Sun Dec 22 2024 22:00:31 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి లడ్డూ వివాదం: అనేక సందేహాలు, మరెన్నో ప్రశ్నలు
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్‌లో గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సిట్‌కు నేతృత్వం వహిస్తారు, గోపీనాథ్ జెట్టి, విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి), కడప పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన రాజు ఉన్నారు. తిరుమలలోని టీటీడీలో జరిగిన అన్ని అవకతవకలపై సిట్ విచారణ జరుపుతుందని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సిట్ నివేదిక అందిన తర్వాత కల్తీ నెయ్యి వాడకం వెనుక ఉన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు ప్రారంభించింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీపై టీటీడీ మార్కెటింగ్ శాఖ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మే 15న 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డెయిరీకి ఆర్డర్లు ఇచ్చామని మురళీకృష్ణ తెలిపారు. జూన్ 12, 20, 25 తేదీల్లో, జూలై 6న 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డెయిరీ సరఫరా చేసిందని తెలిపారు.
వివాదం ఎలా మొదలైంది:
గత కొద్దిరోజులుగా ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నాసిరకం, జంతువుల కొవ్వు పదార్ధాలు కలిపిన నెయ్యిని వాడడానికి అనుమతించారని ఆరోపించారు. ఇది దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా హిందూ సమాజాన్ని కదిలించింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు బయట పెట్టారు.
తిరుమలలో ప్రసాదం లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి నమూనాలలో బీఫ్ ఫ్యాట్, పందికొవ్వు వంటి జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారిస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గుజరాత్‌లోని ఎన్డిడిబి ల్యాబ్ నివేదికను విడుదల చేసింది. ఏపీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వేంకటేశ్వర స్వామిని ఆరాధించే భక్తులకు ఆగ్రహం తెప్పించింది.
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు. TTD నాణ్యత తనిఖీ ప్రక్రియ పటిష్టమైనది, పరీక్షలు లేకుండా ఏమీ జరగదు. నాణ్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ట్యాంకర్లు చాలాసార్లు వెనక్కి వెళ్లిపోయాయి. తిరుమల దేవస్థానం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని వైఎస్ జగన్ తెలిపారు.
EO ప్రకటన:
2024 జూలైలో వచ్చిన కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఖండించారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యిని అసలు ఉపయోగించారా అని ప్రశ్నించగా, టీటీడీ కార్యనిర్వాహక అధికారి ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12న టీటీడీ ఈఓగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. చేప నూనె, పందికొవ్వు, బీఫ్ టాలోతో కలుషితమైన నెయ్యి, ఇతర కూరగాయల నూనెలతో పాటు జూలై 2024లో సరఫరా చేశారని ఆయన అన్నారు. తమిళనాడులో ఉన్న AR డైరీ సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో, నాలుగు ట్యాంకర్లలో నాసిరకం నాణ్యత ఉన్న ఆవు నెయ్యి ఉన్నట్లు కనుగొన్నట్లు TTD నిపుణుల విశ్లేషణ ఆధారంగా తేలింది.
ఈ ట్యాంకర్ల నుండి నమూనాలను సేకరించి పరీక్షల కోసం గుజరాత్‌లోని ఆనంద్‌లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ యొక్క సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (NDDB CALF)కి పంపారు. తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి ఎప్పుడూ ఉపయోగించలేదని ఈఓ ‘ది ప్రింట్’కు ధృవీకరించారు. ఆ సమయంలో టీటీడీకి 5 వేర్వేరు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, ఏఆర్ డెయిరీ ట్యాంకర్ల నమూనాలు మాత్రమే నాణ్యత లేనివిగా గుర్తించారని ఆయన తెలిపారు.
తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్యామలరావు మాట్లాడుతూ.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం బయటి ల్యాబ్‌లకు పంపినట్లు తెలిపారు.
వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కల్తీ నెయ్యి సరఫరా అయినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారని తెలిపారు.
