Mon Dec 23 2024 15:32:19 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ అభ్యర్థుల బేజారు.. బలమైన కారణమిదే
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్లో కలవరం మొదలయింది
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అయితే పోలింగ్ తేదీకి నేటికి దాదాపు యాభై రోజులకు పైగానే సమయం ఉంది. అభ్యర్థులకు చేతి చమురు మామూలుగా వదలదు. పార్టీ క్యాడర్ ను దాదాపు రెండు నెలల పాటు మెయిన్‌టెయిన్ చేయడం మామూలు విషయం కాదు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఐదు రాష్ట్రాల కంటే చివరి తేదీన ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల్లో బేజారు మొదలయింది. యాభై రోజుల పాటు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఈరోజు నుంచి...
ఈరోజు నుంచి ఎన్నికల వేడి మొదలయినట్లే. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ దాదాపుగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులు జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల15వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. అంటే పదిహేను నుంచి వరసగా ఆయన జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. నవంబరు నెల చివర వరకూ ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
మిగిలిన పార్టీల...
ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే కాదు. మిగిలిన పార్టీల అభ్యర్థులకూ ఆర్థికంగా నష్టమే. ఎందుకంటే దాదాపు నెలన్నర రోజుల పాటు క్యాడర్ ను మెయిన్ టెయిన్ చేయడం అంటే రోజు వారీ ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఖర్చు అధికారికంగా ఒకలా ఉంటే.. అనధికారికంగా అంతకు మించి అవుతుందన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చివరిగా తెలంగాణలోనే జరుగుతుండటం, డిసెంబరు 3న కౌంటింగ్ వరకూ ఈ ఖర్చు తప్పేట్లు లేదు. దీంతో గెలుపోటములు ఎలా ఉన్నా ముందు కోట్లాది రూాపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థిితి తెలంగాణలోని అన్ని పార్టీల అభ్యర్థులకు అవసరంగా మారింది.
మూడు నెలల పాటు...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దాదాపు నెల రోజులు కావస్తుంది. ఆ నెల రోజులకు అదనంగా మరో రెండు నెలలు. అంటే మూడు నెలల పాటు కారు పార్టీ అభ్యర్థులకు జేబులు ఖాళీ కాక తప్పదు. దీంతో పాటు మిగిలిన పార్టీలకు కూడా అభ్యర్థుల ప్రకటన, ప్రచారానికి అవసరమైన సమయం దొరకడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. అదే తొలి విడతలో జరిగి ఉంటే అభ్యర్థుల ప్రకటన, ప్రచారానికి పెద్దగా సమయం ఉండేది కాదు. గులాబీ పార్టీకి కొంత వెసులుబాటు చిక్కేది. కానీ చివరి తేదీన పోలింగ్ డే ఖరారు చేయడంతో విపక్షాలకు వీలయినంత సమయం దొరికింది. మొత్తం మీద ఇటు ఖర్చుతో పాటు అటు ప్రత్యర్థి అభ్యర్థి ప్రచారానికి అవసరమైన సమయం దొరకడంతో కారు పార్టీ అభ్యర్థుల్లో కంగారు మొదలయిందనే చెప్పాలి.
- Tags
- brs
- candidates
Next Story