువ తెలంగాణ పార్టీని విలీనం చేస్తే ఆ ఆశయం నెరవేరేలా కనిపించడం లేదని జిట్టా చెప్పారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీని వీడిన కుంభం అనిల్ కుమార్‌ని జిట్టా దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అనే స్థాయి అనిల్ ది కాదని పేర్కొన్నారు. దాంతో.. జిట్టా కాంగ్రెస్‌లో చేరుతున్నారా ? అనే అనుమానాలు రేగాయి. మీడియా ముందు బీజేపీ పై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ జిట్టా బాలకృష్ణా రెడ్డిని సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు సస్పెండ్ చేస్తూ పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది.
బీజేపీలో నేతల తీరు ఇలా ఉంటే.. నిన్న బుధవారం ఉదయం ఎం.పీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా నేతలు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఏకపక్ష నిర్ణయంతో అర్వింద్ 13 మండలాల అధ్యక్షులను మార్చారు. కనీసం కారణాలు కూడా చెప్పకుండా అర్వింద్ తమకు అన్యాయం చేశారని ఆర్మూర్, బాల్కొండ, బోధన్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టినప్పడినుంచి పాత గ్రూపుల వాళ్ళు ఏదో ఒక నెపంతో పార్టీని దూషించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తమకు టికెట్ దొరుకుతుందో లేదోనన్న అనుమానంతో ఇప్పుడే పార్టీలు మారే ఆలోచనలు చేస్తున్నారు కొందరు. ఇటీవల కాలంలో విపరీతంగా బలం పుంజుకుంటున్న కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు ఆశావహులు. రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు బీజేపీ నుంచి బయటికి రావాలనుకుంటున్న ఆశావహులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కూడా ఆపరేషన్ బీఆర్ఎస్ ఆకర్ష్‌ను మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీజేపీ ల నుంచి బయటికి వచ్చే నేతల పై ఫోకస్ పెట్టారు. ముందుగా ఖమ్మం, నల్గొండ జిల్లాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లోని చాలా మంది కీలక నేతలను కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. తన వర్గానికీ, అక్కడి కాంగ్రెస్ క్యాడర్‌కీ సమన్వయ లోపం ఏర్పడటంతో నిరుత్సాహులు బయటికొస్తారని కేసీఆర్ ఆలోచన. నల్గొండ జిల్లాలో కొందరు కీలక నేతలు వచ్చే ఎన్నికలలో బీఫామ్ దక్కదేమో అన్న అనుమానంతో ఉన్నారు. వాళ్ళందరినీ బీఆర్ఎస్ ఆకర్ష్ ఆకర్షిస్తుందేమో చూడాలి. ఖమ్మం జిల్లాలో అయితే గులాబీ పార్టీకి ఏం జరిగినా ప్లస్సే కాని మైనస్ ఉండదు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీని వీక్ చేస్తే కలిసి వచ్చేది బీఆర్ఎస్ కే. అందుకే ముందుగా ఈ జిల్లాలపై శ్రద్ధ పెట్టారు కేసీఆర్.
(Views, thoughts, and opinions expressed in this newsstory/article belong solely to the author)
Next Story