ఎన్డిడిబి నివేదికను అనుసరించి తిరస్కరించబడిన పదార్థాలపై సిఎం వాదనలు ఆధారపడి ఉంటే, తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందని ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు అన్నారు.
మాటల యుద్ధం కొనసాగుతోంది:
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్డిఏ శాసనసభా పక్ష సమావేశంలో, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదని, లడ్డూల తయారీకి నాణ్యత లేని పదార్థాలు, జంతువుల కొవ్వును ఉపయోగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో షరతుల ప్రకారం, నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని, అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిని ఒక సంవత్సరానికి తగ్గించిందని చంద్రబాబు నాయుడు సూచించారు. 319 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా సరఫరా చేయగలరని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు నాయుడు దిగజారిపోయారని ఆరోపించారు.
“సర్, ఈ కీలక సమయంలో దేశం మొత్తం మీ వైపు చూస్తోంది. అబద్ధాలను వ్యాప్తి చేసే సిగ్గులేని చర్యకు చంద్రబాబు నాయుడును తీవ్రంగా మందలించాలి. నిజాన్ని వెలుగులోకి తీసుకురావడం చాలా ముఖ్యం. కోట్లాది మంది హిందూ భక్తుల మదిలో చంద్రబాబు నాయుడు సృష్టించిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు టీటీడీ పవిత్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి’’ అని జగన్ తన లేఖలో రాశారు.
నెయ్యి కల్తీ చేశారని తెలిసిన వెంటనే దానిని తిరస్కరిస్తామని, టీటీడీ ఆవరణలోకి వెళ్లేందుకు అనుమతి ఉండదని తెలిపారు. కానీ, చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో సెప్టెంబర్ 18, 2024న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారని వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ Vs ప్రకాష్ రాజ్:
గుంటూరు జిల్లా నంబూరు శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత పాలకుల దుర్మార్గపు పోకడల వల్ల పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రంగా మారిందని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జంతువుల అవశేషాలతో కలుషితం చేశారన్నారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అన్యాయానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, అందులో భాగంగానే తపస్సు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 22, 2024 ఆదివారం ఉదయం దీక్ష మొదలు పెడతానన్నారు, 11 రోజుల దీక్షను కొనసాగించిన తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో తెలిపారు.
నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, బాధ్యులను గుర్తించి శిక్షించాలని, ఈ సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకుని రావద్దని పవన్ కళ్యాణ్ ను కోరారు.
ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చే నెలలో పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుపుతానని ప్రకాష్ రాజ్ తెలిపారు.
సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు:
ఈ వివాదంపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఉండగా.. ప్రజల్లో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాలను ఎలా సేకరిస్తారో టీటీడీ వారి వెబ్సైట్లో ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదు?
- ఈ పదార్ధాల నమూనాల నాణ్యతను పరీక్షించడానికి వారికి ల్యాబ్‌లు ఉన్నాయా, అలా అయితే నివేదికలు ఎక్కడ ఉన్నాయి?
- హైదరాబాద్‌లో చాలా ల్యాబ్‌లు ఉండగా, జూలైలో గుజరాత్‌లోని NDDB ల్యాబ్‌కు నమూనా ఎందుకు పంపారు?
- జూలై 2024లో అందిన ల్యాబ్ నివేదిక సెప్టెంబర్‌లో ఎందుకు పబ్లిక్‌గా మారింది, ఫలితాలను ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం జరిగింది.
- తిరుమల దేవస్థానం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేకపోతే, అమ్మకందారుల అర్హత ప్రమాణాలను ఎందుకు తగ్గించారు. అది ఎవరి నిర్ణయం?
- ఇక చివరగా, రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా టీటీడీ ఈఓ ఎందుకు మారతాడు, ప్రభుత్వం మారడానికి టీటీడీ ఈఓకి ఉన్న సంబంధం ఏంటి?
సమస్య వెనుక ఉద్దేశాలు ఏమైనప్పటికీ, వేంకటేశ్వర స్వామి భక్తులు ఓ క్లారిటీ కోరుకుంటూ ఉన్నారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story