Sat Dec 28 2024 19:03:05 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నీ ధైర్యానికి హాట్సాఫ్ బాసూ...ఇలాంటి నిర్ణయాలకు ఎన్ని గట్స్ కావాలి?
వైసీపీ రెండో జాబితాలాో 16 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. నిజంగా వైఎస్ జగన్ పెద్ద సాహసం చేశారనే చెప్పుకోవాలి
YSRCP:వైఎస్ జగన్ ను పొగడటం కాదు కానీ.. కొన్ని విషయాల్లో జగన్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నలభై ఏళ్ల వయసున్న వారు ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ ల పాలనను చూశారు. వీరిలో రాజశేఖర్ రెడ్డి జాతీయ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారవు. మిగిలిన వాళ్లంతా ప్రాంతీయ పార్టీ నేతలే. వీరు తమకు ఇష్టం వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చే వీలుంది. వైఎస్సార్ మాత్రం కాంగ్రెస్ హైకమాండ్, స్క్రీనింగ్ కమిటీ ఇలా అభ్యర్థుల ఎంపిక బాధ్యత మాత్రం పూర్తిగా ఆయనది కాదు. కానీ ఎన్టీఆర్ హయాంలో జరిగినట్లు అభ్యర్థుల మార్పును మళ్లీ జగన్ పాలనలో చూస్తున్నట్లే ఉంది. లీడర్ అనే వాడికి ధైర్యం కావాలి. ఒక అభ్యర్థిని ప్రకటించాలంటే అందుకు అనేక కోణాల్లో ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలో సర్వేలు లాంటివి చేయలేదు. ఆయన అనుకున్న వారికి.. నమ్మకస్తులకే టిక్కెట్లు ఇచ్చేవారు.
ఎవరూ ఈపాటి ధైర్యాన్ని....
కానీ తర్వాత చంద్రబాబు సిట్టింగ్‌లను ఎక్కువ మంది మార్చడానికి సిద్ధపడలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎక్కువ మంది కొత్తవారికి అవకాశం కల్పించలేకపోయారు. సీనియర్ నేతలకే అవకాశం కల్పించారు. ఇక కేసీఆర్ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌లు అందరికీ దాదాపు టిక్కెట్లను కేటాయించారు. ఎవరో ఐదారుగురికి మాత్రం టిక్కెట్లు ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ అభ్యర్థినైనా ప్రకటించే వీలుంది. కానీ అధికార పార్టీకి ఆ వెసులు బాటు ఉండదు. సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా ఉంటాడు. ఆయన అనుచర వర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వారికి టిక్కెట్ ఇవ్వకుండా ఏ పార్టీ అధినేత పెద్దగా సాహసం చేసే అవకాశం లేదు. కానీ జగన్ విషయంలోనే భిన్నంగా చూస్తున్నాం.
మూడు నెలలు సమయం ఉన్నా...
పైగా ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎన్నికలకు పది రోజుల ముందు టిక్కెట్లు కన్ఫర్మ్ చేస్తే ఏ పార్టీలోకి వెళ్లినా వారి వల్ల పెద్దగా రాజకీయంగా నష్టం ఉండదు. కానీ మూడు నెలల ముందే జగన్ ఈ సాహసానికి ఒడిగట్టారంటే ఆయన గుండెధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. టిక్కెట్ రాని వాళ్లంతా పార్టీలో ఉంటారని అనుకోలేం. అలాగే ఎమ్యెల్యే నుంచి ఎంపీ స్థానానికి పంపినా దానిని నెగిటివ్ గానే నేతలు చూస్తారు. అందుకే మూడు నెలలు ముందే వరసగా ఇన్ఛార్జులను ప్రకటిస్తూ జగన్ పెద్ద సంచలనమే సృష్టిస్తున్నారు. అయితే వీరంతా గెలుస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే తమ మీద తమకు లీడర్ కు నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ పని చేయగలుగుతారు. జగన్‌లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే దానికి సమాధానం చెప్పలేం కానీ.. ఒక ప్రయోగమే చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
16 మంది కొత్త వాళ్లకు....
తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మంత్రులను సయితం పక్కన పెట్టారు. తనకు గెలుపే ముఖ్యమన్న సందేశాన్ని జగన్ నేతలకు పంపారు. రెండో విడతగా 27 మంది ఇన్ఛార్జులను ప్రకటించారు. వీరిలో 16 మంది కొత్తవారే కావడం విశేషం. సిట్టింగ్ లను కాదని, వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అంటే ఆషామాషీకాదు. మరో విషయం ఏంటంటే.. ఎస్సీ, ఎస్టీ స్థానాలను మాత్రమే కాదు. అనేక కీలక నియోజకవర్గాల్లో నేతలను కూడా ఎడా పెడా మార్చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణును పక్కన పెట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లిని షిఫ్ట్ చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అలాగే కదిరి నియోజకవర్గంలోనూ కొత్త వారికి అవకాశం ఇచ్చి సిద్దారెడ్డికి నో టెక్కెట్ అంటూ చెప్పేశారు. ఇలా జగన్ పెద్ద సాహసానికే ఒడిగట్టారని చెప్పాలి. మరి చివరకు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది.
Next Story