Fri Nov 22 2024 18:51:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మెడపై మరో కత్తి
యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన యువగళం పాదయాత్రకు తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు కేసుల విషయంపై న్యాయనిపుణులతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడే ఉన్నారు. జాతీయ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. బీజేపీ పెద్దలతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకూ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ మాత్రం నారా లోకేష్‌కు లభించలేదు.
యువగళం పాదయాత్రను...
మరోవైపు యువగళం పాదయాత్రను వచ్చే వారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన కూడా చేశారు. దీంతో యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందని, తిరిగి పార్టీని గాడిలో పడేసేందుకు లోకేష్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఈ విషయం చెప్పినట్లు తెలిసింది. లోకేష్ యువగళ: పాదయాత్రను ప్రారంభించాలని చెప్పినట్లు తెలిసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...
ఇదే సమయంలో లోకేష్ పై వరసగా కేసులు నమోదవుతున్నాయి. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ నిందితుడిగా ఉన్నారు. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను A 14 గా చేర్చారు. ఏసీబీ కోర్టులో ఈ మేరకు సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పేరు కూడా ఉంది. ఈ రెండు కేసుల్లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ ఇప్పటికే న్యాయస్థానాల్లో అనుమతి కోరుతూ పిటీషన్ వేసింది. లోకేష్ ను కూడా నిందితుడిగా చేర్చడంతో ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అరెస్ట్ ఎప్పుడనేది?
లోకేష్ ను యువగళం పాదయాత్ర ప్రారంభించకముందే సీఐడీ అధికారులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏదో ఒక కేసులో లోకేష్ ను అరెస్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అనుమానిస్తున్నారు. ఆయనను ఢిల్లీ వెళ్లి అరెస్ట్ చేస్తారా? లేక ఇక్కడకు యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి వస్తారు కాబట్టి అప్పుడు అరెస్ట్ చేయాలా? అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ ను అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Next Story