Tue Nov 26 2024 05:40:15 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : జగన్ కు రెడ్లు దూరమవుతున్నారా? ఎన్నికల స్ట్రాటజీనా?
వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో బీసీలను దగ్గరకు చేసుకుందామని రెడ్లను దూరం చేసుకుంటున్నారా? అన్న అనుమానం కలుగుతుంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఒక కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం, జనసేన ఒక్కటయ్యాయి. మిగిలిన పార్టీలు ఎటు వైపు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే అధికార పార్టీ కూడా స్పీడ్ పెంచేసింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. మూడు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్లంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంతో పాటు కొత్త నేతలు కూడా జనాలకు పరిచయం అవుతారని జగన్ భావిస్తున్నారు.
యాభై మంది వరకూ...
దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం పార్టీలో బాగా వినపడుతుంది. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. రెడ్డి సామాజికవర్గం నేతలను పక్కన పెట్టినా పెద్దగా ఓటు బ్యాంకుకు చిల్లు పడదన్నది జగన్ భావన. రెడ్డి సామాజికవర్గంలో పురుష ఓటర్లు కొంత అటు ఇటుగా ఉన్నా... మహిళ ఓటర్లు తన వైపు మొగ్గు చూస్తారన్న అంచనాలో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గంలో అసంతృప్తి ఉన్నా పోలింగ్ సమయానికి తనవైపు ఆ సామాజికవర్గం చేరుతుందన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. అందుకే ఓటమి అంచున ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలన్న యోచనలో జగన్ ఉన్నారు.
వారికే ప్రాధాన్యత...
ప్రధానంగా ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజికవర్గం ఓటర్లపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఈ వర్గాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి వారికి సంక్షేమ పథకాలతో పాటు వివిధ ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకున్నారు. వారిని అక్కున చేర్చుకుంటే చాలు రెండోసారి తన విజయానికి ఢోకా ఉండదన్న విశ్వాసంతో వైసీపీ అధినేత ఉన్నారు. ఏపీలో వారి ఓట్లే కీలకం. ఎక్కువ కూడా. అందుకే ఇతర సామాజికవర్గాలను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. తన కోసం, పార్టీ కోసం పనిచేసి, శ్రమించి ఎన్నికల సమయంలో పదో పరకో ఖర్చు చేసిన సొంత సామాజికవర్గం నేతలను కూడా ఆయన పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు.
కులాల వారీగా...
అందులో భాగంగానే వరసగా జగన్ నిర్ణయాలు భవిష్యత్ లో ఉంటాయన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. అగ్రవర్ణాలలో కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వంటి సామాజికవర్గాలు ఎటూ తనకు అండగా నిలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. అలాగే కాపు సామాజికవర్గంలో కూడా అధిక శాతం మద్దతు ప్రతిపక్షాల వైపే ఉంటుందున్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మంచి చేసుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకే వారికే ఎక్కువ సీట్లను కేటాయించాలన్న నిర్ణయానికి కూడా వచ్చారని చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గం పైకి జగన్ ను దూషిస్తున్నా ఎన్నికలు సమీపించే కొద్దీ తనకు చేరువవుతారన్న నమ్మకంతోనే ఆయన సొంత కులాన్ని పదవులకు దూరం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుందన్నది విశ్లేషకుల అంచనా.
Next Story