Sat Nov 23 2024 05:13:03 GMT+0000 (Coordinated Universal Time)
Kamareddy : ఇద్దరు హేమాహేమీలను ఓడించి... తాను నెగ్గి.. ఎవరీ రమణారెడ్డి?
కామారెడ్డి నియోజకవర్గంలో అనూహ్య మైన ఫలితం వచ్చింది. అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కాదని ప్రజలు బీజేపీని గెలిపించారు
కామారెడ్డి నియోజకవర్గంలో అనూహ్య మైన ఫలితం వచ్చింది. అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కాదని ప్రజలు బీజేపీని గెలిపించారు. బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అసలు ఎవరూ ఊహించని విజయం. అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించిందెవరు? అన్న దానిపై గూగుల్ లో పెద్దయెత్తున సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. కామారెడ్డి ప్రజలకే పరిమితమైన వెంకట రమణారెడ్డి ఇప్పుడు తెలంగాణలోనే కాదు దేశంలో నెంబర్ వన్ ట్రెండింగ్ లీడర్ అయ్యారు.
అందుకే ఫోకస్....
కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడంతో సహజంగా అక్కడ ప్రత్యేక ఫోకస్ ఏర్పడింది. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందన్న అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కూడా పట్టుబట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది. ఇద్దరు హేమాహేమీలు పోటీలో ఉండటంతో దేశమంతా అక్కడ ఆసక్తి నెలకొంది. ఇక కామారెడ్డిలో అనేక వరాలు ప్రకటించారు మంత్రి కేటీఆర్. అసైన్ మెంట్ భూములను కూడా అమ్ముకునేందుకు ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
లోకల్ కావడంతో....
అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి లోకల్. కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డిలను అక్కడి ప్రజలు నాన్ లోకల్ గా చూశారు. మాస్టర్ ప్లాన్ విషయంలోనూ అధికార పార్టీకి కాంగ్రెస్ అండగా ఉందని అక్కడి జనం నమ్మారు. అందుకే ఇద్దరినీ కాదని బీజేపీకి పట్టం కట్టారు. రమణారెడ్డి జడ్.పి ఛైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై తన గొంతు విప్పుతుండటం కూడా ఆయనకు కలసి వచ్చిందంటున్నారు.
వారిద్దరికీ ఓటు వేసినా...
తొలి నుంచి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటమే ఆయనకు కలసి వచ్చిందని చెప్పాలి. ఎన్నికల్లో కూడా ప్రతి గడపకు వెళ్లి ఆయన పలకరించి వచ్చారు. కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడంతో అది సాధ్యం కాలేదు. అది కూడా వెంకటరమణారెడ్డికి ప్లస్ అయింది. కేసీఆర్ కు ఓటేసినా కామారెడ్డిని ఉంచుకోరని, అలాగే రేవంత్ కూడా కొడంగల్ కే ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు బలంగా విశ్వసించారు. అందుకే మనల్ని నమ్ముకున్న వెంకట రమణారెడ్డికే ఓటు వేసి గెలిపించడం బెటర్ అని జనం భావించారు. దీంతో అక్కడ కేవీఆర్ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయగలిగారు.
Next Story