Thu Dec 26 2024 10:28:29 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యో పాపం.. ఆమె జీవితంలో ఇన్ని విషాదాలు ఏంటో!
ఈ విపత్తు కారణంగా ఆమెకు దగ్గరి బంధువులు కూడా లేకుండా
కేరళ లోని వాయనాడ్ లో జులై నెలలో ప్రకృతి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కొండచరియలు విరిగిపడటంతో 24 ఏళ్ల శృతి తన మొత్తం కుటుంబాన్ని కోల్పోయింది. ఆ బాధను దిగమింగుకుని బ్రతుకుతున్న శృతి జీవితంలో మరో ఊహించని విషాదం నెలకొంది. ఆమె కాబోయే భర్త జెన్సన్ కారు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అతను బుధవారం రాత్రి 8:50 గంటలకు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. యాక్సిడెంట్ లో అతని ముక్కు నుండి అధిక రక్తస్రావం జరిగింది, అతని మెదడులో కూడా అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి ప్రాణాలను కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మంగళవారం నాడు జెన్సన్ కారును ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న శృతి, జెన్సన్ కుటుంబ సభ్యులలో చాలా మందికి గాయాలయ్యాయి కానీ ప్రమాదం నుండి బయటపడ్డారు.
జూలై 30న కొండచరియలు విరిగిపడటంతో మెప్పాడి పంచాయతీలోని చూరల్మల, ముండక్కై గ్రామాల్లోని శ్రుతి తల్లిదండ్రులు శివన్న, సబిత, చెల్లెలు శ్రేయ సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ విపత్తు కారణంగా ఆమెకు దగ్గరి బంధువులు కూడా లేకుండా పోయారు. ఆమెకు మిగిలిన ఏకైక అండ కాబోయే భర్త జెన్సన్. ప్రకృతి సృష్టించిన విషాదానికి కొన్ని వారాల ముందు జూన్ 2న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంతలో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మొదట డిసెంబర్లో పెద్ద పెళ్లిని ప్లాన్ చేసుకున్న ఈ జంట, కొండచరియలు విరిగి పడి కుటుంబ సభ్యుల ప్రాణాలు పోవడం, శృతి కొత్తగా నిర్మించిన ఇల్లు, రూ. 4 లక్షల నగదు, 15 సవర్ల బంగారం కూడా కొట్టుకుపోవడంతో కోర్టులో రిజిస్టర్డ్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఊహించని విషాదం శృతి జీవితాన్ని తలక్రిందులు చేసింది.
Next Story