Tue Nov 05 2024 19:31:27 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : టెన్షన్.. టెన్షన్.. కాల్ వస్తే... ఇక అంతే.. మూడో జాబితాలో ఎవరు? బీపీ పెరుగుతుంది భయ్యా
వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దడ తగ్గలేదు. మూడో జాబితా రూపుదిద్దుకుంటుండటంతో టెన్షన్ మొదలయింది.
YSRCP :వైఎస్సార్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దడ తగ్గలేదు. వణికిపోతూనే ఉన్నారు. చలికి మాత్రం కాదు. ఫోన్ రింగ్ అయితే మాత్రం గజగజ షివరింగే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఈసారి ఎంతమందికి సీట్లు వస్తాయి? ఎంతమందిని తప్పిస్తారు? ఎంతమందిని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయిస్తారు? ఇదే టెన్షన్ దాదాపు అందరు ఎమ్మెల్యేల్లో ఉంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ రెండు జాబితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. కొత్త వారికి అవకాశం కల్పించింది. మంత్రులను కూడా మార్చివేసింది. ఒకరు ఇద్దరు కాదు.. చాలా మందికి స్థానచలనంతో పాటు మరికొందరికి సీట్లు హుళక్కి అని తేలడంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలయింది.
మూడో జాబితాను...
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు వణికిపోతున్నారు. మూడో జాబితాను తయారు చేసే పనిలో కూడా ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం పిచ్చపిచ్చగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత తమను ఎక్కడ అధికారానికి దూరం చేస్తుందేమోనని భావించి అభ్యర్థులను మార్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంటలిజెన్స్ నివేదికలతో పాటు ఐ ప్యాక్ టీం జరిపిన సర్వే నివేదికలను బట్టి ఆయన అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయాలనే తీసుకుంటున్నారు. ముందుగా పిలిపించి తాను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పి మరీ పంపిస్తున్నారు.
నోటిఫికేషన్ వచ్చేంత వరకూ...
ఇప్పటికి కొన్ని జిల్లాల్లోనే ఇన్ఛార్జుల ఎంపిక పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకూ ఈ ప్రక్రియ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా దాదాపు యాభై మందికి పైగా అభ్యర్థులను మార్చివేస్తారన్న టాక్ మాత్రం పార్టీలో వినపడుతుంది. వీక్ గా ఉన్న అభ్యర్థుల స్థానంలో బలమైన క్యాండిడేట్లను గుర్తించడంతో పాటు కూటమిని ఎదుర్కొనే సరైన అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. టీడీపీ, జనసేన కూటమిని సమర్థవంతంగా ఎదుర్కొనే అభ్యర్థులతో పాటు సామాజికవర్గం విషయంలో కూడా జగన్ రాజీ పడటం లేదు. ఎక్కువగా బీసీలకు ఈసారి అవకాశం కల్పించాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు.
బీసీలకు ఎక్కువగా...
బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చిన పార్టీగా తాను జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎటూ తన వైపు ఉంటారు కాబట్టి అధిక సంఖ్యలో బీసీలు తన వైపు చూసేలా జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకోసమే ఆయన గత ఎన్నికల్లో జనరల్ అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లోనూ బీసీలకు అవకాశమిస్తున్నారు. అలాగే తనకు గత ఎన్నికల్లో అండగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ కూడా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఏ చిన్న అవకాశంతో ఒక్క సీటు కూడా పోకూడదన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రతి నియోజకవర్గంలో అథ్యయనం చేయించి మరీ అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టెన్షన్ పట్టుకుంది.
Next Story