తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా కోట్ల రూపాయల ఖర్చు - పొలిటికల్ ప్రకటనలపై విశ్లేషణ
భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు మూలస్తంభమైన లోక్‌సభ ఎన్నికలు, కఠినమైన రాజకీయ ప్రచారానికి
ఈ కథనం న్యూస్ మీటర్ సహకారంతో ప్రచురించాము. దీనికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్‌ల [ICFJ] నిరాయుధ తప్పుడు సమాచారాన్ని నిరర్ధకం చేయడం అనే (Disarming Disinformation) ప్రోగ్రాం మద్దతు లభించింది.
భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు మూలస్తంభమైన లోక్‌సభ ఎన్నికలు, కఠినమైన రాజకీయ ప్రచారానికి, శక్తివంతమైన ఎన్నికల డైనమిక్స్‌కు దృశ్యకావ్యం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం దేశం సిద్ధమవుతున్న సమయంలో, సాంప్రదాయక ఆన్-ది-గ్రౌండ్ ప్రచారాలు ఇంకా డిజిటల్ వ్యూహాల ప్రభావం కొత్త ఎత్తులకు చేరుకుంది.
పొలిటికల్ అడ్వర్టైజింగ్ అనేది అభ్యర్థులు ప్రజలకు చేరువ అవ్వాలని చేసే ప్రయత్నం. ముఖ్యంగా ఏమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే విషయాలు ప్రజలకు తెలియజేయడం ఇందులో భాగమే!! ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయడానికి సాధారణంగా ప్రకటనలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా తమకే ఓటు వేయమని ఓటర్లను కోరుతూ ఉంటారు. తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి చేసే పనులపై వ్యతిరేకత తీసుకుని రావడానికి కూడా ప్రయత్నిస్తారు.
గతంలో, రాజకీయ పార్టీ ప్రచార ప్రకటనలు న్యూస్ పేపర్ ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లు, బ్రోచర్లు, రేడియో, టీవీ ప్రకటనలు, ఈ మెయిల్ల రూపంలో ఉండేవి. అయితే ఇటీవలి సంవత్సరాలలో సోషల్ మీడియాను రాజకీయ ప్రచారం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆన్లైన్లో ప్రచారాలను నిర్వహించేందుకు బలమైన సోషల్ మీడియా బృందాలను తయారు చేసుకున్నాయి.
భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారులలో ఒకటి. మిలియన్ల మంది ఓటర్లతో కనెక్ట్ కావడానికి రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా, ఇంకా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి.
ఎన్నికల ప్రచార వ్యూహాలలో, రాజకీయ కథనాలను రూపొందించడంలో, వాటిని వ్యాప్తి చేయడంలో, ఇంకా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఆలోచనల-ఆదర్శాల యుద్ధభూమిగా మారుతోంది. ఈ మా నివేదిక జనవరి నుండి ఏప్రిల్ వరకు మేము జరిపిన పరిశోధన సారాంశం. ఈ నివేదిక ప్రచురించే సమయానికి దేశంలో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దేశంలో NDA, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో TDP-BJP-JSP అధికారాన్ని స్థాపించాయి. ఈ రిపోర్టులో పేర్కొన్నట్టు, YSRCP ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, అనుకున్న విజయాన్ని సాధించలేకపోయిందన్న అంశాన్ని మేము పరిగణనలోకి తీసుకున్నాము.
ఇది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఏ విధంగా ఉపయోగించుకున్నాయో విశ్లేషించే అధ్యయనం మాత్రమేనని పాఠకులు గుర్తించాలి.
మెథడాలజీ
తెలుగు రాష్ట్రాల్లో BJP, కాంగ్రెస్, YSRCPల ప్రాక్సీ/ఫ్యాన్ పేజీల ద్వారా నడిచే రాజకీయ ప్రకటనలను విశ్లేషించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని కోసం, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో రాజకీయ ప్రకటనల డేటాను, మెటా యాడ్ లైబ్రరీ నుండి సేకరించాము. మా అధ్యయనం డేటాబేస్ జాబితాలోని మొదటి 10 పేజీలపై దృష్టి సారించి, BJP, కాంగ్రెస్ లేదా YSRCPకు అనుకూలంగా ప్రకటనలను ప్రదర్శించే అనధికారిక పేజీలను ఫిల్టర్ చేసి, ఎంగేజ్మెంట్ ఆధారంగా ఈ పేజీల నుండి పోస్ట్‌లను వేరు చేసి, ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంటరాక్షన్లు ఉన్నవాటిని శాంపిల్ చేసాము.
