Mon Dec 23 2024 16:23:15 GMT+0000 (Coordinated Universal Time)
KVP : ఆత్మ ఆట మొదలు పెట్టిందా.. ఎవరిని టార్గెట్ చేసినట్లో?
కేవీపీ రామచంద్రరావు యాక్టివ్ అయ్యారు. వైఎస్ షర్మిల వెనక ఉండి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆత్మ అంటే ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా కేవీపీ రామచంద్రరావుకు పేరుంది. వైఎస్ పాలన చూసుకుంటే ఆయన తరుపున పార్టీ వ్యవహారాలన్నీ కేవీపీ రామచంద్రరావు చక్కబెట్టేవారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించాలన్న కేవీపీయే చూసుకునే వారు. అంతేకాదు అసెంబ్లీ సీట్ల విషయంలోనూ, మంత్రి పదవుల విషయంలోనూ కేవీపీ మాట చెల్లుబాటు అయ్యేది. ఇక ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకూ కేవీపీ నుంచి అప్పట్లో ఫోన్ వచ్చిందంటే చాలు వైఎస్ చెప్పినట్లే భావించి ఆయన ఆదేశాలను అమలు చేసేవారు.
వైఎస్ కు ఇబ్బంది లేకుండా...
నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా కేవీపీ రామచంద్రరావు చక్కపెట్టేవారు. ఆ తలనొప్పులను పెద్దాయన వరకూ తీసుకెళ్లనిచ్చే వారు కాదు. వైఎస్, కేవీపీలు ఇద్దరూ స్నేహితులు. అంతకు మించి ఒకరిపై ఒకరికి నమ్మకం. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కేవీపీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. అలాగని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీ ఆయన ఇచ్చిన స్వతంత్రను దుర్వినియోగం చేసే వారు కాదు. అలా నడిపించేశారు. అలాగే కేవీపీ రామచంద్రరావును వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు చేయగలిగారు. అలాగే అధినాయకత్వంతో మాట్లాడే విషయంలో కూడా వైఎస్ తరుపున కేవీపీ చూసేవారు.
వైఎస్ మరణం తర్వాత...
వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ లోనే ఉన్నా రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైఎస్ తనయుడు స్థాపించిన వైసీపీలోకి ఆయన వెళ్లలేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడింది. మొన్నటి వరకూ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చింది. అయితే కేవీపీ ఏపీకి చెందిన వారు కావడంతో ఇక్కడి రాజకీయాల్లో ఆయన వేలు పెట్టలేని పరిస్థిితి. అయితే మరోసారి ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన స్నేహితుడు తనయ వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా నియమితులు కావడంతో మళ్లీ ఏపీ రాజకీయాల్లో ఆయన హవా నడిచేటట్లే కనపడుతుంది. హైదరాబాద్ నుంచి వైఎస్ షర్మిలతో ఇడుపులపాయకు వచ్చిన కేవీపీ రేపు విజయవాడలో పదవీ బాధ్యతల స్వీకరణలో పాల్గొననున్నారు.
షర్మిలకు అండగా...
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ షర్మిల తన మేనకోడలని ఆయన చెప్పడం విశేషం. అదే సమయంలో కేవీపీతో గతంలో సాన్నిహిత్యంతో మెలిగిన రాజకీయ నేతలు కూడా కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా ఆయన ఫోకస్ పెట్టారని తెలిసింది. నాడు కేవీపీతో లబ్ది పొందిన అనేక మంది రాజకీయ నాయకులు ఇప్పుడు అనేక పార్టీల్లో ఉన్నారు. వారందరితో మాట్లాడి తిరిగి ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసి, వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని కేవీపీ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆపరేషన్ ఏపీ అంటూ రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన షర్మిల వెనక ఉండి నడిపిస్తారన్న టాక్ కూడా కాంగ్రెస్ లో బలంగా వినపడుతుంది. అయతే ఎవరెవరు పార్టీలో చేరతారన్నది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశముంది.
Next Story