Thu Nov 07 2024 10:29:41 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఆలోచన అదే.. ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగానే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. సీఎం పదవి లక్ష్యంగానే ఆయన ప్రయత్నిస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని పార్టీ అభిమానులతో పాటు ఫ్యాన్స్, సామాజికవర్గం ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. పవన్ కూడా పదే పదే ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రి పదవిని చేపడతానని చెబుతూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారన్న సందేహం మాత్రం పార్టీ క్యాడర్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆయన విడిగా పోటీ చేసి గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న నమ్మకం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే టీడీపీతో పొత్తుకు చాలా మంది విముఖత చూపుతున్నారు.
ఛాన్స్ లేదని...
టీడీపీలో పొత్తులో ఉన్నంత కాలం చంద్రబాబు ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చే అవకాశం లేదని చాలా మంది జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. షరతులు లేకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై కాపు సామాజికవర్గంలోనూ అసంతృప్తి, అసహనం గూడుకట్టుకుని ఉంది. చంద్రబాబు కోసం జగన్ ను ఎందుకు ఓడించాలన్న ప్రశ్న సహజంగానే వారికి కలుగుతుంది. పవన్ కోసమైతే ఏమైనా చేయడానికి సిద్ధం కానీ, అదే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తాము ఎందుకు కష్టపడాలని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఇదే రకమైన ప్రశ్నలు వేశారు. మరికొందరు పార్టీకి రాజీనామాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పవన్ స్ట్రాటజీ మాత్రమే...
అయితే దీనిపై పవన్ దీనిపై పూర్తి క్లారిటీలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాము నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా నలభై స్థానాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో జనసేనాని ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ యాభై నుంచి అరవై స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని కూడా పవన్ అంచనా వేసుకుంటున్నారు. రెండు పార్టీల మద్య సీట్ల తేడా స్వల్పంగా ఉంటే టీడీపీని దారికి ఎలా తెచ్చుకోవాలో తనకు తెలుసునని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ అండతో...
మరోసారి బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి పవన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా చేయూతనిస్తుందని నమ్ముతున్నారు. 2024 తర్వాత గవర్నర్ చేత పవన్ కల్యాణ్ నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరేలా చేసి తానే ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తుందన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. టీడీపీకి అప్పుడు తమకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని, దానికి వేరే ఆప్షన్ కూడా ఉండదని అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే బేషరతుగా పొత్తుకు దిగుతున్నారని పవన్ కల్యాణ్ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద పవన్ కల గంటున్నారా? లేక ఆయన అంచనాలు నిజమవుతాయా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుంది.
Next Story