Mon Jan 13 2025 20:20:28 GMT+0000 (Coordinated Universal Time)
చాణక్యుడు … చంద్రుడు
చంద్రబాబు రాజకీయాల్లో కాకలు తీరిపోయారు. వచ్చే ఎన్నికలు ముఖ్యం. గెలవకుంటే పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారుతుంది.
రాజకీయాల్లో ఎప్పటికప్పడు పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం సరైన పొలిటీషియన్ చేస్తారు. తనకు అనుకూలమైన ఏ పరిస్థితిని ఏ రాజకీయనేత వదిలి పెట్టరు. అందునా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయాల్లో కాకలు తీరిపోయారు. వచ్చే ఎన్నికలు ఆయనకు ముఖ్యం. రానున్న ఎన్నికల్లో గెలవలేకపోతే పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారుతుంది. అందుకే చంద్రబాబు అందివచ్చిన ఏ ఒక్క అంశాన్ని ఆయన వదలరు. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కొనడం అంత ఆషామాషీ కాదు. వ్యూహాల పరంగా ఆయన ఎత్తులు చిత్తులు అవతలవారికి అర్థమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్నది ఆయన ప్రత్యర్థులు సయితం అంగీకరించే విషయం.
అరెస్ట్ చేస్తారని…
చంద్రబాబు తాను అరెస్ట్ అవుతానని ముందే తెలుసు. అనంతపురం జిల్లా పర్యటనలోనే ఆయన మూడు రోజుల ముందే చెప్పారు. తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని చెప్పడం వ్యవస్థలో ఆయనకున్న వేగు వ్యవస్థ కారణమని చెప్పక తప్పదు. అయినా చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆయన తాను అరెస్ట్ కావాలనుకుని, అవసరమైనంత సానుభూతిని పొందాలన్న ఏకైక నిర్ణయంతోనే పోలీసుల రాక కోసం వేచి చూశారని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. జనంలోకి తన అరెస్ట్ బలంగా వెళితే అనేక రకమైన ప్రయోజనాలు రాజకీయంగా తనకు లభిస్తాయని చంద్రబాబు ఆశించారు. అదే సమయంలో తాను ఇన్ని రోజుల పాటు జైలులో ఉండాల్సి వస్తుందని కూడా ఊహించి ఉండరు. కేవలం అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వస్తారనే ఆయన అంచనా వేసినట్లు కనపడుతుంది.
తెగింపు వస్తుందన్న...
తన అరెస్ట్ తో సానుభూతి వస్తుందని ఆయన విశ్వసించారు. 48 గంటల పాటు చంద్రబాబు ఫొటో తప్ప టీవీల్లో మరేదీ కనపడలేదు. అంత వరకూ సక్సెస్ అయినట్లే. అంత మైలేజ్ వేల కోట్లు ఖర్చు చేసినా రాదన్నది ఆయనకు తెలియంది కాదు. తద్వారా జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనడం సులువవుతుంది. క్యాడర్ లోనూ, నేతల్లోనూ ధైర్యం కలుగుతుంది. ఒకరకమైన తెగింపు వస్తుంది. ఆ తెగింపు రావాలంటే తాను అరెస్ట్ కావాలని చంద్రబాబు ఆలోచించి ఉండవచ్చు. ఇప్పటికే అనేక మంది నేతలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు బయటకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రోడ్డెక్కారు. ఆ ఒక్కటి చాలు.. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో సమర్థంగా ఎదుర్కొనేంత ధైర్యం తన అరెస్ట్ ఇస్తుందన్న చంద్రబాబు ఆలోచన సక్సెస్ అయినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ క్యాడర్ లో మాత్రమే కాదు జనంలో కూడా తన అరెస్ట్తో ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని ఆశించారు.
పవన్ పొత్తు…
ఇక మరో ముఖ్యమైన అంశం. పవన్ కల్యాణ్ ను కొన్ని సీట్లకే పరిమితం చేయవచ్చు. ఇప్పటికే వారాహి యాత్రతో గతం కంటే కొంత ఇమేజ్ ను బిల్డప్ చేసుకుంటూ వెళుతున్న పవన్ కల్యాణ్ ను ఎక్కువ స్థానాలు ఆశించకుండా నిలువరించవచ్చు. ఆయన అడిగినన్ని సీట్లు కాకుండా తాను ఇచ్చినన్ని సీట్లు తీసుకునేలా ఈ అరెస్ట్ ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదు. జనసేనాని కూడా ఇక ఏమీ చేయలేకపోవచ్చు. పవన్ ఇమేజ్ ను తన అరెస్ట్ తో తొలగించాలని కాకపోయినా తగ్గించాలన్న ఆయన అరెస్ట్ నిర్ణయం రాజకీయంగా ప్లస్ అయినట్లే. ఎలా చూసినా తన అరెస్ట్ పొలిటికల్ గా లాభిస్తుందన్న నమ్మకంతోనే ఆయన అరెస్ట్ కు సిద్ధమయ్యారు. ఇక ఆరు రోజుల నుంచి జైలులోనే ఉండటంతో మరింత సింపతీ పెరుగుతుందని భావిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఈ లాజిక్కులు, సెంటిమెంట్ లు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. తూనికలు, కొలతల ప్రకారం చూసేది వ్యాపారమే కాని రాజకీయం కాదని అందరికీ తెలిసినా.. ఒక్కోసారి అవి అనుకూలంగా పనిచేస్తాయి. మరి చంద్రబాబు నిర్ణయం ఏ మేరకు ఎవరికి ఉపయోగపడుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story