Mon Jan 13 2025 05:30:01 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్లానింగ్ చేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన ఎప్పుడు బెయిల్పై బయటకు వస్తారన్నది పక్కన పెడితే ఇప్పుడు ఆయన వచ్చిన వెంటనే చేసే మొదటి పని ఇదేనంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చినా తొలుత రాజమండ్రి నుంచి నేరుగా భారీగా ర్యాలీతో బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నిర్వహించడానికి నేతలు ప్లాన్ చేస్తున్నారు.
రాజమండ్రి నుంచి...
చంద్రబాబు ఈ ర్యాలీల సందర్భంగా అనేక చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తారట. నియోజకవర్గాల వారీగా భారీగా జనసమీకరణను చేయాలని మూడు జిల్లాల్లో ఉన్న నియోజకవర్గ నేతలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకూ, అటు రాయలసీమలోని అన్ని ప్రాంతాల నుంచి నేతలతో పాటు కార్యకర్తలను కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇందుకు ముందుగా పోలీసుల అనుమతిని ఎక్కడికక్కడ తీసుకోవాలని నేతలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మీడియా సమావేశానికి...
చంద్రబాబు బెజవాడ చేరుకోగానే తొలుత మీడియా సమావేశం పెట్టి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులతో పాటు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో జరిగిన విషయాలను ఆయన వివరించనున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి జాతీయ మీడియా ప్రతినిధులను కూడా పిలిచేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మీడియా సమావేశం ముగించుకున్న తర్వాత చంద్రబాబు నేరుగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
విడుదల రోజు నుంచి...
చంద్రబాబు విడుదల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అగ్రనేతలందరూ హాజరై ర్యాలీతో పాటు సభలను కూడా సక్సెస్ చేసి జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తిరుమల నుంచి వచ్చిన తర్వాత మూడు చోట్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలలో భారీ సభలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. విడుదల తర్వాత ఎంత సక్సెస్ చేసుకుంటే పార్టీ అంత ప్రజల్లోకి వెళుతుందని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో టీడీపీ నేతలు సమాయత్తం చేస్తున్నారు. మరి రిలీజ్ డేట్ మామూలుగా ఉండదన్నది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. విడుదలయిన రోజు నుంచి చంద్రబాబు ఇక జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Next Story