Sat Nov 23 2024 00:30:30 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : బిల్డప్ తప్ప ఏమీ లేదా.. ఇదేనా అసలు సత్తా.. జగన్ ఓడించాలని.. తన పార్టీని తానే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ నేతలను, క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నాయి
Pawan Kalyan :జగన్ ను ఓడించాలంటే పార్టీని పణంగా పెట్టాలా? సీట్లను తగ్గించుకుని తనకు తానే రాజకీయంగా ఇబ్బందులు జనసేనాని కొని తెచ్చుకుంటున్నారా? చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలకు అంతా తలూపాల్సిన పనేంటి? ఎవరి అవసరం ఎవరికి ఉంది? జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం పవన్ కల్యాణ్ కు ఎంత ముఖ్యమో.. చంద్రబాబుకు అంతకన్నా ఎక్కువ అవసరం కదా? ఇవే ప్రశ్నలు జనసైనికుల నుంచి ఎదురవుతున్నాయి. కానీ వాటికి సమాధానం చెప్పేదానికి మాత్రం పార్టీ అధినాయకుడు సిద్ధంగా లేరు. రోజురోజుకూ పవన్ కల్యాణ్ పై ఆయన పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఆయన అడుగులు పడుతుండటం ఇప్పుడు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా ఆలోెచనలో పడేస్తున్నాయి.
తనకు తానే దిగజారి...
పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఆయనకు సినిమాల్లో అంత క్రేజ్ ఉంది. డబ్బులకు కొదవ లేదు. ఇమేజ్ ఏ మాత్రం తగ్గని నటుడు. ఇప్పటికీ కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కమ్ హీరో. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. జగన్ ను ఓడించాలన్న ఏకైక ధ్యేయంతో తన పార్టీని తానే దిగజార్చుకుంటున్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజమే.. అందరూ ఒప్పుకోవాల్సిందే. జనసేనకు రెండు జిల్లాల్లో తప్ప పెద్దగా బలం లేదు. కానీ అవసరం అవతలి వారిదైనప్పుడు రాజకీయ పార్టీ అధినేతగా తాను ఎక్కడా తగ్గకూడదు.
కాపు సామాజికవర్గంలోనూ...
అలా తగ్గితే పార్టీ శ్రేణుల్లోనూ, ముఖ్యంగా కాపు సామాజికవర్గంలోనూ తప్పుడు సంకేతాలు వెళతాయి. కానీ పవన్ కల్యాణ్ అదేమీ ఆలోచించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదన్న ఏకైక భావనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని పాతాళంలోకి నెట్టేసేలా కనపడుతున్నాయి. తొలుత మూడు పార్లమెంటు స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ అంకెలపైనే జనసేన నేతలు, కార్యకర్తలు పెదవి విరిచారు. ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని నేరుగానే కొందరు ప్రశ్నించారు. మరికొందరు పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. అన్నింటికీ ఒకే సమాధానం.. రాష్ట్ర అభివృద్ధి కోసమేనంటూ ఒకటే డైలాగ్.
పార్టీని పణంగా...
రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే.. పార్టీ పణంగా పెట్టడమేనా? అన్న ప్రశ్నకు మాత్రం పవన్ నుంచి సరైన సమాధానం మాత్రం అండడం లేదు. తాజాగా మరో మూడు సీట్లను తగ్గించుకున్నారు. నిన్న జరిగిన చర్చల్లో సీట్ల కేటాయింపుపై మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. బీజేపీకి కేటాయించాల్సి రావడంతో తన సీట్లను పవన్ కల్యాణ్ త్యాగం చేశారట. టీడీపీ పదిహేడు లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ పది అసెంబ్లీ, ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకే పరిమితమయింది. దీంతో జనసైనికులు రగిలిపోతున్నారు. ఇదేం లెక్క.. ఇదేమి వ్యూహం అంటూ అధినేతపై సోషల్ మీడియాలో నేరుగానే విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం తాను సర్దుబాటు చేసుకున్నది జగన్ ఓడించడానికే నంటూ అదే మంత్రాన్ని జపిస్తున్నారు. మరి పవన్ ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందా? లేక...?
Next Story