Sat Nov 23 2024 04:23:49 GMT+0000 (Coordinated Universal Time)
లీడ్ చేసే వారు లేక లిస్ట్ తయారు చేస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. కేసుల మీద కేసులు పడుతున్నాయి. దీంతో తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల ఖరారుపై పార్టీలో సందిగ్దత నెలకొంది. తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. అధికార బీఆర్ఎస్ తమ జాబితాను ప్రకటించింది. యాభై ఐదు మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను బయటకు తెచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం రేపో, మాపో జాబితాను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలలో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
పోటీ చేస్తామని...
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పెద్దయెత్తున బహిరంగ సభ కూడా పెట్టారు. ఆ సభకు పెద్దయెత్తున జనం హాజరయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని భావించారు. ఈ మేరకు వరస సంకేతాలు అందాయి. అయితే తెలంగాణలో జనసేనతో కలసి పోటీ చేయాలని భావించింది. కానీ చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో జైలుకెళ్లడంతో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పొత్తుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చేలా లేదు. నిన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
కాసాని కలిసినా...
చంద్రబాబు కాసానికి ఏం చెప్పారన్నది ఇంకా తెలియరాలేదు. కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం తాను కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే తనకు తాను ప్రకటించకున్నారు. అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. టీడీపీ తెలుగుదేశం పార్టీకి నాధుడే కరువయ్యారు. నందమూరి బాలకృష్ణ నేనున్నానంటూ అప్పుడప్పుడు మీటింగ్లలో మెరుస్తున్నా ఆయనకు అభ్యర్థులను ఖరారు చేసే శక్తి లేదు. యుక్తి లేదు. కేవలం మీడియా సమావేశాలకే ఆయన పరిమితం అవుతారు. వ్యూహాలను రూపొందించే యుక్తి కూడా బాలయ్య బాబుకు లేవు. దీంతో రాజమండ్రి జైలు వైపు చూడటం మినహా ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలకు వేరే దారి కన్పించడం లేదు.
పొత్తులకు...
కాసాని జ్ఞానేశ్వర్ ఒక్కడి మీదే పార్టీని వదిలెయ్యరు. ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించరు. అందరికీ తెలిసిందే. మరో వైపు లోకేష్ ఉన్నారనుకున్నా ఆయన చంద్రబాబు కేసుల గురించి ఢిల్లీ, రాజమండ్రిల చుట్టూ తిరుగుతున్నారు. తన యువగళం పాదయాత్రను కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకుని మరీ అదే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీని ఎవరు లీడ్ చేస్తారన్నది తేలడం లేదు. చంద్రబాబు జైలులోనే లిస్ట్ తయారు చేసి పంపుతారని చెబుతారు. దానినే త్వరలో అభ్యర్థులుగా ప్రకటిస్తారంటున్నారు. పరిమితమైన స్థానాల్లోనే పోటీ చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరి ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story