Sun Dec 22 2024 22:03:12 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఎన్డీఏలోకి టీడీపీ.. ఏడేళ్ల తర్వాత...ఎన్నికల వేళ కుదిరిన ఒప్పందం
ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ చేరేందుకు సిద్ధమయింది. నిన్న కేంద్ర అమిత్ షాతో చంద్రబాబు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి
ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ చేరేందుకు సిద్ధమయింది. నిన్న కేంద్ర అమిత్ షాతో చంద్రబాబు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అయితే సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు జరగకపోయినప్పటికీ ఎన్డీఏలోకి వెళ్లేందుకు చంద్రబాబు అమిత్ షా వద్ద అంగీకరించినట్లు తెలిసింది. 2014లో ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయింది. మంత్రి పదవులు ఇచ్చి పుచ్చుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుందన్నకున్న సమయంలో ప్రత్యేక హోదా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. తాము ప్రత్యేక హోదా ఇవ్వలేని ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు.
2017లో బయటకు వచ్చి...
అయితే హోదాపై వెనక్కు తగ్గడం, ప్యాకేజీని అంగీకరించడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలయిందని అంచనా వేసుకున్న చంద్రబాబు ఎన్డీఏ నుంచి 2017లో బయటకు వచ్చారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన తీసుకున్న నిర్ణయంతో రెండు చోట్ల భాగస్వామిగా ఉన్న పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేశారు. అంతటితో కధ ముగియలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లీతో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల ధర్మపోరాట దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా కావాల్సిందేనని పట్టుబట్టారు. తిరుపతి వచ్చిన అమిత్ షాను కూడా నల్లబెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఒంటరిగా పోటీ చేసి...
కానీ 2019 ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసినవే. ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రాలేకపోయిన చంద్రబాబు 23 సీట్లకే పరిమితమయ్యారు. అయితే చంద్రబాబు గమనించాల్సిన అంశం ఒకటుంది. నాడు మోదీ పై వ్యతిరేకత పది శాతం ఉంటే చంద్రబాబు ప్రభుత్వంపై 90 శాతం అసంతృప్తితో ఉన్న ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. అందుకే ఆయనకు ఎన్నడూ లేనిది, టీడీపీ చరిత్రలో ఎన్నడూ రానన్ని సీట్లు వచ్చాయి. అయితే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విశాఖపట్నంలో చంద్రబాబు మోదీ అనుకూల ప్రకటన చేశారు. తాను మోదీని ఏ పరిస్థితుల్లో వ్యతిరేకించింది చెప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అవసరమని, దేశ అభివృద్ధి బీజేపీతో సాధ్యమని చెప్పేశారు.
ఓపిగ్గా ఎదురు చూసి మరీ...
అప్పటి నుంచి వెయిట్ చేసిన చంద్రబాబుకు ఇప్పటి కాని ఢిల్లీ తలుపులు తెరుచుకోలేదు. అంటే నాలుగున్నరేళ్లు చంద్రబాబు చాలా ఓపిగ్గా ఎదురు చూశారు. బీజేపీతో కలసి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీతో అప్పటికే అలయన్స్ లో ఉన్న జనసేనతో అధికారికంగా కలసి ప్రయాణించాలని నిర్ణయించారు. జగన్ ను విడివిడిగా పోటీ చేస్తే ఓడించలేమని భావించిన చంద్రబాబు బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ, తమకు రక్షణగా ఉంటుందని భావించి ఆయన హస్తిన నుంచి పిలుపు కోసం ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నారు. నేడు ఫలించింది. ఎన్డీఏలో ఆయన చేరనున్నారు. తర్వాత సీట్ల పంపకంపై చర్చ జరగనుంది. మరి ఈసారి ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాలను అందిస్తున్నది చూడాల్సి ఉంది.
Next Story