Sun Jan 12 2025 05:23:38 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బాబుకూ అంత ఈజీ కాదు.. అసంతృప్తులను బుజ్జగించడం అంత ఆషామాషీనా?
పొత్తులతో ఎన్నికలకు వెళదామనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రానున్నకాలంలో తలనొప్పులు తప్పవు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందుకోసం అన్ని దారులు వెతుక్కుంటున్నారు. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియక చివరకు ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలతో కూడా మంతనాలు జరుపుతున్నారంటే ఆయనలో ఎంత భయం దాగి ఉందో ఇట్టే అర్థమవుతుంది. మరోసారి జగన్ చేతిలో పరాభావం ఎదురయితే ఇక పార్టీని కాపాడటం కష్టమే. వచ్చే ఎన్నికల వరకూ వెయిట్ చేసే శక్తి, ఓపిక తనకు ఉండదన్నది ఆయనకు తెలుసు.
గాజు గ్లాసు ను జాగ్రత్తగా...
తన వెనక అంతటి సమర్థులైన నాయకత్వం ఉందని కూడా ఆయన భావించడం లేదు. అందుకే ఆయన పొత్తుల కోసం పరితపిస్తున్నారు. జనసేనతో ఇప్పటికే పొత్తును ఖరారు చేసుకున్న చంద్రబాబు కలసి వస్తే బీజేపీతో లేకుంటే కమ్యునిస్టులతో జతకట్టేందుకు సిద్ధపడుతున్నారు. జనసేన పార్టీకి పెద్ద సంఖ్యలోనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎలా అనుకున్నా ముప్పయి నుంచి నలభై స్థానాలను గాజు గ్లాసు పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే గాజు గ్లాసును జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అదే జరగకుంటే పవన్ లోనూ అసంతృప్తి బయలుదేరుతుంది. కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు పవన్ ఓట్లు కూడా సైకిల్ పార్టీకి బదిలీ కావడం కష్టమవుతుందన్నది ఆయనకు తెలుసు. అందుకే పవన్ అడిగినన్ని కాకపోయినా ఎక్కువ స్థాయిలోనే సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పొత్తులు కుదుర్చుకోవడంతో....
అదే సమయంలో బీజేపీతో పొత్తు కుదిరితే దానికి కూడా పది స్థానాలకు తక్కువ కాకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కమ్యునిస్టులతో పొత్తు కుదుర్చుకుంటే రెండు నాలుగు స్థానాలతో సరిపెట్టవచ్చు. అంటే మెజారిటీ స్థానాలను చంద్రబాబు వదులుకోవాల్సిందే. తమ్ముళ్లూ.. త్యాగాలకు సిద్ధంగా ఉండండి అని చంద్రబాబు పిలుపు నిచ్చినా నేతలు ఎవరూ వినే పరిస్థితి ఉండదు. తమ అడ్డాలో మరొక పార్టీ వచ్చి గెలిచి జెండాను పాతడం వారికి ఎంత వరకూ ఇష్టముంటుంది? గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు, లోకేష్ సభలకు తాము చేతి చమురు వదుల్చుకుని, క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తుంటే ఇప్పుడు త్యాగం పేరిటి పక్కకు తప్పుకోమంటే వారు ఊరుకుంటారా? ససేమిరా ఒప్పుకోరు. చంద్రబాబు పిలిచి హామీ ఇచ్చినా వినేవాళ్లు అతి తక్కువ శాతం మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది నేతలు పార్టీ లైన్ ను దాటడానికి కూడా వెనకాడరు.
సీమలో తప్పించి...
ఎవరికైనా సీటు ముఖ్యం. తాము పోటీ చేయడం అవసరం. అంతే తప్ప మరొకరికి పెత్తనం ఇస్తామంటే అందుకు అంగీకరించే పరిస్థితులు తక్కువగానే ఉంటాయి. రాయలసీమలో చంద్రబాబుకు ఈ రకమైన ఇబ్బంది ఉండదు. ఆ నాలుగు జిల్లాల్లో పెద్దగా అలయన్స్ పార్టీల నుంచి సీట్ల విషయంలో తకరారు ఎదురు కాదు. ఎందుకంటే మిత్రపక్షాల నుంచి ఆ ప్రాంతంలో ఎక్కువ స్థానాలు కోరుకునే అవకాశం లేదు. అక్కడ ఆ పార్టీలు బలహీనంగా ఉండటమే అందుకు కారణం. అదే సమయంలో ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకూ మాత్రం సమస్య... సమస్యే. ఎవరూ తాము పోటీ నుంచి తప్పుకోవడానికి అంగీకరించరు. ఎంపీగా పోటీ చేయమన్నా అనుకూలంగా స్పందించరు. వారికి కావాల్సింది సీటు మాత్రమే. స్వీటుగా ఎన్ని మాటలు చెప్పినా వారి చెవికి ఎక్కవన్నది వాస్తవం. ఇప్పడు వైసీపీలో నెలకొన్న అసంతృప్తులు చూసి సంతోష పడే తెలుగు తమ్ముళ్లకు రానున్న కాలంలో సేమ్ సీన్ సైకిల్ పార్టీలోనూ కనిపించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. నో డౌట్.. కావాలంటే.. మీరే చూస్తారుగా?
Next Story