Mon Dec 23 2024 01:15:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళకు అరుదైన అవకాశం
ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆమె డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు
ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆమె డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. గురువారం నాడు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ గా కర్రి సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. ఆమెను శాండీ రెడ్డి అని కూడా పిలుస్తారు. సంధ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాద్ కు చెందిన వారు. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు పొందారు. శాండీ రెడ్డి హైదరాబాదులోని స్టాన్లీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లా పట్టా తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏంఏ పూర్తి చేశారు.
సంధ్యారెడ్డి వివాహం కర్రీ బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో 1991లో జరిగింది. వివాహమైన తర్వాత ఆమె భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ కూడా తన చదువును కొనసాగించారు. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా లో డిగ్రీ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఇమిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు. ఆమె ఆస్ట్రేలియాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 2020లో ఆమె సేవలకు గాను సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్ట్రాత్ ఫీల్డ్ లో 2021లో పురపాలక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో సంధ్యారెడ్డిని ప్రవాస భారతీయులు, స్థానిక ఆస్ట్రేలియన్లు ఆమెను పోటీ చేయాల్సిందిగా కోరారు. లేబర్ పార్టీ, లిబరల్ పార్టీల అభ్యర్థుల మీద స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీకి ప్రతి ఏడు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో సంధ్యారెడ్డి ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళా శక్తిని చాటిన సంధ్యారెడ్డికి బీఆర్ఎస్ ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేష్, ఇతర నేతలు అభినందనలు తెలిపారు.
Next Story