Mon Dec 23 2024 17:43:10 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : డీకే నుంచి నరుక్కొస్తున్నారా...? జగన్ ను ఎదుర్కొనేందుకు అందరూ ఒకటవుతున్నారే...?
ఏపీ ఎన్నికల్లో అనేక రకాల కాంబినేషన్లు కనపడుతున్నాయి. కనిపించేవి కొన్ని అయితే.. కనిపించని లోపాయి కారీ ఒప్పందాలు మరికొన్ని
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అనేక రకాలైన కాంబినేషన్లు కనపడుతున్నాయి. కనిపించేవి కొన్ని అయితే.. కనిపించని లోపాయి కారీ ఒప్పందాలు మరికొన్ని.. ఇలా జగన్ ను దెబ్బ తీసేందుకు అందరూ ఒక్కటవుతున్నారు. శత్రువులందరినీ ఏకం చేయడంలో చంద్రబాబు బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదన్నది చంద్రబాబు ఆలోచన. ఆ మేరకే ఆయన అడుగులు పడుతున్నాయి. అందులో ఏమాత్రం దాచుకోవడం లేదు. భయపడటం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూడటంతో పాటు జగన్ ఓటు బ్యాంకు గండికొట్టాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారు.
జగన్ ను ఢీకొట్టాలంటే...
ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మితృత్వం అవసరం. అందుకే తన పార్ట్నర్ పవన్ కల్యాణ్ చేత బీజేపీని కూటమిలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి అవసరమైతే పార్లమెంటు స్థానాలు ఎక్కువ సంఖ్యలో ఇవ్వడానికి కూడా చంద్రబాబు రెడీ అయిపోయారు. బీజేపీ అండ ఉంటే నిధుల సమీకరణతో పాటు ఎలక్షనీరింగ్ కూడా సులువు అవుతుందన్న ఆలోచనతో ఆయన కమలం పార్టీతో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సంకేతాలను పంపినట్లు తెలిసింది. దాదాపు పది లోక్సభ స్థానాలకు పైగానే బీజేపీకి చంద్రబాబు ఆఫర్ ఇచ్చారంటున్నారు.
తెలంగాణలో తాను చేసిన హెల్ప్కు...
మరోవైపు కాంగ్రెస్ ను కూడా బుజ్జగిస్తున్నారు. అయితే నేరుగా కాదు. తెలంగాణలో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుని అక్కడ కాంగ్రెస్ కు సాయం చేసినందున, ఇక్కడ కాంగ్రెస్ తో జగన్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల అక్కడ టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కాంగ్రెస్ పరమయ్యాయి. ముందుగా జరిగిన ఒప్పందం మేరకే చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకున్నారని చెబుతారు. అదే లెక్కలో ఇప్పుడు నేరుగా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోయినా షర్మిలతో జగన్ ఓట్లకు గండి కొట్టించాలన్న వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నారని అర్థమవుతుంది.
షర్మిలకు కీలక బాధ్యతలు...
అందుకోసమే వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్ హైకమాండ్ కు దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో మాటామంతీ జరిపారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో నలుగుతుంది. డీకే వద్దకు అనేక సార్లు వైస్ షర్మిల వెళ్లి కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసే ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు అదే డీకే ద్వారా వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను అప్పగించి జగన్ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీయగలిగితే తమ విజయం ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నారు. చూడటానికి డీకే శివకుమార్, చంద్రబాబు సమావేశం కాకతాళీయంగానే కనిపిస్తున్నప్పటికీ వారిమధ్య ఇదే రకమైన చర్చ జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
బెంగళూరు ఎయిర్పోర్టులో...
చంద్రబాబుతో డీకే శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్టులో సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరు ఎయిర్పోర్టులో పరస్పరం ఎదురయ్యారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా.. కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పూర్ వెళ్లేందుకు శివకుమార్ ఎయిర్ పోర్టుకు అదే సమయంలో వచ్చారు. రెండు విమానాలు పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి శివకుమార్ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగానే ఏపీ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. మరి జగన్ ను ఓడించడానికి శత్రువులందరూ ఏకమవుతున్నారనే అనుకోవాల్సి ఉంటుంది.
Next Story