మెటా యాడ్ లైబ్రరీ అనేది యాడ్ పారదర్శకత కోసం సమగ్రమైన, శోధించదగిన డేటాబేస్. ఖర్చుపై, రీచ్ పై ఇంకా ఫండింగ్ ఎంటిటీలతో సహా మెటా టెక్నాలజీలలో వారు చూసే ప్రకటనల గురించి వివరణాత్మక సమాచారాన్ని వినియోగదారులకు ఇది అందిస్తుంది. సామాజిక సమస్యలు, ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల అదనపు సమాచారాన్ని కూడా అందిస్తుంది, ఈ ప్రకటనలు యాక్టివ్‌గా ఉన్నా లేదా నిష్క్రియంగా ఉన్నా వాటిని ఏడేళ్ల పాటు యాడ్ లైబ్రరీలో నిల్వ చేస్తుంది.
మెటా ప్రకటనలు ఎలా పని చేస్తాయి
నిర్దిష్ట భౌగోళిక స్థానాల్లో ఓటర్ల అభిప్రయాలను నిర్ణీత వ్యవధిలో ప్రభావితం చేయడమే మెటాలోని రాజకీయ ప్రకటనల లక్ష్యం. ఈ ప్రకటనలు వినియోగదారుల ఫేస్బుక్ లేదా ఇంస్టాగ్రామ్ ఫీడ్‌లలో "ప్రాయోజిత" / "చెల్లించబడినవి [ప్రకటనకర్త పేరు]" వంటి ట్యాగ్‌లతో కనిపిస్తాయి. ప్రకటన కోసం ఎవరు డబ్బు చెల్లించారో వీక్షకులు అర్థం చేసుకోవడానికి ప్రకటనదారు గుర్తింపుపై పారదర్శకత చాలా కీలకం. ఉదాహరణకు, ‘వాయిస్ ఆఫ్ ఆంధ్ర’ అనే పేజీ, I-PAC నెట్‌వర్క్‌లో భాగం. ‘వాయిస్ ఆఫ్ ఆంధ్ర’ పేజీ లో YSRCP ప్రకటనలను మనం చూడొచ్చు. I-PAC ద్వారా YSRCP ప్రకటనలు ‘వాయిస్ ఆఫ్ ఆంధ్ర’పేజీలో రన్ అవుతున్నాయని ఒక సాధారణ వినియోగదారుడు గుర్తించడం కష్టం.
మెటా యాడ్ లైబ్రరీ ప్రచురించిన సమాచారం ప్రకారం, జనవరి-ఏప్రిల్ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ ప్రకటనల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన పేజీల నుండి మేము డేటాను ఫిల్టర్ చేసాము. ప్రకటనల ద్వారా నిర్దిష్ట పార్టీకి మద్దతు ఇచ్చే ఇతర పేజీలు ఇవి అయితే పార్టీతో అధికారిక అనుబంధం లేనివిగా పరిగణించబడతాయి. ఈ పేజీలు ప్రాక్సీ పేజీలుగా వర్గీకరించబడ్డాయి.
అయితే, ఈ డేటా విశ్లేషణ నుండి అధికారిక పార్టీ పేజీలు, నాయకులు వ్యక్తిగత పేజీలలో నిర్వహించే ప్రకటనలు మినహాయించబడ్డాయి.
టాప్ 100 పేజీలలో ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు సంబంధించిన టాప్ ప్రాక్సీ పేజీల జాబితాను, వారు ఖర్చు చేసిన మొత్తం ఇంకా వాటి ర్యాంకింగ్‌లను చూడండి
టాప్ ప్రాక్సీ పేజీలలో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ [YSRCP] ఇంకా భారతీయ జనతా పార్టీ [BJP]కి అనుబంధంగా ఉన్న పేజీలను మేము గమనించాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న టాప్ 4 ప్రాక్సీ పేజీలను, అలాగే భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న ఒక ప్రాక్సీ పేజీని, ప్రకటనలు ఫేస్బుక్ పేజీలలోని పోస్ట్‌ల ద్వారా షేర్ అయిన కంటెంట్‌ను మేము సమగ్రంగా విశ్లేషించాము. అదనంగా, మీరు ఈ పేజీల స్పాన్సర్లు, పేజీ క్రియేషన్ డేట్స్, పేజీ ఫాలోవర్స్ [జూన్ 9 నాటికి] ఇంకా జనవరి-ఏప్రిల్ నెలలలో ప్రతి పేజీపై ఖర్చు చేసిన మొత్తాన్ని చూడవచ్చు.
