Sat Jan 11 2025 08:57:29 GMT+0000 (Coordinated Universal Time)
TeaTime Uday Tangella : టీ టైం నుంచి గ్లాస్ పార్టీ వరకూ.. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా... ప్రస్థానం అదిరిపోయిందిగా
కాకినాడ పార్లమెంటు నుంచి ఉదయ్ పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు
TeaTime Uday Tangella :కాకినాడ పార్లమెంటు స్థానానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంటు నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. మరో మాట కూడా అన్నారు. అమిత్ షా, మోదీ తనను పార్లమెంటుకు పోటీ చేయమంటే తాను కాకినాడ నుంచి ఉదయ్ పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు. దీంతో ఉదయ్ కు పవన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది జనసైనికులకు చెప్పకనే తెలుస్తుంది. అందుకే ఉదయ్ ఎవరు అన్న దానిపై గూగుల్ లో కొందరు సెర్చ్ చేస్తున్నారు కూడా. ఉదయ్ పూర్తి పేరు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు అని పిలుస్తారు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.
సాఫ్ట్వేర్ రంగం నుంచి...
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కడియం. ఆయన పదో తరగతి కడియంలోనే చదివారు. ఇంటర్ మాత్రం పుదుచ్చేరికి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. తర్వాత దుబాయ్ లో కొంతకాలం వరకూ పనిచేసి బాగానే సంపాదించారు. నాలుగు డబ్బులు రావడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంపై విరక్తి చెందడంతో ఆయన 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన భావించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఉదయ్ సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు.
టీ టైం పేరుతో...
2016లో టీ టైం పేరుతో అవుట్లెట్ ను ఉదయ్ ప్రారంభించాడు. జనంలో టీకి ఉన్న ఇష్టాన్ని చూసి దానినే వ్యాపారంగా మలచుకున్నాడు. మొదటి అవుట్ లెట్ 2016లో రాజమండ్రిలోనే ప్రారంభించాడు. ఇక ఉదయ్ వెనుదిరిగి చూడలేదు. 2016లో వంద అవుట్ లెట్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఏడాదికి రెండు కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ సాధించారు. ఇక అంతటితో ఆగకుండా ఇండియా మొత్తం మూడు వేలకకు పైగా అవుట్ లెట్ ను ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించగలిగారు. నెలకు 35 కోట్ల రూపాయల ఆదాయం. ఏటా నాలుగు వందలకు పైగా టర్నోవర్ తో వ్యాపారాన్ని అభివృద్ధి జరిగేలా చేయగలిగారు. టీ టైమ్ ఉదయ్ గా ఆయన ఇంటిపేరును కూడా మార్చుకున్నారు.
వారాహి వాహనం ఇచ్చి...
సహజంగా పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు. వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆ వాహనంతోనే పవన్ ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతుంటారు. ఆయనకు తొలుత పిఠాపురం టిక్కెట్ ఇవ్వాలని భావించినా అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఉదయ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం రెండు పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేయనుంది. రెండు స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
Next Story