Mon Dec 23 2024 09:22:06 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రయాన్ వెనుక ఉన్న తెలుగు వాళ్లు వీరే..!
చంద్రయాన్ 3 ప్రయోగంలో బాపట్ల జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త
చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ వెనుక అనేక మంది శాస్త్రవేత్తల నిరంతర శ్రమ ఉందనే విషయం తెలిసిందే..! ఒక్కరితోనో.. ఇద్దరితోనో పూర్తయ్యే మిషన్ కాదిది. ఎంతో మంది కలిసి.. ఫెయిల్యూర్ లను అధిగమించి ఈ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపేలా చేశారు. ఈ మిషన్ లో పనిచేసిన కొందరు తెలుగు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం.
చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలుగు వ్యక్తి. విశాఖలోని సీతమ్మధార స్వస్థలమైన శ్రీకాంత్ తన డిగ్రీ మెుదటి సంవత్సరం మచిలీపట్నంలో పూర్తి చేశారు. మిగిలిన రెండేళ్ల విద్యను విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో Msc ఎలక్ట్రానిక్స్ పూర్తీ చేశారు. ఆ తర్వాత ఇండోర్ లో ఎంటెక్ పూర్తి చేసిన ఆయన ఇస్రోలో శాస్త్రవేత్తగా ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్స్ మిషన్ కు ఆపరేషన్ డైరెక్టర్‌గా, చంద్రయాన్-2కి డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా, చంద్రయాన్-3కి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం శ్రీకాంత్ బెంగళూరులో నివాసం ఉంటున్నారు.
చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో తెలుగు మహిళలు ఇద్దరు ఉన్నారు. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినవారు. శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయంలో చదుపు పూర్తి చేసిన ఉషశ్రీకాంత్.. అనంతపురానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త సాయిచందన సైతం చంద్రయాన్-3 విజయవంతం కావటంలో తన పాత్రను పోషించారు. శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్‌లో 1995-1998 బ్యాచ్‌కు చెందిన ఉషశ్రీకాంత్ ఫిజిక్స్ అభ్యసించారు. చంద్రయాన్ 3లో శాస్త్రవేత్తగా ఆమె పాల్గొన్నారు. సత్యసాయి స్వయంగా ఇచ్చిన చీరను ఆమె ధరించి ప్రయోగాల్లో పాల్గొన్నారు.
దుగ్గిరాలకు చెందిన మాజేటి మురళి చంద్రయాన్-3లో రాడార్ కంట్రోలర్ విభాగం జనరల్ మేనేజర్‌గా సేవలు అందించారు. 1992లో శ్రీహరికోటలో మురళి శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. వివిధ విభాగాల్లో పనిచేశారు. చంద్రయాన్ 3తో కీలకంగా పని చేశారు. చిన్న కుటుంబంలో పుట్టిన మురళి ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగి జిల్లాకు ఎనలేని కీర్తి తీసుకొచ్చారు. తమ గ్రామానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్ 3 ప్రయోగంలో బాపట్ల జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త బొల్లు మానస భాగస్వామిగా ఉన్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగేలా ఇస్రో రూపొందించిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ కీలక శాస్త్రవేత్తల బృందంలో ఆమె ఒకరు. మానస కేరళలోని తిరువనంతపురం ఐఎస్టీ కళాశాలలో ఏవియానిక్స్ చదివారు. 2014లో బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు సాఫ్ట్వేర్ టెస్టింగ్ విభాగంలోనూ ఈమె శాస్త్రవేత్తగా సేవలందించారు. చంద్రయాన్ ప్రయోగం విజయం చంద్రుడిపై మానవ సహిత యాత్రకు దోహదం చేస్తుందని మానస తెలిపారు.
చంద్రయాన్ 3 శాస్త్రవేత్తల బృందంలో మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన శాస్త్రవేత్త రమేష్ పనిచేశారు. గిరిజన కుటుంబానికి చెందిన రమేష్ మూడేళ్ల నుంచి ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. చంద్రయాన్ 3 విజయంతం కావడంతో బెంగళూరులోని నియంత్రణ కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో తన సహచరులతో కలిసి పాల్గొన్నారు.
విజయనగరానికి చెందిన కరణం దుర్గాప్రసాద్ చంద్రయాన్ 3 ప్రయోగంలో పని చేశారు. ఈయన అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పీఆర్ఎల్)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్-2 మిషన్‌కు సైతం పని చేశారు. చంద్రయాన్-3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ పర్యవేక్షక బృందానికి నాయకత్వం వహించారు. సంతకవిటి మండలం సిరిపురానికి చెందిన బూరాడ సతీష్ కూడా ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించారు.
చంద్రయాన్ ప్రయోగంలో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరానికి చెందిన అవ్వారు చందన (26) భాగస్వామి అయ్యారు. 2019లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించిన ఐఐఎస్టీ పోటీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి ఎంపికయ్యారు. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ కేంద్రంలో విక్రమ్ ల్యాండర్ డిజైనర్ విభాగంలో పనిచేస్తున్నారు.
హైదరాబాద్ నగరం ఉప్పల్‌కు చెందిన దేవసాని భరత్ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఆరేళ్లుగా చేస్తున్నారు. చంద్రయాన్-3లో టెలీ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ బృందంలో భరత్ సభ్యుడిగా ఉన్నారు.
బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లో ఖమ్మం నగరానికి చెందిన వల్లూరు ఉమామహేశ్వరరావు ఆపరేషన్స్ మేనేజరుగా పనిచేస్తున్నారు. పదేళ్లలో ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో, చంద్రయాన్-2లో భాగస్వామిగా ఉన్నారు. చంద్రయాన్-3ని డిజైన్ చేసిన 30 మంది శాస్త్రవేత్తల బృందంలో ఉమామహేశ్వరావు ఒకరు. చంద్రయాన్ 3 లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
‘చంద్రయాన్-3’ ప్రయోగంలో రేంజ్ ఆపరేషన్ విభాగంలో కొత్తగూడెం మధురబస్తీకి చెందిన జక్కుల సాయితేజ పనిచేశారు. ఇస్రో పరిధిలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(శ్రీహరికోట)లో ‘సైంటిస్ట్ ఇంజినీరు-సి’ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన మంగళయాన్ మిషన్, 104 శాటిలైట్ మిషన్, పీఎల్వీ సీ-42, జీఎస్ఎల్వీ, ఆర్ఎల్వీ-45, చంద్రయాన్-2 సహా సుమారు 45 ప్రయోగాల్లో భాగస్వామిగా ఉన్నారు.
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని పెనగడపకు చెందిన రిటైర్డ్ ఇస్రో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గంజి వెంకట నారాయణ అన్నారు. టెస్టింగ్, మెటీరియల్ ఎంపిక, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లింగ్‌లో పాలుపంచుకున్నట్లు చెప్పారు. త్రివేండ్రంలో ఇస్రో డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసి జులై 31న ఉద్యోగ విరమణ పొందారు.
Next Story