అధికారిక YSR కాంగ్రెస్ పార్టీ పేజీ జనవరి-మార్చి నెలలలో ప్రకటనలు విడుదలచేయనప్పటికీ, పార్టీ తరఫున దాదాపు 11 పేజీల నెట్వర్క్, సోషల్ మీడియా ప్రకటనలలో అత్యధికంగా ఖర్చు చేసాయి. వీటిలో, జూన్ 2023లో ప్రారంభమైన "జగనన్న సురక్ష", జూలై 2022లో ప్రారంభమైన "జగనే కావాలి" అనే పేజీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు పేజీలకు ఉమ్మడి ప్రకటనదారు "జగనే కావాలి". ఈ పేజీ ఏప్రిల్‌లో YSRCP అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా ప్రకటనలను ప్రసారం చేసింది. ఇది ఈ పేజీలకు, పార్టీకి మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తుంది.
నెట్‌వర్క్‌లోని పురాతన పేజీ "జగనన్న కి తోడుగా" 2017లో ప్రారంభించబడి, ప్రకటన ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. 2022 వరకు, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ [I-PAC] ఈ పేజీకి ప్రకటనలు అందించింది. అయితే, 2024 ఎన్నికలకు ముందు, "జగనన్న కి తోడుగా" పేరుతో మాత్రమే ప్రకటనలు వచ్చాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, నెట్‌వర్క్‌లోని మిగిలిన పేజీలు ప్రకటనలను ప్రచురిస్తున్నప్పుడు, అవి వేర్వేరు డిస్క్లైమర్స్ క్రింద ఉన్నాయి. అయినప్పటికీ, ఈ పేజీలన్నీ ప్రకటనకర్తల ఫోన్ నంబర్లుగా రెండు నంబర్లను మాత్రమే పొందుపరిచాయి. ఈ పేజీలలో ఎక్కువ భాగం విజయవాడలోని “పై ఇంటర్నేషనల్” అనే ఎలక్ట్రానిక్స్ స్టోర్ చిరునామాను నమోదు చేసింది [“పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్”, DNO 40 1 99D NO 40 1 100, రెవెన్యూ వార్డు నెం 11లో బ్లాక్ నెం 6, మున్సిపల్ వార్డు, 8C, MG రోడ్, బెంజ్ సర్కిల్ దగ్గర, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 520010]. బెంజిసర్కిల్లోని I-PAC కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఈ స్టోర్‌లో ఎన్నికల అనంతరం సీఎం జగన్ వార్‌రూమ్ సభ్యులను సందర్శించారు.
11 పేజీల్లో రెండు పేజీలు జగన్ ఫ్యాన్ పేజీలు అంటూ తమ బయోలో స్పష్టంగా పేర్కొన్నాయి. F-JAC అనే పొలిటికల్ కన్సల్టెన్సీని నడుపుతున్న మహమ్మద్ ఇర్ఫాన్ బాషా, పైపైన మనకు కనిపించేవి మంచుకొండ యొక్క కొన మాత్రమేనని, లోతుగా పరిశీలిస్తే ఇంకా చాలా వాటిని గుర్తించవచ్చని సూచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో కలిసి పనిచేసిన ఇర్ఫాన్ ఇలా వివరించారు, “ఒక అభ్యర్థి మమ్మల్ని సంప్రదించినప్పుడు, మేము వివిధ సామాజిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని బహుళ పేజీలను సృష్టిస్తాము.
సాధారణంగా, గరిష్టంగా రెండు పేజీలను మాత్రమే నేరుగా పార్టీ నిర్వహిస్తుంది; మిగిలినవి ఎన్నికల సమయంలో కన్సల్టెన్సీల ద్వారా నిర్వహించబడతాయి. ఉదాహరణకు, ఒక BJP అభ్యర్థి మతపరమైన పోస్ట్‌లను ప్రోత్సహించే పేజీని కలిగి ఉండవచ్చు, అయితే అదే అభ్యర్థికి సంబంధించిన మరొక పేజీ, వివిధ ప్రజా సమూహాలను ఆకర్షించడానికి ప్రభుత్వ అభివృద్ధి విధానాలపై మాత్రమే దృష్టి పెడుతుంది."
