Sun Jan 12 2025 22:17:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఆ పార్టీ నేతల పేరు ఎత్తడానికి ఇష్టపడలేదే... కారణమేమయ్యుంటుందో?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఆయన 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని పార్టీలూ ఆయనకు మద్దతు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ తమ నిరసనను తెలియజేశారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పొంది బయటకు రాగానే జైలు బయట ఆయన వేచి ఉన్న తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ అభినందనలు తెలిపారు. తనకు మద్దతు నిచ్చిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ ధన్యవాదాలు చెప్పి...
కానీ ఒక పేరు మాత్రం ఆయన నోటి నుంచి రాలేదు. బీజేపీ నేతల పేర్లు ఆయన నోటి నుంచి వినపడలేదు. ముఖ్యంగా తనతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీతో పాటు అధినేత పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఎంలతో పాటు పొరుగు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పేరు కూడా ఆయన నోటి నుంచి వచ్చింది. బీఆర్ఎస్ లో కొందరు నేతలు చంద్రబాబుకు మద్దతు పలకడంతో ఆయన తన కృతజ్ఞతలు తెలిపారని అనుకోవచ్చు. చివరకు కాంగ్రెస్ పేరు కూడా ఆయన ఉచ్ఛరించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు హర్షకుమార్, చింతా మోహన్ వంటి వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపి ఉండవచ్చు.
బీజేపీ పేరు మాత్రం...
అయితే బీజేపీ నేతల పేర్లు మాత్రం ఆయన నోటి నుంచి వినపడకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అమిత్ షా నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది. కానీ ఆ పేర్లు ఏమీ ఆయన ఎత్తేందుకు ఇష్టపడలేదు. ఏపీ బీజేపీ తొలి నుంచి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూనే ఉంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పట్టారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు. దీంతో పాటు నారా లోకేష్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశమై చర్చించారు. ఇంత చేసినా చంద్రబాబు బీజేపీ పేరును తలచుకోక పోవడంపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. తన అరెస్ట్ వెనక బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పార్టీ నేతలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు.
పోటీ చేయకపోవడానికి...
తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా కొంత కారణమదేనని చెబుతున్నారు. పోటీ చేస్తే కాంగ్రెస్ కు కాకుండా టీడీపీ ఓటు బ్యాంకు వేరే పార్టీకి బదిలీ అవుతాయేమోనని భావించి పోటీ నుంచి తప్పుకున్నట్లు నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీ సమీప భవిష్యత్ లో తమ పార్టీతో పొత్తు పెట్టుకోదని భావించిన చంద్రబాబు ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జనసేన, కమ్యునిస్టు పార్టీలతోనే ఏపీ ఎన్నికల్లో కలసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ పేరు కూడా ఎత్తడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడం వెనక చాలా కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. బీజేపీతో నేరుగా యుద్ధం చేయడానికే చంద్రబాబు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story