Mon Dec 23 2024 17:01:17 GMT+0000 (Coordinated Universal Time)
గట్టుసింగారంలో శాతవాహనుల ఆనవాళ్లు
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎపిగ్రఫీ మునిరత్నం రెడ్డి
తెలంగాణలోని పలు ప్రాంతాలను కూడా శాతవాహనులు పాలించారా? చాలా విషయాలు ఇంకా మనకు తెలియాల్సి ఉందా? అవుననే అని అంటున్నారు చరిత్రకారులు. పెద్దపల్లిలోని గట్టుసింగారంలో లభించిన శాసనం.. శాతవాహన రాజ్యానికి చెందిన 16 మహాజనపదాలలో (ప్రాంతాలు) తెలంగాణ ఒక భాగమని నిర్ధారించింది. ఆ శాసనం ప్రాకృత భాషలోని బ్రాహ్మీ అక్షరాలతో ఉంది. తెలంగాణలోని నేటి కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలు అస్మాక ప్రాంతంలో భాగంగా ఉండేవని.. అవి శాతవాహన రాజ్యంలో భాగమని నిర్ధారించింది.
శాతవాహన రాజ్య స్థాపకుడు సిరిముఖుడుకు సంబంధించిన తొలి నాణాలు కోటిలింగాల, కొండాపూర్ ప్రాంతాల్లో లభ్యమైన సంగతి తెలిసిందే!! ఇప్పుడు గట్టుసింగారంలో లభించిన శాసనం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. శాతవాహనులకు తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి ఉన్న సంబంధం బలపడేలా చేస్తుంది. శాతవాహనుల రాజ్యంలో ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. శాతవాహన రాజులు అమరావతి, ప్రతిష్ఠానం వంటి వివిధ నగరాలను రాజధానులుగా చేసి పరిపాలించారు. శాతవాహనులను ఆంధ్రులు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారత భూభాగాల్లో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి, క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుండి మూడవ శతాబ్దం CE వరకు పాలించిన మొదటి రాజవంశం.
మైసూర్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) డైరెక్టర్ (ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రాత్మక ఆవిష్కరణ అని తెలిపారు. గట్టుసింగారం వద్ద లభించిన ఒక బండరాయిపై శాసనాలను చెక్కారు. ప్రాకృతంలోని వచనం అసంపూర్ణంగా ఉంది. హరితీపుత్ర, కుమార హకుసిరి స్నేహితుడి గురించి ఆ శాసనాల్లో ప్రస్తావించారు. రెండవ శాసనం నాగానిక -శాతకర్ణిల కుమారుడు శాతవాహన యువరాజు కుమార హకుసిరి గురించి ఉంది. మొదటి శాసనం కరీంనగర్ జిల్లాలో కనుగొన్నారు. 16 మహాజనపదాలలో ఒకటైన అస్మాక ప్రాంతాన్ని హకుసిరి పాలించినట్లు శాసనాలు నిర్ధారించాయి. శాతవాహనుల శాసనాలలో మొదటిసారిగా హరితీపుత్ర ప్రస్తావన కనుగొన్నట్లు తెలిపారు. ఫోటో జర్నలిస్ట్ డి రవీందర్ రెడ్డి ఈ శాసనాలను కనుగొన్నారు. రాక్ పెయింటింగ్స్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో శిలాఫలకం కనిపించిందని రవీందర్రెడ్డి తెలిపారు.
శాతవాహన రాజుల్లో గొప్పవాడిగా గుర్తింపు పొందారు గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన వివరాలను ఆయన తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో ఉన్నాయి. శకరాజు నహపాలుడిని ‘జుడేల్ తంచి’ యుద్ధంలో ఓడించిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణికి సొంతం. సీ.ఈ.78లో నూతన శాలివాహన శకాన్ని ఆరంభించారు.
Next Story