ఆంధ్రప్రదేశ్‌లో, రాజకీయ పార్టీలు తరచూ ఒక్కో నియోజకవర్గానికి వేర్వేరుగా కన్సల్టెంట్లను నియమించుకుంటాయి. ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించగల సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ తమ ఎన్నికల ప్రచారం కోసం నిర్దిష్ట కన్సల్టెన్సీని నియమిస్తారు. దీంతో ఏ నియోజకవర్గం మెరుగ్గా ఉంటుందని స్థానిక నేతల మధ్య పోటీ నెలకొంటుంది.
YSRCP ఎన్నికలకు కనీసం ఏడెనిమిది నెలల ముందు వారి ఆన్లైన్ ప్రచారాలను ప్రారంభించిందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో TDP కంటే చాలా ముందుందని ఇర్ఫాన్ గుర్తించారు. “ఎన్నికల ముందు, YSRCP ప్రచార పోస్ట్‌లను పోస్ట్ చేయడానికి స్టైఫండ్లను అందజేసే ప్రకటనలను ప్రసారం చేసింది. యువకులకు 30 రోజులపాటు ఒక్కో పోస్టుకు రూ.1000 చెల్లించారు. వారు చేయాల్సిందల్లా వాట్సాప్ గ్రూప్ నుండి కంటెంట్‌ని కాపీ చేసి, వారి వ్యక్తిగత ఫేస్బుక్ ప్రొఫైల్‌లలో అతికించడమే."
సోషల్ మీడియాలో ఇటువంటి టార్గెట్టెడ్ ప్రచారాలు ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేయడంలో భాగమని ప్రజలు గుర్తించడం అరుదు. ఎవరైనా పోస్ట్‌ను షేర్ చేసినప్పుడు, అది వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరి, ఆ సందేశం మరింత వ్యాప్తి చెందుతుంది.
యాడ్ లైబ్రరీ ఇంకా ఫేస్బుక్ పేజీల కంటెంట్ విశ్లేషణ
ఎన్నికలకు ముందు వచ్చిన ప్రకటనలు, ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ పథకాలు, కుల సమస్యలతో సహా వివిధ రంగాలలో ప్రతిపక్షాలపై దాడి చేయడంపై దృష్టి సారించాయి. విపక్షాల ట్రాక్ రికార్డ్ ను వారి ప్రతిపాదనలను విమర్శిస్తూనే, సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ విధానాలను హైలైట్ చేస్తుండేవి. ప్రకటనలోని కంటెంట్ విపక్షాలకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా ఉండడం మేము గమనించాం. అధికార, ప్రతిపక్షాల మధ్య వైరుధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రతిపక్షాల విశ్వసనీయతను దెబ్బతీసి, జగన్‌కు మద్దతు కూడగట్టడంమే ఈ వ్యూహ లక్ష్యం.
ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ప్రకటనల కంటెంట్ ఒక్కసారిగా మారిపోయింది. YSRCP నిర్వహించిన సమావేశాలలో, ముఖ్యంగా “సిద్దం సభ”లో సీఎం జగన్ చేసిన ప్రసంగాలపై కి దృష్టి మరల్చింది. ర్యాంప్ వాక్, ప్రజా సమస్యలపై ఆయన హృదయపూర్వక స్పందనలు, వృద్ధులు, చిన్నారుల నుదిటిపై ముద్దులు పెట్టడం వంటి ప్రచార హావభావాలతో సహా సమావేశాల్లో జగన్ డైనమిక్ ఉనికిని ఈ ప్రకటనలు ప్రదర్శించాయి. చాలా యాడ్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌ను హీరోగా, ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు రక్షకుడిగా చిత్రీకరిస్తూ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్న జనసమూహాన్ని చూపిస్తూ, తద్వారా వారి మద్దతును జగన్ కి తెలుపుతున్నట్టు కంటెంట్ ను ప్రమోట్ చేసారు . జనాదరణ పొందిన నేపథ్య సంగీతం, సీఎం జగన్ గురించి పాటలు, ముఖ్యంగా విస్తృతంగా ప్రజాదరణ పొందిన "జగన్ అజెండా సాంగ్" ఈ విజువల్స్‌తో పాటు ఉన్నాయి. ప్రతి యాడ్ సాధారణంగా డ్రోన్ షాట్లతో కూడిన భారీ జనాలను బంధించడం, సీఎం జగన్ "రెండు చేతులు జోడించి నమస్కారం" ప్రదర్శించడం వంటివి ఉంటాయి ఇక్కడ . ఈ ప్రకటనల్లో వివిధ సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ, లబ్ధిదారులు సీఎం జగన్‌ను, YSRCPని ప్రశంసిస్తున్న ప్రశంసాపత్రాలు ఉన్నాయి.
