Wed Nov 06 2024 02:00:03 GMT+0000 (Coordinated Universal Time)
రాటుదేలిపోయారే
ఎన్టీఆర్ కుమార్గెలు భువనేశ్వరి, పురంద్రేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు
రాజకీయాలు తెలియకపోవచ్చు. తండ్రి ముఖ్యమంత్రి కావచ్చు. తండ్రి సీఎం అని వారు విర్రవీగలేదు. ఇంటి గడప దాటి రాలేదు. భర్త రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్నప్పుడు కూడా గృహిణిగా ఉండటానికి ఇష్టపడ్డారు తప్పించి రొచ్చు రాజకీయాల్లోకి చొరబడాలని ప్రయత్నించలేదు. ఆమె దగ్గుబాటి పురంద్రీశ్వరి. తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీలోనూ, రాష్ట్రంలోనూ తిరుగులేని నేతగా ఉన్నప్పుడు కూడా ఆమె రాజకీయాల వైపు చూడలేదు. కానీ తండ్రి మరణం తర్వాతనే ఆమె రాజకీయాలను వంటబట్టించుకున్నారు. తండ్రి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కేంద్ర మంత్రి అయ్యారు.
బీజేపీలో చేరి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన పురంద్రీశ్వరి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె ఏ రోజూ డాంబికాలకు, భేషజాలకు పోలేదు.అటు కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరించారు. తర్వాత బీజేపీలో చేరినా ఆమె పరిమిత పాత్రను పోషించినా స్వచ్ఛమైన రాజకీయాలను చేయడానికే ఇష్టపడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఎన్టీఆర్ కుమార్తె అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. తన పార్టీని గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు.
సామాన్య గృహిణిగా...
ఇక ఎన్టీఆర్ మరో కుమార్తె భువనేశ్వరి. తండ్రి ముఖ్యమంత్రి. తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి తన భర్త చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా ఆమె పాలిటిక్స్ వైపు చూడలేదు. తాను వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా కుమారుడు లోకేష్ ను కూడా రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రోత్సహించారు తప్పించి, ముఖ్యమంత్రి భార్యగా ఆమె ఏనాడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో కన్పించడం మినహా మరే సమయంలో కన్పించడం చాలా అరుదు అనే చెప్పాలి.
జనంలోకి...
అలాంటి భువనేశ్వరి గత పదహేడు రోజుల నుంచి రాజమండ్రిలోనే ఉన్నారు. తన భర్త చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉండటంతో ఆమె అక్కడే ఉండి భర్తకు నిత్యం భోజనాన్ని వండి పంపిస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లోనూ రాటుదేలే ప్రయత్నం చేస్తున్నారు. కుమారుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఆమె ప్రజల్లోకి వెళుతున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. తన భర్త త్వరగా ఈ కేసు నుంచి బయట పడాలని ఇటు దేవుళ్లకు మొక్కుకుంటూనే అటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఎన్టీఆర్ కుమార్తెలు వీరు కదా? అని సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టింగ్లు కనపడుతున్నాయి. అక్కాచెల్లెల్లు వేర్వేరు పార్టీలయినప్పటికీ వారు చేస్తున్న పోరటానికి అభినందనలు వెల్లువలా వస్తున్నాయి.
Next Story