Mon Dec 23 2024 07:56:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రి బెడ్ పై నుంచి గద్దర్ చివరి లేఖ
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి..
తెలంగాణ ప్రజాగళం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, తనగళంతో ఎందరినో ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చేసిన గద్దర్ ఇక లేరు. ఆయన మరణవార్తతో తెలంగాణ మొత్తం విషాదంలో మునిగిపోయింది. అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్.. ఆసుపత్రి బెడ్ పై నుంచి రాసిన చివరి లేఖలో ఇలా పేర్కొన్నారు.
"గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను.
నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్ లో ఇటీవల చేరాను. జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను.
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్ గారు, బి. సోమరాజు గారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను.
నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్ పేట్, హైదరాబాద్ కు చెందిన కింది నెంబర్ : 8978480860 (ఫ్రంట్ ఆఫీస్) కు సందేశం పంపవల్సిందిగా విజ్ఞప్తి.
ఇట్లు
ప్రజా గాయకుడు
మీ గద్దర్ " అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Next Story