Sat Jan 11 2025 11:55:29 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : సమర్థత, చరిష్మా.. ఇమేజ్... ముగ్గురికీ ఒక్కో శక్తి.. ఒక్కో రకమైన సామర్థ్యం.. ఇక దబిడి దిబిడేనా?
టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. బీజేపీలో కూడా త్వరలో కూటమిలో చేరే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ పార్టీల పొత్తులపై చర్చ జరుగుతుంది. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. బీజేపీలో కూడా త్వరలో కూటమిలో చేరే అవకాశముంది. దీంతో ఈ కూటమి బలమెంత? రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ఫలితాలను సాధిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అంటే 2014 రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశముందన్న విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరగకపోవడం, రాజధాని నిర్మాణం లేకపోవడం, పోలవరం నిర్మించకపోవడం వంటి కారణాలతో ఈ కూటమికే ప్రజలు మొగ్గు చూపే అవకాశముందన్న చర్చ పొలిటికల్ కారిడార్ లో జరుగుతుంది.
బాబుపై నమ్మకం...
మూడు పార్టీలూ మూడు రకాలైన సమర్థత కలిగి ఉండటంతో కొంత అనుకూలత ఉందన్నది ఆ పార్టీ నేతల విశ్వాసం. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అనుభం రాష్ట్రానికి అవసరం అని అందరూ భావిస్తారు. విజన్ ఉన్న నేతగా ఆయనకు పేరు. అంతే కాదు.. నిరంతరం అధికారుల చేత పనిచేయించే ముఖ్యమంత్రిగా పేరుంది. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజల్లో బలమైన పేరుంది. అంతే కాదు ఐదు దశాబ్దాల టీడీపీని ఒంటి చేత్తో నడిపించడమే కాకుండా, ఆ పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్, బూత్ లెవెల్లో ఉన్న పటిష్టమైన ఓటు బ్యాంకు వంటి సానుకూల అంశాలుగా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబును చూసే ఓటు వేసే వారున్నారంటే అతి శయోక్తి ఎంత మాత్రం లేదు. ఆయన నాయకత్వం, సమర్ధత మీద అంత విశ్వాసం ఉంది.
పవన్ పవర్ కలిస్తే....
ఇక మరో పార్టీ జనసేన. పవన్ కల్యాణ్ సినీ గ్లామర్ మాత్రమే కాదు.. ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా ఈ కూటమికి అనుకూలించే అంశాలు. ఏపీలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. ఎలాగైనా ఈసారి పవన్ కల్యాణ్ కు చెందిన పార్టీ అధికారంలోకి రావాలని కోరకుంటున్నారు. ఆ ఒక్క కోరిక చాలు గంపగుత్తగా ఈ కూటమికి చేరతాయనడానికి. కాపు యువతతో పాటు ఎక్కువ మంది ఈసారి పవన్ ప్రభుత్వంలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఆయన సినీ హీరోగా అభిమానులకు కొదవలేదు. లక్షల్లో ఉన్న అభిమానులు ఆయనను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తుంటారు. అందుకే పవన్ కల్యాణ్ ఈ కూటమిలో అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాల్సిన పనిలేదు. ఆయన సభలకు స్వచ్ఛందంగా పెద్దయెత్తున యువత తరలి రావడమే ఇందుకు నిదర్శనం.
మోదీ చరిష్మా....
కూటమిలోకి చేరుతుందని భావిస్తున్న మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేదు. అయితే మోదీ చరిష్మా మాత్రం పెద్ద అస్సెట్ అని చెప్పాలి. ఆయనకు అన్ని వర్గాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా హిందూ ఓటర్లు మోదీని తమ ఇంట్లో మనిషిగా చూడటం ప్రారంభమయిన తర్వాతనే బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి అయోధ్య ఆలయనిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ట మరింత క్రేజ్‌ను పెంచాయి. దీంతో చంద్రబాబుకు, పవన్ కు ఉన్న పట్టుకు తోడు మోడీ ఇమేజ్ తోడు అయితే ఇక తిరుగుండదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఓట్లు బదిలీ కావడం, పార్టీ నేతలు సమన్వయంగా పనిచేయడం, కార్యకర్తలు శ్రమించి బూత్ లెవెల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయడం వంటివి చేస్తే వీళ్ల కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story