ఇక ఫేస్బుక్ పేజీ కంటెంట్ ఎక్కువగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించే మీమ్స్, యానిమేషన్స్ ఇక్కడ పై దృష్టి పెట్టింది ఇక్కడ ఇక్కడ. ఈ కంటెంట్‌లో తరచుగా ప్రతిపక్ష నాయకులపై బూటకపు ప్రచారం ఉంటుంది ఇక్కడ. ఇది జగన్ నాయకత్వం ఇంకా ప్రతిపక్షాల మధ్య విభేదాలను నొక్కి చెబుతుంది.
చాలా సందర్భాలలో, ఒకే యాడ్ అన్ని YSRCP పేజీలలో ప్రచారమవుతుంది [ ఈ యాడ్ , ఈ యాడ్ ఇలా కొన్ని యాడ్లను, అన్ని పేజీలలో చూడొచ్చు] YSRCP ఫేస్బుక్ పేజీ కంటెంట్ కూడా అన్నిఫేస్బుక్ పేజీలలో ఒకే విధంగా ఉంటుంది. అన్ని అగ్ర YSRCP పేజీలలో అవే ప్రకటనలు నడుస్తున్నట్లు మేము గమనించాము. స్పాన్సర్ పేర్లు, అన్ని పేజీలలో ఒకేలాంటి కంటెంట్, పేజీ బయోలో ఒకే చిరునామా వంటి వివరాలు అన్నీ పేజీల మధ్య ఉన్న పరస్పర సంబంధాలను(నెట్వర్క్), ఇవి ఒకే బృందంచే నిర్వహించబడుతున్నాయని సూచిస్తున్నాయి.
YSRCPని రెండవ సారి అధికారంలోకి తీసుకురావడానికి I-PAC సీఎం జగన్‌తో చాలా సన్నిహితంగా పనిచేసింది. ఈ సమన్వయం అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ప్రణాళికాబద్ధమైన కంటెంట్ ప్రకటన, పంపిణీపై నియంత్రణ, ఒకే రకమైన కంటెంట్ ను ప్రమోట్ చేస్తున్న తెలివైన ప్రచార వ్యూహాన్ని స్పష్టం చేస్తుంది. I-PAC ప్రధాన కార్యాలయంలో "ఆపరేషన్స్ హబ్"కు ఉన్న వ్యూహాత్మక స్థానం, ప్రచార కంటెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో, వ్యాప్తి చేయడంలో I-PAC - YSRCPల మధ్య సమీకృత ప్రయత్నాలను స్పష్టం చేస్తుంది.
BJPకి అనుబంధంగా ఉన్న 'మన మోదీ' పేజీలోని ప్రకటనలు మోదీ రోడ్‌షోలను ప్రముఖ సినిమాల నేపథ్య సంగీతం తో జోడించి, ఆయనను గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాయి ఇక్కడ.
ప్రకటన కంటెంట్ ప్రతిపక్ష వ్యతిరేకతను, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలను చెబుతున్నాయి. మోదీ ఇమేజ్ను పెంచేందుకు, ఆయన నాయకత్వాన్ని ప్రదర్శించేందుకు 'మన మోదీ సంతకం' , 'సమర్ధుడి సంకల్పం' వంటి వివిధ ప్రచారాలను పేజీ నిర్వహిస్తుంది. మరో ముఖ్యమైన ప్రచారం, 'మన మోదీ ABCD అభివృద్ధి' ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పనులు, నిధులపై ప్రత్యేక దృష్టి సారించి, కేంద్రంలోని NDA ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను హైలైట్ చేస్తుంది ఇక్కడ. మరియు రిజిస్టర్ చేసుకోవడానికి, మోదీకి మద్దతును తెలియజేయడానికి వినియోగదారుని వెబ్‌సైట్‌కి మళ్లించే ప్రకటనలు.
ఈ ప్రచారాలు మోదీ సాధించిన విజయాలను, దేశాభివృద్ధికి NDA నిబద్ధతను ప్రచారంచేస్తూ, BJP రాజకీయ సందేశాన్ని, ప్రజల్లో మద్దతును బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.