Sun Dec 22 2024 21:32:51 GMT+0000 (Coordinated Universal Time)
TDP : మూడో వారంలో ఫస్ట్ లిస్ట్.. తమ్ముళ్లూ...బీ రెడీ.. అంటున్న సైకిల్ పార్టీ చీఫ్
టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితాను సంక్రాంతి పండగ తర్వాత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖారారు చేసే పనిలో పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సయితం రేపటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు ప్రారంభిస్తున్నారు. జనసేనతో పొత్తు అధికారికంగా కుదుర్చుకున్న తర్వాత విశాఖలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరో రెండు సభలను కూడా ప్లాన్ చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పాల్గొనేలా యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు. డేట్స్ ఫిక్స్ కాకపోయినా సంక్రాంతి తర్వాత ఈ సభలు ఉండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై...
ిఇదిలా ఉండగా చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. శాసనసభ, లోక్సభ ఎన్నికలు కలసి వస్తుండటంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే బీజేపీతో పొత్తు ఇంకా కుదరలేదు. అయినా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారిని జనంలోకి పంపాలన్న యోచనలో ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలో అభ్యర్థులను ఎక్కువ శాతం మందిని ప్రకటించే అవకాశముందని తెలిసింది. రాయలసీమలో జనసేన, కూటమిలోకి వస్తే బీజేపీ కూడా పెద్దగా సీట్లను కోరుకోదు కాబట్టి అక్కడ అభ్యర్థులను తొలుత ప్రకటించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
సీమలోని నాలుగు జిల్లాల్లో...
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 62 శాననసభ స్థానాల్లో దాదాపు నలభై స్థానాల్లో అభ్యర్థులను తొలి విడతగా ప్రకటించాలన్న ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారు. పాత చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తే వారు జనంలోకి వెళ్లి పార్టీ మ్యానిఫేస్టోను బలంగా తీసుకెళతారని భావిస్తున్నారు. గత ఎన్నికలలో రాయలసీమలో కేవలం మూడు సీట్లు మాత్రమే టీడీపీకి రావడంతో ఈసారి అత్యధికంగా స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు. సీమలో పెద్దగా ఆశావహులు లేకపోవడం, కొన్ని నియోజకవర్గాలు మినహా దాదాపు ఎక్కవ అసెంబ్లీ సెగ్మంట్లో తనకు అభ్యర్థి ఎవరో క్లారిటీ ఉండటంతో దీనిపై పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం కూడా చంద్రబాబుకు ఉండి ఉండకపోవచ్చు.
కోస్తాంధ్రతో పాటు...
రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. సంక్రాంతి పండగ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. మ్యానిఫేస్టో కూడా సంక్రాంతి తర్వాతనే జనసేన, ఉమ్మడి రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా ఉండటంతో దాదాపు యాభై స్థానాలకు పైగానే ఫస్ట్ లిస్ట్ను విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలే ఉంటారంటున్నారు. ఈ ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి పేర్లే తొలి జాబితాలో ఉండే విధంగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి తమ్ముళ్లూ.. బీ రెడీ... ఫస్ట్ లిస్ట్ వచ్చేస్తుంది.
Next Story