Fri Nov 22 2024 23:39:38 GMT+0000 (Coordinated Universal Time)
మూకుమ్మడి రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇది ఒకింత సక్సెస్ అయిందనే చెప్పాలి. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న అనేక ప్రయత్నాల్లో ఇది ఒకటి. నిరసన ప్రదర్శనలతో పాటు ప్రముఖుల చేత బాబు అరెస్ట్ ను ఖండించడం ద్వారా ప్రజల మనసును గెలుచుకోవడం లక్ష్యంగా పార్టీ నేతలు కార్యాచరణను సిద్ధం చేశారు.
వరస కేసులతో...
మరోవైపు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో న్యాయ పోరాటం కూడా పార్టీ చేస్తుంది. పేరున్న న్యాయవాదులను రంగంలోకి దింపి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుపై ప్రభుత్వం వరస కేసులు పెడుతోంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసుతో పాటు తాజాగా ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా పీటీ వారెంట్ ఇచ్చింది. దీంతో చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకెళ్లడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. తమ అధినేత నిర్దోషిగా బయటపడతారని చెబుతున్నప్పటికీ వరస కేసులతో ఆయన ఇప్పుడిప్పుడే బెయిల్ పై బయటకు రాలేరన్నది విశ్లేషకుల అంచనా.
మూకుమ్మడి రాజీనామాలు...
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమయిన తర్వాత అందరూ రాజీనామా చేసి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు రాజీనామా చేస్తారా? లేదా రెండు మూడు రోజులు తాము చర్చకు పట్టుబట్టి చివరి రోజున రాజీనామా చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఇంకా చర్చ జరుగుతుంది.
ఎమ్మెల్యేలు.. ఎంపీలు...
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం 19 మంది ఉన్నారు. ముగ్గురు ఎంపీలున్నారు. వీరంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి చంద్రబాబు అరెస్ట్‌ను జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మార్చే ప్రయత్నంలో ఉంది. అయితే రాజీనామాలు ఎప్పుడు చేస్తారు? ముహూర్తం ఎప్పుడు? అన్నది ఇంకా నిర్ధారణ కాకపోయినా జగన్ ను నిలువరించడానికి మాత్రం తమ రాజీనామాలు ఉపయోగపడతాయని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మినహా అందరూ రాజీనామా చేసి దేశంలో చంద్రబాబు అరెస్ట్ ఒక హాట్ టాపిక్ చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. మరి జగన్ కు మాత్రం ఇది కొంత ఇబ్బంది తప్పదని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story