Sun Dec 22 2024 17:34:17 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : బిల్డప్ చూసి ఎన్ని సీట్లో అనుకున్నాం.. చివరకు ఇరవై నాలుగు సీట్లేనా?
పవన్ కల్యాణ్ మాటలు, వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా నలభై సీట్లలో పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు భావించారు
పవన్ కల్యాణ్ మాటలు, వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా నలభై సీట్లలో పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు భావించారు. నేతల సమావేశాల్లో జనసేన నలభై స్థానాల్లో గెలిచే సత్తా ఉందని, బలమైన నాయకత్వం ఉందని పదే పదే పవన్ కల్యాణ్ చెబుతుండటంతో ఆ అంకెకు ఓకే చేస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ తీరా ప్రకటన వచ్చేసరికి 24 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతుంది. అలాగే కాపు సామాజికవర్గంలోనూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసి అధికారంలోకి ఎలా వస్తామని అంటూ కొందరు సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అంకె ఎంతో ఘనంగా ఉంటుందని....
పవన్ కల్యాణ్ పదే పదే తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతుంటే చంద్రబాబుకు అవసరమయిన సమయంలో పొత్తు కుదిరింది కాబట్టి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలోనే సీట్లను తీసుకుంటారని అంచనా వేశారు. మరొక వైపు హరిరామ జోగయ్య కూడా నలభై నుంచి యాభై నియోజకవర్గాలకు తీసుకోవాలని అంటూ ఏకంగా ఒక లిస్ట్ను ప్రకటించారు. ఇదంతా చూసి పవన్ కల్యాణ్ తక్కువ స్థానాలకు పరిమితమవ్వడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ చంద్రబాబుకు లొంగిపోయారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి సీట్లను తెచ్చుకోవడం అంటూ ప్రశ్నిస్తున్నారు.
అవసరం ఉన్నప్పుడే...
అవతలి వాడికి అవసరం ఉన్నప్పుడే రాజకీయాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని, అలా కాకుండా వారు చెప్పినట్లు తలాడించడం పవన్ కల్యాణ్ వ్యూహమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాగయితే ఇక అయినట్లేనని అంటున్నారు. కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కల్యాణ్ పొత్తును కుదుర్చుకున్నట్లుంది తప్పించి, స్వంతగా ఎదిగి ముఖ్యమంత్రి కావాడానికి ప్రయత్నం మాత్రం చేయడం లేదని అర్థమయిందని అంటున్నారు. ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాపు సామాజికవర్గం నేత సీఎం అయ్యే అవకాశం దక్కదని, అటువంటి ఛాన్స్ ను చేజేతులా పవన్ మిస్ చేశాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ మాత్రం...
మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం చాలా స్పష్టంగానే ఉన్నారు. తాను ఎక్కువ స్థానాలను తీసుకుని ఓటమి పాలయ్యే కంటే తక్కువ స్థానాలను తీసుకుని గెలుపొంది ప్రభుత్వంలో కీలకంగా మారతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఈ ప్రతిపాదనలకు అంగీకరించానని కూడా పవన్ చెప్పడం విశేషం. అంతే తప్ప కేవలం అంకెల కోసం, గొప్పల కోసం కాదని ఆయన అన్నారు. ఇప్పుడున్న అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రభుత్వానికి మంచి పాలన అందించే ఉద్దేశ్యంతోనూ, ఓట్లు చీలి పోయి జగన్ కు లాభం చేకూరకూడదని భావించి తాము ఈ పొత్తుకు తలూపినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మొత్తం మీద పవన్ తీసుకున్న 24 స్థానాల అంకెపై పార్టీలోనూ, సామాజికవర్గంలోనూ నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది.
Next Story