Wed Nov 27 2024 07:56:29 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్‌ది మొండి ధైర్యమే... అది కదా లీడర్‌కు కావల్సింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై అనేకమంది ట్రోల్ చేస్తున్నా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే
లీడర్‌కు ఉండాల్సిన లక్షణం ఒక్కటే. దేనికీ భయపడకపోవడం. ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడి తనను తాను తగ్గించుకుని ప్రవర్తించకపోవడం.. భాష సరిగా రాకపోయినా.. తాను చేయగలనన్న మొండి ధైర్యం ఉన్న వాడే అసలైన నాయకుడు అవుతాడు. రేవంత్ రెడ్డిని ప్రశంసించడం కాదు కానీ.. దావోస్ పర్యటనలో రేవంత్ పై అనేక మంది అనేకరకాలుగా ట్రోల్ చేస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. అందుకు అనేక కారణాలున్నాయి. తనకు తెలియని విషయాల్లోనూ తెలుసుకునేందుకు రేవంత్ ధైర్యంగా దావోస్ వెళ్లడమే పెద్ద సాహసమని చెప్పుకోవాలి. ఉన్నతాధికారుల బృందం వెంట ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసీ రేవంత్ వేసిన అడుగు ప్రతి రాజకీయ నేత అనుసరించాల్సిందే.
పోల్చుకుంటే...?
ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఒక ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వ హయాంలో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యేవారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా వెళ్లి వచ్చారు. సరే.. పెట్టుబడులు వచ్చాయా? ఎన్ని వచ్చాయి? ఎన్ని గ్రౌండ్ అయ్యాయి? ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్న విషయాన్ని పక్కన పెడితే కేటీఆర్, జగన్ లతో పోల్చుకుంటే.. రేవంత్ రవ్వంతేనని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రేవంత్ వాళ్లిద్దరిలాగా ఉన్నత చదువులు చదవలేదు. ఇంగ్లీష్ భాష మీద పట్టు వారిద్దరితో పోలిస్తే అంతగా లేదు. కేటీఆర్ విదేశాల్లో తిరిగి వచ్చాడు. జగన్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో చదివారు. వారికి ఆంగ్ల భాషపై పట్టుంది. వారి మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంది. కేటీఆర్, రేవంత్ మధ్య తేడాను ప్రత్యక్షంగా చూసింది ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ మాత్రమే.
పక్కాలోకల్ అయి...
కానీ రేవంత్ రెడ్డి అలా కాదు.. పక్కా లోకల్.. తెలుగు మీడియంలో చదివారు. ఏవీ కాలేజీలో బీఏ చదివిన రేవంత్ ది అంతా విలేజ్ బ్యాక్ గ్రౌండ్. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో పైకి వచ్చినవారు. సొంత కాళ్ల మీద నిలబడి పోరాటం చేసిన వాళ్లు. వాళ్లిద్దరి మాదిరిగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. పైగా దావోస్ లో నడకలోనూ, మాటలోనూ, భాషలోనూ, బాడీ లాంగ్వేజీలోనూ, వ్యవహారంలోనూ, వ్యక్తీకరణలోనూ అందులో షిరీన్ భాన్, రాహుల్ కన్వన్ లాంటి ఉద్దండులైన ఇండియన్ బిజినెస్ న్యూస్ జర్నలిస్టుల ఎదుట కుప్పిగంతులు వేయడం కుదరని పని. కానీ రేవంత్ రెడ్డి వీటికి వేటికీ భయపడలేదు. తాను అనుకున్నది చెప్పేశారు. తాను చేయగలిగింది ఇదేనంటూ చెప్పడంలో కొంత ఇబ్బంది పడినా ట్రోల్ చేసిన వారికి మాత్రం ఒక్కటే చెప్పాలి.. ఆ స్థానంలో మీరు ఉండి చూడండి.. ఎలా తడబడతారో? ఎన్ని తప్పులు దొర్లుతాయో? అదొక్కటి అర్థం చేసుకుంటే రేవంత్ చూపిన ధైర్యానికి ప్రశంసించక మానరు.
కొన్ని అభ్యంతరాలున్నా...
కాకపోతే కొన్ని ప్రశ్నలకు ఫక్తు రాజకీయ నేతగా మాట్లాడటమే కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెచ్చిన మాట వాస్తవం. కేటీఆర్ ను వ్యక్తిగతంగా దూషించకుండా గత ప్రభుత్వం చేసిన వాటిని తాము కొనసాగిస్తామని, మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఉంటే హుందాగా ఉండి ఉండేది. ముఖ్యమంత్రి హోదాకు ఒక గౌరవం కూడా దక్కి ఉండేది. అలా కాకుండా దావోస్ లోనూ రాజకీయాలు మాట్లాడి కొందరి నోళ్లలో రేవంత్ అనవసరంగా నానే పరిస్థితికి తెచ్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే రేవంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసి నవ్వుకోవద్దు. ట్రోల్ చేయవద్దు. అందులో ఆయన చూపిన ధైర్యాన్ని చూడండి. అప్పుడే లీడర్ కు కావాల్సిన లక్షణం ఏంటో ఇట్టే అవగతమవుతుంది. ఎవరేమనుకున్నా దావోస్ పర్యటనలో రేవంత్ చూపిన తెగువను మాత్రం అభినందించాల్సిందే.
Next Story