Mon Dec 23 2024 15:00:17 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ గ్యారంటీ కార్డు తళతళ... గులాబీ కార్డు మాత్రం?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫేస్టో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది
బ్రహ్మాండం బద్దలయి పోతుందన్నారు. కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ మ్యానిఫేస్టో వస్తుందని మీడియాలో మోత మోగిపోయింది. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఉండే వ్యతిరేకతను ఎదుర్కొనడానికి కేసీఆర్ అన్ని వర్గాల మీద వరాల జల్లు ప్రకటిస్తారని భావించారు. మీడియాలో వచ్చినవేవీ పెద్దగా మ్యానిఫేస్టోలో కనిపించలేదు. ఏదో ఊహించుకున్న వారికి మాత్రం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫేస్టో చూసిన తర్వాత చాలా వరకూ నిరాశకు గురయ్యారు. సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారంటే మ్యానిఫేస్టో పెద్ద అట్రాక్టివ్ గా లేదనే చెప్పాలి. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుతో పోల్చుకుంటే గులాబీ కార్డు మాత్రం వెలవెలపోయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గెలుపు ధీమాతో...
మూడోసారి గెలుపు తనదేనన్న ధీమా కావచ్చు. హ్యాట్రిక్ విజయం అన్న అతి విశ్వాసం అవ్వొచ్చు. కేసీఆర్ పెద్దగా ఉచితాల జోలికి పోలేదు. కొత్త పథకాలేవీ పెద్దగా కారు పార్టీ మ్యానిఫేస్టోలో కనిపించలేదు. ఉన్న వాటినే కొంత నగదు సాయాన్ని పెంచారు. అది కూడా దశలవారీగా అమలు చేస్తామని చెప్పి కొంత నిరాశకు గురి చేశారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి రాష్ట్ర ఖజానా పరిస్థితి తెలిసి ఆయన ఈ విధంగా వ్యవహరించారా? అన్న అనుమానం మ్యానిఫేస్టో చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది. ప్రధానంగా మహిళలు, రైతులకు మాత్రమే ఎక్కువ మ్యానిఫేస్టోలో పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. అసలే సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇచ్చేశారు. వారిపై ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు కనీసం మ్యానిఫేస్టో ద్వారా చేసిన ప్రయత్నం కనిపించలేదు.
యువత గురించి...
అంతే తప్పించి యువత గురించి ప్రస్తావన లేదు. నిరుద్యోగుల ఊసే లేదు. సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునే ప్రయత్నించారు తప్పించి ప్రధాన ఓటర్లైన యువత పట్ల నిర్లక్ష్యం వహించారు. దళిత బంధును ప్రస్తావించిన కేసీఆర్ బీసీ బంధు గురించి మాత్రం ఊసెత్తలేదు. తనపై నమ్మకం ఉంచి మరోసారి గెలిపించమని కోరారు తప్పించి.. ప్రత్యేకించి తాను మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి ఈ కొత్త పథకాన్ని తాను తెస్తానని మాత్రం కేసీఆర్ ప్రకటించలేదు. దీనిపై పార్టీ వర్గాల్లోనే పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ కు ధీటుగా...
కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత కరెంట్, నిరుద్యోగులకు హామీ, రైతు భరోసా ఏటా పదిహేను వేలు, వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు సాయం, వరి పై ప్రతి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షలు, ఉద్యమ కారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, పింఛను నెలకు నాలుగు వేలు, ఆరోగ్య శ్రీ పదిలక్షలకు వరకూ పెంచుతామని చెప్పింది. డిసెంబరు 9వ తేదీన తాము ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే కేసీఆర్ మాత్రం విడతల వారీగా ఇస్తామని చెప్పడం మాత్రం పార్టీ నేతలకే రుచించడం లేదు. దీంతో గులాబీ కార్డు పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
Next Story